close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సకాలంలో వైద్యులకు జీతాలివ్వండి

క్వారంటైన్‌ సమయాన్ని సెలవుగా పరిగణించకండి
కేంద్రానికి సుప్రీం సూచనలు

ఈనాడు, దిల్లీ కరోనాపై పోరాటంలో అత్యవసర సమయంలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు రాష్ట్రాలు సకాలంలో జీతాలు చెల్లించేలా చూడాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. క్వారంటైన్‌లో ఉన్న వైద్యులకు జీతాలివ్వరా అని ప్రశ్నించింది. క్వారంటైన్‌ సమయాన్ని సెలవుగా పరిగణించొద్దని సూచించింది. వైద్యులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ యునైటెడ్‌ రెసిడెంట్‌, డాక్టర్స్‌ అసోసియేష్‌ (యూఆర్‌డీఏ) దాఖలు చేసిన ఇంటర్‌ లొకేటరీ అప్లికేషన్‌ను శుక్రవారం జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌షాలతో కూడిన ధర్మాసనం విచారించింది. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు సకాలంలో జీతాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు జూన్‌17న ఆదేశాలు ఇచ్చినప్పటికీ పలు రాష్ట్రాల్లో వైద్యులకు సకాలంలో జీతాలు చెల్లించడంలేదని అత్యవసర జోక్యం చేసుకోవాలని యూఆర్‌డీఏ కోరింది. జూన్‌ 17న సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం హై-రిస్క్‌, లో-రిస్క్‌ అంటూ వైద్యులను వర్గీకరించారని, ఏ ప్రాతిపదికన ఈ వర్గీకరణ చేశారో అర్థం కాలేదని యూఆర్‌డీఏ తరఫు సీనియర్‌ న్యాయవాది కె.వి.విశ్వనాథన్‌ కోర్టుకు తెలిపారు. జూన్‌17న కోర్టు ఉత్తర్వులు తర్వాత కేంద్రం ఇచ్చిన ఆదేశాలను దిల్లీ, మహరాష్ట్ర, పంజాబ్‌, త్రిపుర, కర్ణాటక పాటించలేదని సొలిసిటర్‌జనరల్‌ తుషార్‌మెహతా తెలిపారు. దీంతో ‘‘మీరు నిస్సహాయంగా లేరు. ఆదేశాలు అమలు అయ్యేలా చూడాలి. విపత్తు నిర్వహణ చట్టం కింద కేంద్రానికి అధికారాలు ఉన్నాయి’’ అని జస్టిస్‌ ఎంఆర్‌ షా పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ జీతాల చెల్లింపు నిర్దేశించే ఆదేశాలు అమలు చేయాలని స్పష్టం చేసిన ధర్మాసనం ఆగస్టు 10లోగా నివేదిక ఇవ్వాలని తుషార్‌మెహతాను కోరింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు