close

తెలంగాణ

కేటీఆర్‌ ఆకస్మిక తనిఖీ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వీయ పరిశీలన

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పురపాలక మంత్రి కేటీఆర్‌ బుధవారం హైదరాబాద్‌ నగరంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పరిస్థితులను స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. మొదట ప్రగతి భవన్‌ నుంచి బుద్ధభవన్‌కు వెళ్తుండగా దారిలో నడుచుకుంటూ వెళ్తున్న కార్మికులను పలకరించారు. వారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన వారని తెలుసుకుని ఉప్పల్‌ వరకు వెళ్లడానికి వాహనాన్ని ఏర్పాటు చేయించి వారి గమ్యస్థానాలకు చేర్చే ఏర్పాటు చేశారు. బిహార్‌కు చెందిన మరో కార్మికుడికి జీహెచ్‌ఎంసీ నైట్‌ షెల్టర్‌లో బస ఏర్పాటు చేయాలని అదనపు కమిషనర్‌ శంకరయ్యను ఆదేశించారు. బుద్ధభవన్‌లో ఉన్న విపత్తు నిర్వహణ కార్యాలయాన్ని సందర్శించారు. మహానగరంలో విపత్తు స్పందన బృందాలు తీసుకుంటున్న చర్యలపై డైరెక్టర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర కార్యాలయంలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కూడా మంత్రి సందర్శించారు. కంట్రోల్‌ రూమ్‌కు వస్తున్న ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతిని అడిగి తెలుసుకున్నారు. గోల్నాకలోని జీహెచ్‌ఎంసీ నైట్‌ షెల్టర్‌ను మంత్రి సందర్శించారు. అక్కడ ఉన్నవారికి అందుబాటులో ఉన్న వసతుల గురించి ఆరా తీశారు. అనంతరం పక్కనే ఉన్న కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆయనతో పాటు ఉన్నారు.


పటాన్‌చెరు ఠాణాను తనిఖీ చేసిన మంత్రి హరీశ్‌

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం పటాన్‌చెరు పోలీస్‌ ఠాణాను ఆకస్మికంగా తనిఖీ చేశారు.లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతించాలని పటాన్‌చెరు ఠాణాకు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌ వెళుతున్న మంత్రి హరీశ్‌రావు పటాన్‌చెరు ఠాణా వద్ద రద్దీ ఉండటాన్ని గమనించి అక్కడ ఆగారు. డీఎస్పీ రాజేశ్వరరావు, సీఐ నరేశ్‌తో మాట్లాడారు. ఠాణా వద్ద రద్దీ ఉండకుండా, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు