close

ఆంధ్రప్రదేశ్

ప్రశ్నిస్తే కేసులు పెడతారా?

అమరావతి రైతుల మండిపాటు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారిని పాలకులు కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అమరావతి రైతులు మండిపడ్డారు. తాము రాజధానిని తరలించవద్దని కోరినందుకు కేసులు పెట్టి అణగదొక్కాలని చూస్తున్నారని.. ప్రభుత్వ లోపాలను బయటపెట్టిన వైద్యులు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి..లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే స్లాబ్‌ పేరుతో విద్యుత్తు బిల్లులను పెంచి భారాన్ని మోపడం దారుణమని విమర్శించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న నిరసనలు గురువారం 156వ రోజుకు చేరాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, పెదపరిమి, దొండపాడు, తదితర గ్రామాల్లో రైతులు, చిన్నారులు, మహిళలు, అమరావతి ఐకాస జెండాలు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో విషప్రచారం
నగరంపాలెం, న్యూస్‌టుడే: ‘మూడు రాజధానులు వద్దు ఒకటే ముదు’్ద అంటూ గాంధేయ మార్గంలో ఉద్యమిస్తున్న మహిళలపై కొంతమంది ప్రభుత్వ మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్నారని అమరావతి మహిళా రైతులు పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. గురువారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. తుళ్లూరు పోలీసుస్టేషనులో, మందడంలో డీఎస్పీ శ్రీనివాస్‌కి ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. మద్దతుగా నిలవాలని కోరారు. డీజీపీతో మాట్లాడి తగు చర్యలు తీసుకునేలా చూస్తానని లక్ష్మీనారాయణ తెలిపారు. మహిళారైతులు రాధిక, వరలక్ష్మి, వాసుమతి, ప్రియాంక, సరిత పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు