close

బిజినెస్‌

ముందస్తు పన్ను చెల్లింపు ఎలా?

ఆదాయం లేకపోవడంతో సంస్థల ఆందోళన
డిసెంబరు వరకు గడువుకు అభ్యర్థన
ఈనాడు - హైదరాబాద్‌

కరోనా మహమ్మారి వ్యవస్థలోని ప్రతి రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాదాపు రెండు నెలలుగా దేశమంతా లాక్‌డౌన్‌లో ఉండటంతో దాదాపు అన్ని సంస్థలు, వ్యక్తుల ఆదాయాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగదు లభ్యతను పెంచి, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌), మూలం వద్ద పన్ను చెల్లింపు (టీసీఎస్‌)లలో 25శాతం తగ్గింపు నిచ్చింది. అయితే, తమ ఆదాయాలు పూర్తిగా దెబ్బతిన్న ప్రస్తుత సమయంలో ఇవేమీ పెద్దగా ఉపశమనం కలిగించే చర్యలు కావని సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. దీనికన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ముందస్తు పన్నుతో పాటు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ని కొంతకాలం వాయిదా వేస్తే.. మరింత వెసులుబాటు కల్పించినట్లయ్యేదని పేర్కొంటున్నాయి.
ఆర్థిక సంవత్సరంలో 4 విడతలుగా
ఒక ఆర్థిక సంవత్సరంలో అంచనా పద్ధతిలో మందస్తు ఆదాయాన్ని గణించి, రూ.10,000లకు మించి పన్ను పడినప్పుడు దాన్ని నాలుగు విడతలుగా సంస్థలు చెల్లించాలి. మొత్తం పన్నులో  జూన్‌ 15 నాటికి 15%, సెప్టెంబరు 15 నాటికి 45% వరకు,, డిసెంబరు 15న 75% వరకు, మిగతా మొత్తం మార్చి 15లోగా చెల్లించాలి. గత ఆర్థిక సంవత్సరం రిటర్నులలో నమోదు చేసిన ఆదాయం ఆధారంగా, ఈ ముందస్తు పన్నును గణిస్తారు. ఒకవేళ గడువు లోపు ముందస్తు పన్ను చెల్లించకపోతే.. నోటీసులు వచ్చే అవకాశం ఉంది. చట్టపరమైన చర్యలకూ ఆస్కారం ఉంది. దీనికి అదనంగా చెల్లించాల్సిన పన్నుపై అపరాధ రుసుము కూడా విధిస్తారు.
సమీపిస్తున్న గడువు
సాధారణంగా సంస్థలు, అధికాదాయం ఉన్న వ్యక్తులు జూన్‌ మొదటి వారం నుంచి తమ అంచనా ఆదాయాలకు సంబంధించి ముందస్తు పన్ను చెల్లిస్తుంటారు. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి రోజు నుంచి కరోనా దెబ్బకి వ్యాపారాలు కుదేలయ్యాయి. సంస్థలు, వృత్తి నిపుణుల ఆదాయాలపైనా ప్రభావం పడింది. ముందస్తు తొలి విడత గడువు జూన్‌ 15 సమీపిస్తోంది. జూన్‌ 1 నుంచి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారో లేదో అనే సందిగ్ధత ఉంది. ఇలాంటప్పుడు అసలు ఆదాయం వస్తుందో.. రాదో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది ఆదాయాలకు, ఈ ఏడాదికి పొంతనే లేదు. ఇలాంటప్పుడు ముందస్తు పన్ను ఎలా గణించాలో అర్థం కాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
వాయిదా వేస్తేనే ఉపశమనం
సంస్థలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా, ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఉద్దీపనలో ప్రకటించినప్పటికీ, వాటి ఆదాయపు పన్ను విషయాన్ని మాత్రం పట్టించుకోలేదని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో ఏవో కొన్ని సంస్థలకు మినహా చాలావాటికి ఆదాయమే లేదు. లాక్‌డౌన్‌ ఆంక్షల్లో వెసులుబాటు లభిస్తున్నా, వ్యాపారాలు పూర్తి స్థాయిలో జరిగేందుకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో సంస్థలు, వృత్తి నిపుణులకు జూన్‌ 15 నాటికి ముందస్తు పన్ను చెల్లించే పరిస్థితే లేదు. అందువల్ల జూన్‌, సెప్టెంబరులలో చెల్లించాల్సిన ముందస్తు పన్నును డిసెంబరు వరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు, వడ్డీ లేకుండా వాయిదా వేస్తే సంస్థలకు నగదు లభ్యత పెరుగుతుందనే అభిప్రాయం అధిక సంస్థల్లో వ్యక్తమవుతోంది. దీనివల్ల వ్యాపార నిర్వహణకు కొంత వెసులుబాటు దొరుకుతుంది. డిసెంబరు నాటికి పరిస్థితులు కుదుటపడితే.. సంస్థలు ముందుకు వచ్చి, చెల్లించే అవకాశం ఉంటుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు