close

గ్రేటర్‌ హైదరాబాద్‌

నియంత్రిత పద్ధతిలో సాగుదాం

 అదే రైతులకు లాభదాయకం
 వ్యవసాయశాఖలో త్వరలో రెండు కమిటీలు
విత్తనాలు వందశాతం అందుబాటులో ఉండాలి
 
పంటలపై విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌

కల్తీ విత్తన వ్యాపారులు రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. వారు రైతు హంతకులు. పత్తి, మిరప విత్తనాలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. వాటిని అమ్మేవారిని పీడీ చట్టం కింద అరెస్టు చేసి, జైలులో వేయాలి. కలెక్టర్లు, పోలీసు అధికారులు సమన్వయంతో వ్యవహరించి, కల్తీ విత్తన వ్యాపారాన్ని నూటికి నూరు శాతం అరికట్టాలి. ప్రజాప్రతినిధులెవ్వరూ కల్తీ విత్తన వ్యాపారులను కాపాడే ప్రయత్నం చేయొద్దు.


నీ రానున్న నాలుగైదు రోజుల్లో నియంత్రిత పద్ధతిపై అవగాహన కల్పించేందుకు క్లస్టర్‌ వారీగా రైతు సదస్సులు నిర్వహించాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి. రాబోయే నెల రోజులు రైతుబంధు సమితుల బాధ్యులు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. జిల్లా రైతుబంధు అధ్యక్షుడికి ఒక నెల రోజులు వాహన సౌకర్యం కల్పించాలి.

- సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌ : నియంత్రిత పద్ధతిలో సాగు చేసి రైతులంతా రైతుబంధు సాయం, పంటకు మంచి ధర పొందాలన్నది తన అభిమతమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. నియంత్రిత సాగు నిర్ణయాన్ని అత్యధిక మంది రైతులు స్వాగతిస్తున్నట్లు సర్వేలో తేలిందన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న నాణ్యమైన పంటలు పండించడం ద్వారానే రైతులు మంచి ధర పొందగలుగుతారన్నారు. ఈ విషయంలో వ్యవసాయశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం తగు సూచనలు చేస్తాయన్నారు. తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీ పడే గొప్పస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానంపై చర్చించేందుకు గురువారం ప్రగతిభవన్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు, సీనియర్‌ అధికారులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
జిల్లా అధికారులు, రైతుబంధు సమితుల అధ్యక్షులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ‘‘రైతులంతా ఒకే పంట వేయడం ద్వారా డిమాండ్‌ పడిపోయి నష్టపోతున్నారు. అలా కాకుండా ఉండాలనే నియంత్రిత పద్ధతిలో సాగు చేయాలని ప్రభుత్వం అభిలషిస్తోంది. ఏ సీజన్‌లో ఏ పంట వేయాలి? ఎక్కడ ఎలా సాగు చేయాలనే విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్‌ ఉందో ఆగ్రో బిజినెస్‌ విభాగం వారు తేల్చారు’ అని సీఎం స్పష్టం చేశారు.

వరి అంతే వేయాలి
‘‘రాష్ట్రంలో గత ఏడాది వానాకాలంలో మాదిరిగానే వరిని 40 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి. 53 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పత్తిని 70 లక్షల ఎకరాలకు పెంచాలి. గతంలో 7 లక్షల ఎకరాల్లో కంది వేయగా ఇప్పుడు 15 లక్షల ఎకరాల్లో వేయాలి. సోయాచిక్కుడు, పసుపు, మిర్చి, కూరగాయలు తదితర పంటలు గత ఏడాది మాదిరిగానే వేసుకోవచ్చు. వివిధ రకాల విత్తనోత్పత్తి చేసే రైతులు యథావిధిగా చేసుకోవచ్చు. పచ్చిరొట్టను విరివిగా సాగు చేయాలి. వానాకాలంలో మక్కల సాగు లాభసాటి కాదు. దానికి బదులు పత్తి, కంది తదితర పంటలు వేసుకోవాలి. వరి వంగడాల్లో తెలంగాణ సోనాకు డిమాండ్‌ ఉన్నందున పండించాలి. 6.5 మిల్లీమీటర్ల సైజు కలిగిన బియ్యం రకాలకు అంతర్జాతీయ మార్కెట్‌ ఉంది’’ అని ముఖ్యమంత్రి సూచించారు.
ఎర్రవెల్లిలో సొంత ఖర్చుతో రైతువేదిక
ముఖ్యమంత్రి తన వ్యవసాయ భూమి ఉన్న ఎర్రవెల్లి గ్రామంలో సొంత ఖర్చుతో రైతు వేదిక నిర్మిస్తానని ప్రకటించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కొందరు జిల్లా రైతుబంధు అధ్యక్షులు వారి వారి ప్రాంతాల్లో రైతువేదికల నిర్మాణానికి ముందుకొచ్చారు. రాష్ట్రంలోని 2,602 క్లస్టర్లలో నాలుగైదు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని రైతు వేదికల్లో ఏఈవోకు కార్యాలయం, కంప్యూటర్‌, వీడియో కాన్ఫరెన్సు నిర్వహించుకోవడానికి వీలుగా టీవీ ఏర్పాట్లు ఉండాలన్నారు. రైతు వేదికల నిర్మాణానికి స్థలం లేదా నగదు విరాళంగా ఇచ్చిన వారు సూచించిన పేర్లు పెట్టాలన్నారు. ఇంకా సమావేశంలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలు, సూచనలిచ్చారు.
ఆహార శుద్ధి యూనిట్లు, సెజ్‌లు ప్రారంభిస్తాం
ఈ వానాకాలం నుంచే రాష్ట్రంలో ఏ కుంటలో ఏ పంట వేస్తున్నారో వ్యవసాయ విస్తరణాధికారులు కచ్చితమైన వివరాలు సేకరించి సాగు విస్తీర్ణం లెక్కించాలి.  
రైతుకు కావాల్సిన విత్తనాలను వంద శాతం అందుబాటులో ఉంచాలి. మంచి వంగడాలు తయారు చేయడానికి, మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు త్వరలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ, రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ కమిటీలను నియమిస్తాం.
పెద్ద ఎత్తున ఆహార శుద్ధి యూనిట్లు, సెజ్‌లు ప్రారంభిస్తాం. రైసు, పప్పులు, ఆయిల్‌ మిల్లులు, ఇతర యూనిట్లు వస్తాయి. సెజ్‌లకు అవసరమైన స్థలాల ఎంపికను ఆయా జిల్లాల అధికారులు త్వరగా పూర్తి చేయాలి. ఈ సెజ్‌ల పక్కనే గోదాముల నిర్మించాలి. సెజ్‌ల ప్రాంతంలో ఇళ్ల లేఅవుట్‌కు అనుమతి ఇవ్వవద్దు.
కొత్తగా ఏర్పాటైన 125 మండలాల్లో గోదాములు రావాలి. ప్రతి గోదాములో కొంత శీతలగిడ్డంగి సౌకర్యం ఏర్పాటు చేయాలి.  
ఈ నెల 25 లోగా ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో) పోస్టులను భర్తీ చేయాలి.
నీటి లభ్యతను బట్టి వరి రకాలు
గోదావరి ప్రాజెక్టుల కింద సత్వరం నీరు వచ్చే ప్రాంతంలో దీర్ఘకాలిక, కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో ఆలస్యంగా నీరొచ్చే చోట్ల స్వల్పకాలిక వరి రకాలు వేసుకోవాలి.
కంది పంట వేస్తే మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
పత్తి ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో జిన్నింగ్‌ మిల్లులు లేకపోతే ఏర్పాటుకు పరిశ్రమల శాఖ చొరవ చూపాలి.
మంత్రులు, రైతుబంధు సమితుల బాధ్యులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఆధునిక పద్దతులు, కొత్త వంగడాల సాగుకు పూనుకోవాలి.  
జిల్లా, డివిజన్‌, మండల, క్లస్టర్‌ స్థాయి వ్యవసాయ అధికారులకు ప్రతి నెలా వాహన ప్రయాణ భత్యం ఇవ్వాలి.  

కాలినడకన వద్దు

వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తరలించాలి
 అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

తెలంగాణ నుంచి ఏ ఒక్క వలస కార్మికుడు కాలినడకన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిన దుస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను అదేశించారు. ఇందుకు అవసరమైన రైళ్లను సమకూర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు గురువారం రాత్రి సూచించారు. రైళ్లు లేని ప్రాంతాల వారిని బస్సుల ద్వారా తరలించాలన్నారు. తమ సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే వలస కార్మికులెవరు నడిచి పోవాలనే ఆలోచన చేయవద్దని, ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని వారిని స్వస్థలాలకు తరలిస్తుందని సీఎం తెలిపారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు