close

తెలంగాణ

వాహన రద్దీకిక చెల్లు

బయో డైవర్సిటీ పైవంతెన ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌, గచ్చిబౌలి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని బయో డైవర్సిటీ కూడలిలో వాహన రద్దీ ఇక ఉండబోదని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్సార్డీపీ)లో భాగంగా ఈ కూడలిలో నిర్మించిన మొదటిస్థాయి పైవంతెనను ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న రహదారుల అభివృద్ధి పనులను పరిశీలించారు.  కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ రామ్మోహన్‌, ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు.
వైద్యరంగంలో డిజిటల్‌ సేవలు ఉపయుక్తం
కరోనా నేపథ్యంలో ఆరోగ్యరంగంలో అత్యాధునిక డిజిటల్‌ సేవలు వైద్యులకు, రోగులకు అన్ని విధాలా ఉపయుక్తంగా ఉంటాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌కు చెందిన సాంకేతిక సంస్థ నౌఫ్లోట్స్‌ రూపొందించిన సమగ్ర ఆన్‌లైన్‌ వీడియో చికిత్సల పరిష్కార సాఫ్ట్‌వేర్‌ను కేటీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. రోగులు, వైద్యుల మధ్య ఆన్‌లైన్‌ అనుసంధాన విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సంస్థ సహవ్యవస్థాపకుడు రోనక్‌కుమార్‌, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు.
వంతెన ప్రత్యేకత
వంతెన వ్యయం రూ.30.26కోట్లు. గచ్చిబౌలి నుంచి ఖాజాగూడ కూడలి వైపు వెళ్లే వాహనాల కోసం దీనిని నిర్మించారు. బయో డైవర్సిటీ పార్కు ముందున్న కూడలి ద్వారా గచ్చిబౌలి, మైండ్‌స్పేస్‌, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, కొండాపూర్‌, లింగంపల్లి, ఓఆర్‌ఆర్‌కు రాకపోకలు సాగుతాయి. ఉదయం 8గంటల నుంచే ఈ కూడలి కిక్కిరిసిపోయి కనిపించేది. పరిష్కారంగా జీహెచ్‌ఎంసీ బయో డైవర్సిటీ కూడలిలో రెండుస్థాయిల్లో పైవంతెనలు నిర్మించింది. ఖాజాగూడ కూడలి నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనాల కోసం కట్టిన రెండోస్థాయి పైవంతెన గతేడాది చివర్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మొదటిస్థాయి పైవంతెన సేవలు మొదలయ్యాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు