close

సినిమా

చిత్రసీమ సిద్ధమవుతోంది

నిర్మాణానంతర కార్యక్రమాలకు అనుమతి
చిత్రీకరణలపై త్వరలో నిర్ణయం
తెలుగు సినీ ప్రముఖులతో ప్రత్యేక భేటీలో మంత్రి తలసాని

లాక్‌డౌన్‌తో స్తంభించిన తెలుగు చిత్రసీమకు కాస్త ఊరట. చిత్రీకరణలు మినహా సినిమాలు, టీవీల నిర్మాణాంతర కార్యక్రమాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. ‘‘ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ నిర్మాణానంతర పనులు చేసుకోవడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు’’ అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌. లాక్‌ డౌన్‌  కారణంగా మూతపడిన తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్‌పై హీరోలు చిరంజీవి,  నాగార్జున నేతృత్వంలో హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా      హాజరైన ఈ సమావేశంలో నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, సి.కల్యాణ్‌, శ్యాంప్రసాద్‌ రెడ్డి తోపాటు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్‌, వి.వి. వినాయక్‌, ఎన్‌.శంకర్‌ సహా 35 మంది చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. సినిమా చిత్రీకరణలు, థియేటర్లకు అనుమతులు సహా 14 వేల మంది కార్మికుల సంక్షేమంపై చర్చించారు. పరిశ్రమనే నమ్ముకొని బతుకుతున్న వేలాది మంది కార్మికుల ఉపాధిని, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చిత్రీకరణలు, నిర్మాణాంతర పనులకు అనుమతివ్వాల్సిందిగా చిత్ర ప్రముఖులు కోరారు.  
ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం
చిత్రీకరణలపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తలసాని అన్నారు. సమావేశం అనంతరం తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ ‘‘సినిమా, టీవీ షూటింగ్‌లు, పోస్ట్‌ప్రొడక్షన్‌ అంశాలపై సినిమా పెద్దలతో చర్చించాం. ప్రభుత్వం చిత్ర పరిశ్రమ పట్ల సానుకూలంగానే ఉంది. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ నిర్మాణాంతర పనులకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. చిత్రీకరణలకు సిద్ధంగా ఉన్న సినిమాలను వాటి ప్రాధాన్యాల ఆధారంగా గుర్తించాలని చెప్పాం. థియేటర్లు తిరిగి మొదలుకాగానే ప్రేక్షకులు వస్తారా? అన్నది ఓ సమస్యగా ఉంది. చిత్రీకరణ ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలపై పరిశ్రమ పెద్దలు మాట్లాడారు. చిత్రీకరణలకు అనుమతులపై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ముఖ్యమంత్రిగారితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఈలోపు సినీ ప్రముఖులు సీఎంను కలుస్తామంటున్నారు. సీసీసీ ద్వారా 14వేల మంది సినీ     కార్మికులను ఆదుకున్నారు. రెండో విడతగా ప్రభుత్వం ఆ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉంద’’న్నారు.
షూటింగ్‌ అంటే చాలా మంది జనాలు ఉంటారు అనుకుంటారు.    సినిమాల్లో అలాంటి సన్నివేశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడున్న   పరిస్థితుల్లో అలా తియ్యడం సాధ్యం కాదు. ప్రభుత్వం చిత్రీకరణలకు అనుమతులిస్తే.. తక్కువ మందితోనే సన్నివేశాలు చిత్రీకరిస్తాం. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ సెట్‌లో జాగ్రత్తలు తీసుకుంటాం’’

- దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి


మాక్‌ వీడియోతో సీఎం ముందుకు

కరోనా పరిస్థితుల  నేపథ్యంలో సినీ కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పిస్తూ.. చిత్రీకరణలు ఎలా కొనసాగించాలి అన్న అంశంపై ఓ మాక్‌ వీడియో తయారు చేసేందుకు సిద్ధమైంది చిత్ర పరిశ్రమ. ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ   ఆధ్వర్యంలో రూపొందనున్న ఈ వీడియోను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించనున్నారు. చిత్రీకరణ అనుమతులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించే రోజు ఈ వీడియోను ఆయన ఎదుట ప్రదర్శించనున్నారని సమాచారం.


ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా తిరిగి పనులు ప్రారంభించాలని చిత్ర పరిశ్రమ భావిస్తోంది. చిత్రీకరణల ప్రారంభం, థియేటర్లు తెరవడం లాంటి అన్ని విషయాలపై సమాధానం కోరేందుకే సమావేశం ఏర్పాటు చేసి చర్చించాం. మేం ఏ కొన్ని సినిమాలో, దర్శక నిర్మాతల గురించో మాట్లాడటం లేదు. ఎంతోమంది సినీ కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని, షూటింగ్స్‌ ఎంత మందితో చేసుకోవచ్చు, అందుకు నియమ నిబంధనలేంటి? అన్నవి మాకు మార్గనిర్దేశం చెయ్యాలని అందరి తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సమయమిస్తే.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు పరిశ్రమ తరఫున ఓ వినతి పత్రం అందిస్తాం’’.

- కథానాయకుడు చిరంజీవి


 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు