close

ఆంధ్రప్రదేశ్

నిత్యావసరాలను ఇంటింటికీ సరఫరా చేయాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ

ఈనాడు, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 3 వారాలపాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసరాలకు కొరత రాకుండా, వాటి పంపిణీ సమయంలో జనం పెద్ద సంఖ్యలో ఒకేచోట గుమికూడకుండా తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. నిత్యావసరాలను ప్రభుత్వమే ఇంటింటికీ సరఫరా చేయాలని కోరారు. బుధవారం ఈ మేరకు సీఎస్‌కు చంద్రబాబు లేఖ రాశారు. బుధవారం ఉదయం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బజారులోకి ఒకేసారి పెద్ద ఎత్తున కొనుగోలుదారుల్ని విడిచిపెట్టారని, కరోనా వ్యాప్తి నిరోధానికి సామాజిక దూరం పాటించాలన్న నిబంధనకు ఇది విరుద్ధమని ప్రస్తావించారు. రాష్ట్ర జనాభా సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఎంత మొత్తంలో నిత్యావసరాలు కావాలో అంచనా వేయాలని సూచించారు. అవసరమైన సరకులను ఎక్కడి నుంచి సేకరించాలో గుర్తించాక కరోనా వైరస్‌ సోకకుండా వాటిని ట్రక్కులు, లారీల్లో పటిష్ఠంగా ప్యాకింగ్‌ చేసి రవాణా చేయాలని తెలిపారు. ‘సరకుల పంపిణీని వికేంద్రీకరిస్తేనే సామాజిక దూరాన్ని పాటించడం సాధ్యమవుతుంది. దీని కోసం ప్రభుత్వమే ఇంటింటికీ సరఫరా చేయాలి. లేదంటే ప్రతి ప్రాంతంలోనూ ఒకచోటే పంపిణీ కేంద్రం ఏర్పాటు చేసి, ఒక కిలోమీటరు పరిధిలోని వారందరినీ అక్కడికి రమ్మని చెప్పాలి. పంపిణీ సమయం, స్థలం వివరాలను ముందే ప్రకటించాలి’ అని సూచించారు.

కరోనాపై పోరాడే యోధులకు సౌకర్యాలు కల్పించాలి
కరోనాపై పోరాడే యోధులకు అవసరమైన పరికరాలు, పారిశుద్ధ్య కిట్లను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చంద్రబాబు కోరారు. ఎన్‌-95 మాస్కులు, ఫుల్‌ స్లీవ్‌ గ్లౌజులు, ఐ షీల్డ్‌ కళ్లద్దాలు, శానిటైజర్లను సమృద్ధిగా అందించాలని, కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని సూచించారు. బుధవారం తెదేపా ఎమ్మెల్యేలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

21 రోజులు దీక్ష చేద్దాం: సోమిరెడ్డి
తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 21 రోజుల పాటు బయటకు రాకుండా ప్రజలంతా దీక్ష తీసుకుందామని తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయాలు పక్కనపెట్టి మన కోసం ఆంక్షలు పాటిద్దామని కోరుతూ బుధవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మన కోసం వైద్యసిబ్బంది కుటుంబాలను వదిలేసి ఉంటున్నారు. మన ప్రాణాల కోసం పోలీసులు బయట ఉండి విధులు నిర్వహిస్తున్నారు. వారందరికీ మద్దతుగా స్వీయ ఆంక్షలు విధించుకుందాం’’ అన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు