close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆగస్టు 31 వరకూ నిషేధం

డీజీసీఏ ఉత్తర్వులు

దిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని ఆగస్టు 31 వరకూ పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) పేర్కొంది. గతంలో విధించిన ఈ నిషేధం జులై 31తో ముగిసింది. సరకు రవాణా, డీజీసీఏ ఆమోదం తెలిపిన సర్వీసుల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అధికారిక ప్రకటన పేర్కొంది. ఇప్పటివరకూ విమాన సర్వీసులను నిలిపివేసిన కాలంలో.. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను భారత్‌కు తీసుకురావడానికి లేదా ఇక్కడి నుంచి తరలించడానికి 2500కుపైగా విదేశీ విమానయాన సర్వీసులకు అనుమతినిచ్చినట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వందే భారత్‌ మిషన్‌’ కింద ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు మే 6 నుంచి జులై 30 మధ్య కాలంలో 2,67,436 మందిని, ఇతర అద్దె విమానాల ద్వారా 4,86,811 మందిని తరలించినట్లు పేర్కొంది. మహమ్మారి నేపథ్యంలో ప్రయాణికుల విమానాలను క్రమంగా అనుమతించడంలో భాగంగా అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, కువైట్‌లతో ‘ట్రాన్స్‌పోర్ట్‌ బబుల్‌’ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపింది. మరిన్ని దేశాలతో ఇలాంటివి ఖరారు చేసుకుంటామని వివరించింది. ఇలాంటి ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల రెండు దేశాల మధ్య కొన్ని నిబంధనలకు లోబడి విమాన సర్వీసులను నిర్వహించడానికి వీలవుతుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలు మార్చి 23 నుంచి రద్దయిన సంగతి తెలిసిందే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు