close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాకు క్లోరోక్విన్‌ ఇవ్వరూ!

మోదీకి ట్రంప్‌ ఫోన్‌
యోగా, ఆయుర్వేద ప్రాధాన్యాన్ని ప్రస్తావించిన ఇద్దరు నేతలు

వాషింగ్టన్‌: దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా రోగులకు చికిత్స చేయడం కోసం హైడ్రాక్సి క్లోరోక్విన్‌ మాత్రలను తమకు సరఫరా చేయాలని అమెరికా.. భారత్‌ను కోరింది. తాము ఆర్డర్‌ ఇచ్చిన రీతిలో ఈ ఔషధాన్ని ఎగుమతి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. అయితే అంతకు కొన్ని గంటల ముందే ఈ ఔషధ ఎగుమతిపై భారత్‌ నిషేధం విధించింది.

3 లక్షలకుపైగా కరోనా కేసులు, 8వేలకు పైగా మరణాలతో అమెరికా విలవిలలాడుతోంది. ఈ ఇన్‌ఫెక్షన్‌కు టీకా, ఔషధం లేకపోవడంతో హైడ్రాక్సి క్లోరోక్విన్‌పై ట్రంప్‌ ఆశలు పెట్టుకున్నారు. ఈ ఔషధాన్ని మలేరియాకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కొవిడ్‌-19 రోగులకు ఇతర ఔషధాలతో కలిపి హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను కూడా ఇవ్వాలని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సూచించింది. కరోనా రోగులు, అనుమానితులకు చికిత్స చేస్తున్న సిబ్బందికి, రోగుల దగ్గరగా వచ్చిన బంధువులకు ఈ మందును ఇవ్వాలని భారత వైద్య పరిశోధన మండలి కూడా సూచించింది.

అయితే హైడ్రాక్సి క్లోరోక్విన్‌, దానికి సంబంధించిన అన్ని మందుల ఎగుమతులను నిషేధిస్తున్నట్లు భారత విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ శనివారం స్పష్టంచేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం ట్రంప్‌.. మోదీకి ఫోన్‌ చేశారు. హైడ్రాక్సి క్లోరోక్విన్‌ సరఫరాకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ ఉదయం మోదీతో మాట్లాడా. భారత్‌లో భారీ పరిమాణంలో హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను తయారుచేస్తున్నారు. మా వినతిని భారత్‌ తీవ్రంగా పరిశీలిస్తోంది’’ అని ట్రంప్‌ విలేకరులతో పేర్కొన్నారు. అవసరమైతే తాను కూడా ఈ ఔషధాన్ని తీసుకుంటానని ఆయన చెప్పారు. కొవిడ్‌-19కు చికిత్స అక్కరకొస్తుందన్న ఉద్దేశంతో అమెరికా ఇప్పటికే 29 మిలియన్‌ డోసుల మేర హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను నిల్వ చేసి పెట్టుకుంది. మరోవైపు ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కీలక ఔషధాలు, వైద్యపరమైన సరకుల సరఫరా దెబ్బతినకుండా చూడాల్సిన   అవసరం ఉందని ట్రంప్‌, మోదీలు ఏకీభవించినట్లు వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

కరోనాపై ట్రంప్‌తో కూలంకషంగా చర్చించినట్లు మోదీ తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత్‌-అమెరికా మైత్రిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ వైరస్‌ను ఉమ్మడిగా ఎదుర్కోవాలని, ఈ విషయంలో అమెరికాకు తమ సంఘీభావం ఉంటుందని తెలిపారు. ఈ మహమ్మారి వల్ల ఆరోగ్య, ఆర్థిక రంగాలపై పడే ప్రభావాన్ని తగ్గించుకోవడానికి చేపడుతున్న చర్యలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ఇలాంటి సంక్లిష్ట సమయాల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో యోగా, ఆయుర్వేద విధానాలకున్న ప్రాముఖ్యతను ఇద్దరు నేతలు చర్చించారని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు