close

క్రైమ్

చిన్నా.. వచ్చేస్తున్నా నీ చెంతకు

కన్నబిడ్డ మృతితో గుండె పగిలి...
అంత్యక్రియలైన మర్నాడే తల్లి ఆత్మహత్య

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే : అల్లారుముద్దుగా పెంచుకున్న పన్నెండేళ్ల కుమార్తె హఠాన్మరణాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. గుండె బద్దలైన స్థితిలో పదేపదే అవే జ్ఞాపకాలతో తల్లడిల్లింది. అంత్యక్రియలు ముగిసిన మర్నాడే ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన గురువారం సికింద్రాబాద్‌  చిలకలగూడ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రవికుమార్‌ కథనం ప్రకారం- దూద్‌బావి రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌లో కేబుల్‌ ఆపరేటర్‌ మనోహర్‌ కుటుంబంతో నివాసముంటున్నారు. ఆయన కుమార్తె మానస(12) కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. గత ఐదోతేదీన హఠాత్తుగా మరణించింది. ఆమె అంత్యక్రియలు బుధవారం జరిగాయి. తీవ్ర మానసిక క్షోభకు గురైన తల్లి మంజుల(38) అప్పటినుంచీ కన్నబిడ్డనే తలచుకుంటూ కన్నీరుమున్నీరైంది. తీవ్ర మనోవ్యధతో గురువారం మధ్యాహ్నం అపార్టుమెంట్‌పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేసింది. తలకు తీవ్ర గాయమై రక్తమోడుతున్న ఆమెను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాత్రంతా బిడ్డను గురించే ఆలోచిస్తూ రోదించిందని, తెల్లవారాక ‘అమ్మా నాకు భయమేస్తోంది...రావా..’ అంటూ తన కూతురు పిలుస్తోందంటూ చెప్పిందని కుటుంబీకులు తెలిపారు. భర్త మనోహర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు