close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భగ్గుమన్న అమరావతి

గవర్నర్‌ నిర్ణయంపై తీవ్రస్థాయిలో ఆందోళనలు
నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు ఐకాస పిలుపు
రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపు

ఈనాడు డిజిటల్‌- అమరావతి, తుళ్లూరు, తుళ్లూరు (గ్రామీణ), న్యూస్‌టుడే: రాజధాని బిల్లులపై గవర్నర్‌ సంతకం చేయడంతో ఒక్కసారిగా అమరావతి భగ్గుమంది. రైతులు పరుగున దీక్షా శిబిరాలకు బయల్దేరారు. తుళ్లూరులోని ధర్నాచౌక్‌ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. గుంటూరు-తుళ్లూరు, విజయవాడ-అమరావతి రోడ్లపై బైఠాయించి నినాదాలు చేశారు. అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు దిల్లీ పెద్దల నాటకంలో భాగంగానే బిల్లులపై గవర్నర్‌ సంతకం చేశారని రాజధాని అమరావతి పరిరక్షణ జేఏసీ కన్వీనరు పువ్వాడ సుధాకర్‌ అన్నారు. ఇల్లు అలకగానే పండగ కాదని, సంతకం పెట్టినంత మాత్రాన రైతులెవరూ అధైర్యపడొద్దని రైతుల్లో ధైర్యం నింపారు. శనివారం నుంచి అన్ని శిబిరాల్లో పెద్దఎత్తున నిరసన దీక్షలు చేసి ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్నారు. ఇకనుంచి 29 గ్రామాల్లోనే కాకుండా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉద్యమిస్తామన్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో శుక్రవారం రైతులు, మహిళలు పెద్దఎత్తున దీక్షలు చేశారు. కొవ్వొత్తులను చేతబూని రాజధాని అమరావతి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. వెలగపూడి, నెక్కల్లులో కొందరు రైతులు రోడ్లపై టైర్లు తగలబెట్టారు. మహిళలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు ఆందోళనలు విరమించుకోవాలని చెప్పినా వెనక్కి తగ్గకుండా ధర్నా చేశారు. బిల్లుల ఆమోదం పొందాయన్న నిర్ణయంతో వెలగపూడిలో జొన్నలగడ్డ సురేశ్‌ అనే రైతు చెప్పుతో కొట్టుకున్నారు. రాజధాని కోసం భూములిచ్చి తప్పు చేశామని, ఇందుకు తమ చెప్పుతో తామే కొట్టుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మరణం కన్నా మరో దారి లేదంటూ వెలగపూడిలో కొందరు రైతులు నీళ్లట్యాంకు ఎక్కేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. మందడం చౌరస్తాలో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆందోళనలకు అనుమతి లేదన్నారు. గవర్నర్‌ బిల్లుల్ని ఆమోదించారన్న వార్తలు వెలువడిన మరుక్షణం పోలీసులు అమరావతి గ్రామాల్లో భారీగా మోహరించారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ ఆమోదించడాన్ని నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా   నిరసనలు చేపట్టాలని అమరావతి రైతుల ఐకాస పిలుపునిచ్చింది. అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో అమరావతికి మద్దతుగా నిరసనలు తెలపాలని కోరింది. శనివారం నుంచి దీక్షలు కొనసాగుతాయని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస కన్వీనరు శివారెడ్డి  తెలిపారు. తుళ్లూరు ధర్నాచౌక్‌ వద్ద రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు.


న్యాయబద్ధంగా నిలవదు

రాజమహేంద్రవరం: గవర్నర్‌ నిర్ణయం న్యాయపరంగా, రాజ్యాంగబద్ధంగా నిలవదు. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు రెండు వేర్వేరు అంశాలు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ఒకటే రాజధాని అని స్పష్టంగా ఉంది. మూడు రాజధానులు చేయాలంటే కేంద్రం ఆ చట్టానికి సవరణ చేయాలి. కేంద్రం ఆర్డినెన్సు మేరకు రాష్ట్రంలో హైకోర్టు ఏర్పడింది. దీన్ని కర్నూలుకు మార్చాలంటే పునర్విభజన చట్టంలో సవరణ తప్పనిసరి. ఆ చట్టంలోని 94 సెక్షన్‌ సబ్‌క్లాజ్‌ ప్రకారం రాజధాని, సచివాలయం, శాసనసభ, రాజ్‌భవన్‌ వంటి ప్రభుత్వ భవనాలు నిర్మించాలంటే కేంద్రం నిధులివ్వాలి. గతంలో రూ.2,500 కోట్లతో రాష్ట్రంలో ఆయా భవనాల నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులు, హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు చట్టాలు చేసే అధికారం లేదు. కేంద్రం, సుప్రీంకోర్టు, రాష్ట్రపతికి మాత్రమే ఆ అధికారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఆమోదించినంత మాత్రాన ఈ పనులు జరిగే అవకాశం లేదు. అమరావతి రైతులు భూములను ఇచ్చింది ప్రభుత్వంతో, సీఆర్‌డీఏతో చేసుకున్న ఒప్పందం మేరకే. ఈ కేసు న్యాయస్థానంలో ఉండగా సీఆర్‌డీఏను ఎలా రద్దు చేస్తారు? రైతుల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఏ చట్టం చేసినా రాజ్యాంగం ప్రకారం చెల్లదు. సీఆర్‌డీఏను రద్దు చేస్తే ఒప్పందం ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటే రాష్ట్ర బడ్జెట్‌ చాలదు.

- భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు


 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు