close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నల్లమలలో పులికూనల సందడి

అమ్రాబాద్‌లో ఏడుకు పెరిగిన సంఖ్య

ఈనాడు, హైదరాబాద్‌:  నల్లమల అభయారణ్యంలో పులికూనల సంఖ్య ఏడుకు పెరిగిందని కేంద్ర పర్యావరణ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది.అమ్రాబాద్‌ సంరక్షణ కేంద్రంలోని ఫర్హాబాద్‌ ప్రాంతంలో ఓ పెద్దపులికి రెండు కూనలు ఉన్నట్లు అటవీ అధికారులు కొంతకాలం క్రితమే గుర్తించారు. వాటికి పేర్లు పెట్టడంతోపాటు సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పులులు గణనలో ఏకంగా 7 చిన్న పులులు ఉన్నట్లు వెల్లడి కావడం అటవీశాఖ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

నిఘా నేత్రాలకు చిక్కిన పులిపిల్లలు
ఆహారం ఎక్కడ దొరుకుతుంది.. ఎలా వేటాడాలి? ఆపద వచ్చే సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. అన్న విషయాల్ని  పులి కూనలు తల్లి నుంచి నేర్చుకుంటున్నట్లు కెమెరా చిత్రాల్లో నిక్షిప్తమైంది. అమ్రాబాద్‌లో ఏర్పాటుచేసిన 338 కెమెరాల్లో నమోదైన చిత్రాలు, గుర్తులను విశ్లేషించగా..42 రకాల జంతుజాతులతో పాటు  పులి పిల్లలు కనిపించాయి. అమ్రాబాద్‌ పెద్దపులుల సంరక్షణ కేంద్రం ప్రాంతంలో 2166.37 చ.కి.మీ కోర్‌ ఏరియా, 445.02 చ.కి.మీ బఫర్‌ ఏరియా ఉంది. అటవీ విస్తీర్ణపరంగా చూస్తే ఇది తక్కువేనని..అయితే పులి కూనలు పెద్దసంఖ్యలో ఏడు ఉన్నాయని కేంద్ర నివేదిక పేర్కొంది.

తెలంగాణలో 26 పెద్దపులులు ఉంటే.. వాటిలో మూడింట రెండొంతులకుపైగా నల్లమలలోనే ఉన్నాయి. అమ్రాబాద్‌లో కొత్తవి పుడుతుండటం, ఏడు పులికూనలు ఉన్నట్లు తెలవడం మంచి పరిణామం అని.. భవిష్యత్తులో ఇక్కడ పులుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉందని అటవీశాఖ ఓఎస్డీ శంకరన్‌ ‘ఈనాడు’తో పేర్కొన్నారు. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌కు ఇతర సంరక్షణ ప్రాంతాల నుంచి పులులు వచ్చిపోతున్నాయన్నారు. అమ్రాబాద్‌, కవ్వాల్‌లలో.. రేసుకుక్కలు, నక్కలు, దుప్పులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, దుప్పులు, కొండగొర్రెలు, అడవిబర్రెలు తగిన సంఖ్యలో ఉన్నాయన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు