close

ఆంధ్రప్రదేశ్

కరెంటు బిల్లులపై కన్నెర్ర

సామాన్యులపై ఇంత భారమా?
కొత్త శ్లాబ్‌ రేట్లపై చంద్రబాబు ఆగ్రహం
రాష్ట్రవ్యాప్తంగా తెదేపా దీక్షలు

లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. వారికి ఉపాధి లేదు.. ఆదాయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మారిన శ్లాబ్‌ రేట్ల వల్ల ఒక్కసారిగా బిల్లులు ఎగబాకాయి. సామాన్యులపై మోపిన అదనపు భారాన్ని వారు చెల్లించగలరా?’

దీక్షలు ఇలా..
నియోజకవర్గాలు.. 160
మండలాలు, డివిజన్లు.. 620
పాల్గొన్న ప్రజాప్రతినిధులు.. 180 మంది
పాల్గొన్న పార్టీ నాయకులు.. 400 మంది

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మూడు నెలల విద్యుత్‌ బిల్లులను మాఫీ చేసి రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. దీనిపై సత్వరం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ట్విటర్‌ వేదికగా కోరారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నాయకులు గురువారం ఇళ్లలోనే నిరసన దీక్షలు చేపట్టారు. ‘మద్యం ధరలు పెంచి రూ.30 వేల కోట్లు రాబట్టారు. డిస్కంలకు కేంద్రం రూ.90 వేల కోట్లు ఇచ్చింది. అలాంటప్పుడు విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయలేరా?’ అని పలువురు తెదేపా నేతలు నిలదీశారు. 160 నియోజకవర్గాలు, 620 మండలాలు, డివిజన్లలో ఈ దీక్షలను నిర్వహించారని పార్టీ ఒక ప్రకటనలో వివరించింది.
* విజయవాడ కేశినేని భవన్‌లో ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత చేపట్టిన నిరాహార దీక్షను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు ప్రారంభించారు.
* నాయకులు, కార్యకర్తలతో కలిసి నిమ్మాడలోని తన స్వగృహంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు నిరసన దీక్ష చేపట్టారు.
* తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఎన్‌.చినరాజప్ప దీక్ష చేశారు. రాజమహేంద్రవరం ఎస్‌ఈ కార్యాలయం వద్ద గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నిరసన చేపట్టారు.
* విద్యుత్‌ బిల్లులు పెంచి ప్రభుత్వం దొంగదెబ్బ తీసిందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురంలోని తన నివాసంలో ఆయన దీక్ష చేపట్టారు.
* చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఒక్క ఫ్యాన్‌, లైట్‌ ఉన్న ఇంటికి రూ.41 వేల బిల్లు వచ్చిందని మాజీ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి వివరించారు.
* ఛార్జీలను పెంచబోమని మీరిచ్చిన హామీ ఏమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. విద్యుత్‌ బిల్లులు రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఎమ్మెల్సీ అశోక్‌బాబు హెచ్చరించారు.
* మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గుంటూరులోని తన నివాసంలో చేపట్టిన దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీ రామకృష్ణ, తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు దీక్ష చేపట్టారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు సంఘీభావం తెలిపారు. 3 నెలల బిల్లులను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
* కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్టంలోని సవరణలు ప్రమాదకరమని, వాటిని రాష్ట్రం వెంటనే బహిరంగంగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు