close

ఆంధ్రప్రదేశ్

బస్సుల కోసం బారులు

తొలి రోజు నడిచిన బస్సులు 1,380

ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: దాదాపు రెండు నెలల తర్వాత ఆర్టీసీ సర్వీసులను గురువారం పునరుద్ధరించగా, ఇతర జిల్లాలు, దూర ప్రాంతాల సర్వీసులకు ప్రయాణికుల నుంచి డిమాండ్‌ ఏర్పడింది. జిల్లాలో తిరిగిన బస్సుల్లో సాధారణ రద్దీ కనిపించింది. పలు బస్టాండ్లల్లో ఉదయం నుంచే ప్రయాణికులు టిక్కెట్ల కోసం బారులు తీరారు. అందరికీ ధర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు.
* గురువారం 1,683 సర్వీసులు నడపాలని భావించినప్పటికీ, వివిధ కారణాలతో 1,380 నడిచాయి. 255 బస్సుల్లో ఆన్‌లైన్‌ టిక్కెట్లు బుకింగ్‌కు అవకాశం కల్పించారు. మిగిలిన 1,125 సర్వీసులకు ఆయా బస్టాండ్లలో టిక్కెట్లు విక్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,400 చోట్ల మూడు వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేసి, టిక్కెట్లు ఇచ్చారు.
* శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,375 బస్సుల ద్వారా 5,500 ట్రిప్పులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.
* కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో సర్వీసులు నడపలేకపోయారు. గుంటూరులో 99 సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేయగా, కరోనా తీవ్రతతో కలెక్టర్‌ అనుమతి ఇవ్వకపోవడంతో 6 బస్సులు నడిచాయి. చిత్తూరులో 245 బస్సులకు 189, నెల్లూరులో 163కు 109 సర్వీసులు నడిపారు.
* ఒంగోలులో గురువారం ఉదయం అన్ని డిపోల నుంచి బస్సులు ప్రారంభమయ్యాయి. కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో ఉండటంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు మధ్యాహ్నం నుంచి ఒంగోలు డిపోకు బస్సులను నిలిపేశారు. నేటి నుంచి డిపో మీదుగా రాకపోకలు ఉండవని ప్రకటించారు. ఇతర జిల్లాల బస్సులను సైతం బైపాస్‌ వరకే అనుమతిస్తామన్నారు.
* ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌కు అవకాశం కల్పించడంతో వెబ్‌సైట్‌పై ఒత్తిడి పెరిగింది. సాధారణ రోజుల్లో సగటున 5 వేల మంది సందర్శించే ఈ వెబ్‌సైట్‌కు బుధవారం సాయంత్రం తర్వాత 38 వేల మంది వచ్చారు. దీంతో అధికారులు లాగిన్‌ పాస్‌వర్డ్‌ తప్పనిసరి చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు