close

క్రైమ్

ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నిస్తే కాళ్లు పట్టుకోమన్నారు

 ఏపీలో యువకుడి ఆత్మహత్యాయత్నం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్థానిక వీకర్స్‌ కాలనీకి చెందిన లోకేష్‌ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, సీఐ ఆకుల రఘు తనను వేధిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు ఉద్యోగం తీసేస్తామని బెదిరించారని, ఆ మనస్తాపంతోనే చనిపోతున్నానని అతను స్వీయ వీడియో తీసుకున్నారు. అనంతరం పట్టణ పోలీసు స్టేషన్‌ ఆవరణలో బుధవారం రాత్రి లోకేష్‌ పురుగుల మందుతాగారు. వెంటనే స్థానికులు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. ఇతను ఏపీ నిట్‌లో పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

వీడియోలో ఆవేదన అతని మాటల్లోనే
‘‘నేను దారిలో వెళ్తుంటే ఇసుక లారీ కన్పించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇసుక రవాణా లేదు కదా! మరి ఎలా తరలిస్తున్నారని ఆ లారీ డ్రైవర్‌ను అడిగాను. ఆ లారీ డ్రైవర్‌ కూడా సావధానంగా వివరాలు చెప్పారు. మా మధ్య ఎలాంటి వివాదమూ జరగలేదు. నేను అక్కడి నుంచి వెళ్లిన తర్వాత నాపై కేసు నమోదైందని.. పోలీస్‌స్టేషన్‌కు రమ్మన్నారు. నేను వెళితే... సీఐ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేతో వివాదం ఎందుకు రా? వెళ్లి క్షమాపణ చెప్పు. లేదంటే నీ ఉద్యోగమూ పోతుందని బెదిరించారు. నేను ఎమ్మెల్యే కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగేంత తప్పుచేయలేదు. ఇసుక అక్రమ రవాణాపై అడిగానంతే. దీనికోసం నా ఉద్యోగం తీసేస్తామన్నారు. మా అమ్మకు పింఛన్‌ ఆపేస్తామన్నారు. నేను చిన్న ఉద్యోగం చేసుకొని తల్లిని పోషించుకుంటున్నా. అలాంటి నన్ను వేధించడం ఎంత వరకూ న్యాయం? నేను ఈ బాధలు తట్టుకోలేక పోతున్నా. చచ్చిపోతున్నా.’’ అంటూ లోకేష్‌ ముఖ్యమంత్రిని ఉద్దేశించి... వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆరోపణలను సీఐ, ఎమ్మెల్యేలు ఖండించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు