close

బిజినెస్‌

రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌కు 10% వాటా!

దిల్లీ: రిలయన్స్‌ జియోలో 10 శాతం వాటాను కొనుగోలు చేయాలని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 31, 2020 కల్లా జియోను రుణరహిత సంస్థగా నిలపాలన్నది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లక్ష్యంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. 60 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.4,20,000 కోట్లు) విలువైన జియోలో 10 శాతం వాటాను సొంతం చేసుకోవాలని ఫేస్‌బుక్‌ యోచిస్తోంది. అయితే ఈ కథనంపై అటు రిలయన్స్‌ జియో కానీ.. ఫేస్‌బుక్‌ కానీ స్పందించలేదు.  ఒప్పందం ఎపుడు జరుగుతుందన్నదానిపై లాక్‌డౌన్‌ ప్రభావం పడవచ్చని ఆ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది.

తన అన్ని డిజిటల్‌ కార్యక్రమాలు, యాప్‌లను ఒక కొత్త అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయబోతున్నట్లు అక్టోబరులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. అదే సమయంలో ఆ కొత్త కంపెనీలోకి రూ.1.08 లక్షల కోట్లను జొప్పించనున్నట్లూ తెలిపింది. జియోటీవీ, జియోసినిమా, జియోన్యూస్‌ వంటి జియో యాప్‌లను ఈ కొత్త సంస్థలోకి తీసుకురావాలని భావించారు. తద్వారాఒక సరళమైన నిర్మాణాన్ని అందజేయడం ద్వారా వ్యూహాత్మక పెట్టుబడుదార్లను ఆకర్షించవచ్చని ఆ అడుగు వేసింది. కాగా, మార్చి 18న రిలయన్స్‌ జియోకు చెందిన కొన్ని రుణాలను ఆర్‌ఐఎల్‌ తీసుకుంది. అయితే ఆ లావాదేవీలను కానీ.. క్రెడిటార్ల పేర్లను కానీ వెల్లడించలేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు