close

ఆంధ్రప్రదేశ్

నిత్యావసర దుకాణాలు.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1వరకే

ప్రాంతాల వారీగా కూరగాయల విక్రయాలు
దుకాణాల వద్ద సామాజిక దూరానికి మార్కింగ్‌
అధిక ధరలకు విక్రయిస్తే 1902కు ఫోన్‌ చేయండి
ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌
ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి

నిత్యావసర దుకాణాలను రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరాలు, పెద్ద పట్టణాల్లోని రైతు బజార్లను వికేంద్రీకరించి.. ప్రాంతాలవారీగా కూరగాయలు విక్రయించేలా చూడాలని ఆదేశించింది. లాక్‌డౌన్‌ అమలు, నిత్యావసరాల సరఫరా తదితర అంశాలపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిత్యావసరాల కోసం ప్రజలు పెద్దఎత్తున చేరడంతో.. సామాజిక దూరం ఉద్దేశం దెబ్బ తింటోందన్న అభిప్రాయం వ్యక్తమైంది. నిత్యావసరాలు దొరకవన్న ఆందోళన ప్రజల్లో తలెత్తకుండా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఆ పంటలకు ప్రత్యేక చర్యలు
నిల్వ చేయలేని పంట ఉత్పత్తుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా.. నిత్యావసరాలను తెచ్చే వాహనాల రాకపోకలను అనుమతించాలని ఆదేశించారు. హమాలీల రాకపోకలకూ ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కృష్ణబాబు నేతృత్వం.. 1902 కంట్రోల్‌ రూమ్‌కు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు నేతృత్వం వహిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. కరోనా నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడ నుంచి సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత అత్యవసర మందుల కోసమే బయటకు రావొచ్చని చెప్పారు. లాక్‌డౌన్‌, నిత్యావసరాల విషయంలో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. విదేశాల నుంచి వచ్చినవారిని వేగంగా గుర్తించి వారిని ఐసోలేషన్‌, అవసరమైన చోట క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచాలన్నారు.

గుర్తింపు 85% పూర్తి.. విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించే ప్రక్రియ 85% పూర్తయిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వివరించారు. నిత్యావసరాల కొనుగోలులో ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఎస్పీలను ఆదేశించారు. లాక్‌డౌన్‌ అమలుకు కట్టుదిట్టంగా వ్యవహరించాలన్నారు.


వీటిని పాటించాలి..

* ప్రజలు నిత్యావసరాల కోసమే బయటకు రావాలి.
* ప్రతి 2-3 కిలోమీటర్ల పరిధిలో వారికి నిత్యావసరాలు, కూరగాయలు అందుబాటులో ఉంచాలి
* ప్రజలు సామాజిక దూరం పాటించేలా.. ప్రతి దుకాణం వద్ద మార్కింగ్‌ చేయాలి.
* రోజంతా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. నలుగురికి మించి ఒక చోట చేరకూడదు.
* నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
* కూరగాయలు, నిత్యావసరాల ధరలను కలెక్టర్లు టీవీలు, పత్రికల ద్వారా ప్రకటించాలి.
* ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే 1902 నంబరుకు ఫోన్‌ చేయాలి.
* సేవాకేంద్రంలో ఒక సీనియర్‌ అధికారిని నియమించాలి. ఫిర్యాదు రాగానే చర్యలు తీసుకోవాలి.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు