close

బిజినెస్‌

లాభాల హ్యాట్రిక్‌

సమీక్ష

సూచీలు వరుసగా మూడోరోజూ లాభాలతో హ్యాట్రిక్‌ నమోదు చేశాయి. ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు క్రమంగా ప్రారంభమవుతున్నందున, మదుపర్ల సెంటిమెంట్‌ బలపడింది. ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే కరోనా వైరస్‌ కేసులు అధికమవుతున్నందున కొంత అప్రమత్తత పాటించారు. ఫలితంగా చివర్లో అమ్మకాలు చోటుచేసుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు పెరిగి 75.61 వద్ద ముగిసింది. అమెరికా-చైనా ఉద్రిక్తతలతో ఆసియా షేర్లు బలహీనంగా ముగిశాయి. ఐరోపా షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్‌ ఉదయం 30,904.29 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 31,188.79 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ రావడంతో జోరు తగ్గింది. చివరకు 114.29 పాయింట్ల లాభంతో 30,932.90 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 39.70 పాయింట్లు పెరిగి 9,106.25 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 9,056.10- 9,178.55 పాయింట్ల మధ్య కదలాడింది.

* ఈ నెల 25 నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో విమానయాన షేర్లు దుమ్మురేపాయి. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు ఇంట్రాడేలో 12.84 శాతం దూసుకెళ్లి రూ.1029 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 7.28 శాతం లాభంతో రూ.978.25 వద్ద ముగిసింది. స్పైస్‌జెట్‌ షేరు 4.88 శాతం పెరిగి రూ.42.95 దగ్గర అప్పర్‌సర్క్యూట్‌ను చేరింది.
* త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో బజాజ్‌ ఆటో షేరు ఇంట్రాడేలో 6.44 శాతం లాభపడి రూ.2,722.80 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 3.18 శాతం పెరిగి రూ.2,639.45 వద్ద ముగిసింది.
* మార్చితో ముగిసిన త్రైమాసికంలో రెండింతల లాభం ప్రకటించడంతో జేకే లక్ష్మీ సిమెంట్‌ షేరు 3.34 శాతం లాభంతో రూ.206 దగ్గర స్థిరపడింది.
సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 లాభాలతో ముగిశాయి. ఐటీసీ 7.48%, ఏషియన్‌ పెయింట్స్‌ 4.97%, హీరో మోటోకార్ప్‌ 4.73%, మారుతీ 3.24%, బజాజ్‌ ఆటో 3.18%, సన్‌ఫార్మా 2.33%, టీసీఎస్‌ 2%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.51%, అల్ట్రాటెక్‌ 1.16% చొప్పున రాణించిన వాటిలో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.91%, ఎన్‌టీపీసీ 2.74%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.65%, హెచ్‌డీఎఫ్‌సీ 1.88%, ఎల్‌ అండ్‌ టీ 1.75%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.54% మేర నష్టపోయాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు