close

క్రీడలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒత్తిడికి గురైతే.. ఒక్క ఫోన్‌ కాల్‌

ఐపీఎల్‌ సందర్భంగా ప్రత్యేక హెల్ప్‌లైన్‌దిల్లీ

ఇటీవలి ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌ తరహాలోనే బయో సెక్యూర్‌ విధానంలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది బీసీసీఐ. ఆటగాళ్లతో పాటు భార్యా పిల్లల్ని అనుమతించే అవకాశం లేనట్లే. మొత్తంగా లీగ్‌ కోసం రెండు నెలలకు పైగానే ఆటగాళ్లు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి రావచ్చు. నిర్దేశించిన ‘బుడగ’ను దాటి బయటికి వెళ్లడానికి అవకాశమే ఉండదు. కుటుంబ సభ్యుల తోడూ లేక, బయటికెళ్లే వీలూ లేక, మ్యాచ్‌ల తాలూకు ఒత్తిడి తోడై ఆటగాళ్లు మానసికంగా దెబ్బ తినే ప్రమాదమూ లేకపోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని లీగ్‌ సందర్భంగా ఆటగాళ్ల కోసం ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఆదివారం జరగబోయే ఐపీఎల్‌ పాలక మండలి సమావేశంలో దీనిపై చర్చించి ఫ్రాంఛైజీలకు మార్గ నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు ఏమాత్రం ఒత్తిడికి లోనైనా, మానసిక ఆందోళనకు గురైనా హెల్ప్‌ లైన్‌ నంబరుకు ఫోన్‌ చేయొచ్చని, మానసిక వైద్య నిపుణులు అందుబాటులోకి వచ్చి వారికి కౌన్సెలింగ్‌ చేస్తారని బోర్డు వర్గాలు అంటున్నాయి.
ప్రయాణం ఎక్కడి నుంచి?: లీగ్‌ కోసం సన్నాహాలు ఎలా ఉండాలి.. ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అనే విషయమై బీసీసీఐ మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్న ఫ్రాంఛైజీలు.. ఈలోపు తమ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించడం, వారికి ప్రయాణ ఏర్పాట్లు చేయడంపై దృష్టిసారించాయి. దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై.. ఈ నాలుగు నగరాల్లో ఎక్కువమంది భారత ఆటగాళ్లకు సౌకర్యంగా అనిపించే చోటు నుంచి అబుదాబికి ప్రత్యేక విమానాన్ని నడపాలని భావిస్తున్నాయి.

సఫారీలు ఎలా?: భారత ఆటగాళ్లు, మిగతా విదేశీయుల సంగతేమో కానీ..   దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ఐపీఎల్‌ కోసం యూఏఈకి రప్పించడం ఫ్రాంఛైజీలకు   సవాలుగా మారేలా ఉంది. దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలున్నాయి. డివిలియర్స్‌ (బెంగళూరు), రబాడ (దిల్లీ), డుప్లెసిస్‌ (చెన్నై), డికాక్‌ (ముంబయి) సహా ఐపీఎల్‌లో సఫారీ ఆటగాళ్ల పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలన్నీ కలిసి    ఉమ్మడిగా ఒక ప్రత్యేక విమానం పెట్టి,  అనుమతులు పొంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లను లీగ్‌ కోసం తీసుకురావాలని చూస్తున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు