close

ఆంధ్రప్రదేశ్

ఆ జీవోను రద్దు చేయించండి

గవర్నర్‌కు వర్కింగ్‌  జర్నలిస్టుల సంఘం నేతల వినతి

ఈనాడు, అమరావతి: మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే జీవోని రద్దు చేయాలన్న డిమాండుపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (ఏపీయూడబ్ల్యూజే) నాయకులు కోరారు. గురువారం రాజ్‌భవన్‌లో ఆయన్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. భారత జర్నలిస్టు సంఘం ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేశ్‌కుమార్‌, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్‌, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడు నల్లి ధర్మారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి, విజయవాడ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు తదితరులు గవర్నర్‌ని కలిసి జీవో 2430తో మీడియా స్వేచ్ఛకు ఏవిధమైన ముప్పు ఉందో వివరించారు. సంబంధిత జీవో ప్రమాదకరంగా ఉందని, తక్షణమే ఉపసంహరించుకునేలా చూడాలని కోరారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ సైతం స్పందించినట్లు పత్రికల్లో చూశానని గవర్నర్‌ వ్యాఖ్యానించినట్లు సంఘ నేతలు అనంతరం విలేకరులకు తెలిపారు.

ఉపసంహరించుకొనేలా చర్యలు తీసుకోండి
ఈనాడు, దిల్లీ: మీడియా స్వేచ్ఛను హరించేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలను ఉపసంహరించుకొనేలా చర్యలు తీసుకోవాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రమౌళీకుమార్‌ ప్రసాద్‌కు ఏడబ్ల్యూజేఏ నేతలు విజ్ఞప్తి చేశారు.

జీవో 2430ను ఉపసంహరించుకోవాలి: పత్రికలు, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాలపై కేసులు పెట్టేందుకు తీసుకువచ్చిన జీవో 2430ను తక్షణం ఉపసంహరించుకోవాలని మానవ హక్కుల వేదిక(హెచ్‌ఆర్‌ఎఫ్‌) డిమాండ్‌ చేసింది. పత్రికల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేందుకు, వేధింపులకు గురిచేసేందుకు జీవో 2430ని తీసుకువచ్చినట్టు కనిపిస్తోందని హెచ్‌ఆర్‌ఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ చర్య సమర్థనీయం కాదని హెచ్‌ఆర్‌ఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యులు వీఎస్‌ కృష్ణ, ఏ చంద్రశేఖర్‌ ఓ ప్రకటనలో ఆక్షేపించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు