close

బిజినెస్‌

‘ కార్వీ’ది రాని బాకీయేనా?

ప్రొవిజనింగ్‌ చేస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలు

ఈనాడు, హైదరాబాద్‌: కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌కు ఇచ్చిన రుణంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రాని బాకీ కింద తమ ఖాతాల్లో ‘ప్రొవిజనింగ్‌’ (కేటాయింపులు) చేస్తున్నాయి. నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌కు రుణాలు ఇచ్చిన సంస్థల్లో ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంకు..లాంటి సంస్థలున్నాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం రాని బాకీలను ఎక్కువ కాలం పాటు రుణ ఆస్తిగా చూపించడానికి వీల్లేదు. దానికి నిర్ణీత గడువు లోగా నూరు శాతం ‘ప్రొవిజన్‌’ కేటాయించాలి. అందుకే బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు తదితర సంస్థలు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో ఈ మొత్తాన్ని ప్రొవిజనింగ్‌ చేశాయి.
ఎప్పుడు చేస్తారంటే..: ఏదైనా మొత్తం తిరిగి రాదని భావించినప్పుడు ఆదాయాల్లో దానికి సమాన మొత్తాన్ని కేటాయించడాన్ని ‘ప్రొవిజనింగ్‌’ అంటారు. కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌కు ఐసీఐసీఐ బ్యాంకు దాదాపు రూ.700 కోట్లు, బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.320 కోట్లు, యాక్సిస్‌ బ్యాంకు రూ.100 కోట్లకు పైగా రుణం ఇచ్చినట్లు సమాచారం. కార్వీ సంక్షోభం తలెత్తి దాదాపు ఏడాది కావస్తోంది. అనుబంధ కంపెనీల్లో వాటా విక్రయించి, అప్పులు తీర్చేందుకు కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఆ పని ఇంకా పూర్తికాలేదు. ఈ లోపు నిబంధనల ప్రకారం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ‘ప్రొవిజనింగ్‌’ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఖాతాల్లో కేటాయింపులు చేసినా, అప్పు తిరిగి వసూలు చేసుకునే ప్రయత్నాలను మాత్రం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొనసాగిస్తూనే ఉంటాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు