close

బిజినెస్‌

స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలకు తప్పని ఇబ్బందులు

సిబ్బంది రాకపోకలను అనుమతించని పోలీసులు
ఎక్స్ఛేంజీలను నిలిపివేయాల్సిందే అంటున్న సంఘాలు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 మహమ్మారి కబళించకుండా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో స్టాక్‌ మార్కెట్‌ అనుబంధంగా పనిచేసే సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బ్రోకరేజీ సంస్థల కార్యాలయాలకు వచ్చే సిబ్బంది రాకపోకలను పలు రాష్ట్రాల్లో పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో వారు విధుల నిర్వహణకు సమయానికి హాజరుకాలేకపోతున్నారు. మంగళవారం ప్రధాని లాక్‌డౌన్‌ ప్రకటించకముందు నుంచే తమ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయని అసోసియేషన్‌ ఆఫ్‌ ఎక్స్ఛేంజ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా (అన్‌మి), కమోడిటీ మార్కెట్‌ పార్టిసిపెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీపీఏఐ)లు సెబీకి లేఖలు రాశాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్రోకింగ్‌ కార్యకలాపాలు నిలిపివేయాల్సిందిగా చాలామంది కోరుతున్నారని ఆయా సంఘాలు పేర్కొంటున్నాయి. స్టాక్‌ బ్రోకింగ్‌ సేవలను అత్యవసర విభాగంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించేలా చర్యలు తీసుకోవాలని లేదా.. మార్చి 31 వరకూ స్టాక్‌ ఎక్స్ఛేంజీలను నిలిపివేయాల్సిందిగా కోరుతూ మార్చి 23న సీపీఏఐ సెబీకి లేఖ రాసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే... రెండు రోజుల వ్యవధి ఇచ్చి, ఎక్స్ఛేంజీలను తాత్కాలికంగా నిలిపివేయాలని అన్‌మి కూడా కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. తమ సిబ్బంది కార్యాలయాలకు వచ్చివెళ్లేటప్పుడు కష్టమవుతోందని, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర సర్వీసుల కింద దీన్ని గుర్తించకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు ఒక స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ ప్రతినిథి తెలిపారు.

అత్యవసర సర్వీసుగా ప్రకటించండి - రాష్ట్రాలకు సెబీ లేఖ
స్టాక్‌ బ్రోకింగ్‌ సంఘాల అభ్యర్థన నేపథ్యంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ స్పందించింది. స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకూ, అడ్మినిస్ట్రేటర్లకూ లేఖ రాసింది. ఇందులో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్టాక్‌ మార్కెట్‌ అనుబంధ సంస్థలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించింది. సెబీ ప్రస్తావించిన సంస్థల్లో స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్లు, స్టాక్‌ బ్రోకర్లు, ట్రేడింగ్‌ మెంబర్లు, క్లియరింగ్‌ మెంబర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లు, రిజిస్ట్రార్‌, షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్లు ఉన్నారు. వీటితోపాటు క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, పెట్టుబడి సలహాదారులు తదితర మార్కెట్‌ అనుబంధ సంస్థలన్నీ అత్యవసర సేవల కిందకే వస్తాయని, వీటికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు కల్పించాలని పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు