close

బిజినెస్‌

రూ.9 లక్షల కోట్ల భారం

లాక్‌డౌన్‌ ప్రభావంపై ఆర్థిక నిపుణుల అంచనా

ముంబయి: కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశ వ్యాప్త లాక్‌డౌన్‌తో 120 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్లు) మేర ఆర్థిక వ్యవస్థపై భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది దేశ జీడీపీలో 4 శాతానికి సమానమని వారు పేర్కొన్నారు. వృద్ధి అంచనాల్లో కోత విధించడంతో పాటు ఆర్థిక ఉద్దీపన ప్రకటించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్‌ 3న ప్రకటించనున్న తొలి ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో కీలక రేట్లను 0.65 శాతం తగ్గించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. మిగతా ఆర్థిక సంవత్సరానికి కూడా అదనంగా మరో 1 శాతం రేట్ల కోతకు దిగే అవకాశం ఉంది. ద్రవ్య లోటు లక్ష్యాలను కూడా సవరించాల్సి రావొచ్చని విశ్లేషించారు.  2020-21 బడ్జెట్‌ అంచనాల్లో ద్రవ్య లోటును 3.5 శాతానికి కట్టడి చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించుకోగా, ఇప్పుడు అది 5 శాతానికి చేరుకొనే అవకాశం ఉంద’ని బ్రిటీష్‌ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ వెల్లడించింది.

రోజుకు రూ.40,000 కోట్లు
దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌తో సుమారు 80 శాతం ఉత్పత్తికి నష్టం జరుగుతుందని, దీంతో ఆర్థిక వ్యవస్థపై రోజు వారీగా రూ.35,000-40,000 కోట్ల మేర భారం పడే అవకాశం ఉందని కేర్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. 21 రోజులకు కలుపుకొంటే సుమారు రూ.6.3-7.2 లక్షల కోట్ల నష్టం జరుగుతుందని అంచనా వేసింది. 2019-20 వాస్తవిక జీడీపీ గణాంకాలను (రూ.140-150 లక్షల కోట్లు) లెక్కలోకి తీసుకొని మదింపు చేసినట్లు తెలిపింది. ఏడాదికి 300 రోజుల పని దినాలను లెక్కలోకి తీసుకొంటే, రోజువారీగా రూ.45,000-50,000 కోట్ల ఉత్పత్తి జరిగేది. ఇందులో 80 శాతం ఉత్పత్తిపై లాక్‌డౌన్‌తో ప్రభావం పడనుందని కేర్‌ రేటింగ్స్‌ అంచనా వేస్తోంది. దీని ప్రకారం చూస్తే, నాలుగో త్రైమాసికంలో వృద్ధి ప్రతికూలంగా వెళ్లే అవకాశం లేదని, జీడీపీ రూ.1.74 లక్షల కోట్లు (4.7 శాతం) పెరిగి, 1.5-2.5 శాతం వృద్ధి నమోదు కావొచ్చని విశ్లేషించింది. ‘80 శాతం ఉత్పత్తిపై లాక్‌డౌన్‌ ప్రభావం పడినా, మిగతా అత్యవసర సేవలు, వ్యవసాయం ద్వారా 20 శాతం ఉత్పత్తి జరుగుతుంద’ని పేర్కొంది. ‘21 రోజుల లాక్‌డౌన్‌లో 14 రోజులు 2020-21 ఆర్థిక సంవత్సరంలోకి వెళుతున్న సంగతి తెలిసిందే. పని దినాలు లెక్కలోకి తీసుకుంటే 18 వస్తున్నాయి. దీంతో నష్టం రూ.6.3-7.2 లక్షల కోట్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇందులో రూ.4.2-4.8 లక్షల కోట్ల నష్టం వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి జమవుతుంది. ఇది 2020-21 తొలి త్రైమాసిక జీడీపీపై ప్రభావం చూపుతుంది. అయితే లాక్‌డౌన్‌ 21 రోజులకు పరిమితమవుతుందా లేదంటే 30-60 రోజులకు పొడిగిస్తారా అనే దానిపై ఈ గణాంకాలు ఆధారపడతాయ’ని కేర్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది.

విమానయాన రంగానికి రూ. 27,000 కోట్ల నష్టం
ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో దేశీయ విమానయాన రంగానికి 3.3-3.6 బిలియన్‌ డాలర్ల(రూ.25,000-27,000 కొట్లు) నష్టం వాటిల్లే అవకాశం ఉందని విమానయాన రంగ కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. కరోనా ప్రభావం నేపథ్యంలో ఏప్రిల్‌ 15 వరకు విమాన సర్వీసులు నిలిపివేతకు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి జూన్‌ వరకు ఇలాగే కొనసాగితే విమానయాన సంస్థలకు 1.75 బిలియన్‌ డాలర్లు, విమానాశ్రయాలకు 1.50- 1.75 బిలియన్‌ డాలర్లు, గ్రౌండ్‌ హాండ్లర్స్‌కు 80-90 మిలియన్‌ డాలర్లు చొప్పున మొత్తంగా 3.3- 3.6 బిలియన్‌ డాలర్ల నష్టం రావొచ్చని అంచనా వేసింది.  మరోవైపు కరోనా వైరస్‌ నేపథ్యంలో విమానయాన సేవలను నిలిపివేయడంతో ఎయిరిండియాకు రోజుకు రూ.30-35 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు