close

క్రైమ్

ఉసురు తీసిన ఉపాధి బాట

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు..
ముగ్గురి మృతి
 ముగ్గురు చిన్నారుల క్షేమం

చిట్యాల గ్రామీణం, గోకవరం, న్యూస్‌టుడే: ఓ వివాహం నిమిత్తం సొంతూరుకి వెళ్లి ఉపాధి కోసం తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు మరో మహిళ మృతి చెందారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన గీసాల శ్రీనివాస్‌(45) తన కుటుంబ సభ్యులు, ఇతరులతో కలిసి బుధవారం రాత్రి కారులో స్వగ్రామం నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు వట్టిమర్తి శివారులో జాతీయ రహదారి పక్కన ధాన్యం లోడుతో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌, అతని భార్య లక్ష్మి(30), అదే గ్రామానికి చెందిన మరో యువతి లక్ష్మిచందన(18) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్‌ దెయ్యాల అబ్రహం, అతని భార్య లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణికులున్నారు. వీరిలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు హైదరాబాద్‌లోని తమ తల్లిదండ్రుల వద్దకు వెళుతున్నారు. వీరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకర్‌రెడ్డి తెలిపారు. శ్రీనివాస్‌, లక్ష్మి వారి బంధువులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో వాచ్‌మన్‌, కూలీలుగా పనిచేస్తున్నారు. వారు మార్చి 15న ఓ పెళ్లి నిమిత్తం కొత్తపల్లికి వెళ్లారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయారు. తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని బంధువులు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు