close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బరువు.. తగ్గడంలో తగ్గొద్దు!

 

వాహనం కండిషన్‌లో ఉండాలంటే...అది ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలి. శరీరం అయినా అంతే మరి. జీవనశైలిలో మార్పులు మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే దానికి రోజూ పనిచెప్పాల్సిందే. శరీరానికి పోషకాహారం అందాలి. దానికి తగ్గట్లు వ్యాయామం చేయాలి. అప్పుడే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మరింతకీ ఆ వ్యాయామ ప్రణాళిక ఎలా ఉండాలి? తెలుసుకుందామా!

 

బరువు.. తగ్గడంలో తగ్గొద్దు!


వ్యాయామం చేయడం అంటే...అదే పనిగా కిలోమీటర్లు చొప్పున పరుగులెత్తడం, గంటలు గంటలు జిమ్‌లో వర్కవుట్లు చేయడం అనుకుంటారు చాలామంది. ఆ భయంతోనే అసలు వ్యాయామం జోలికే పోరు. ఇంకొందరేమో వ్యాయామం చేయాలని ఎంత ఉత్సాహపడతారో...అంతగా వాయిదాలు వేస్తుంటారు. ఇవి రెండూ సరికాదు. ఉత్సాహం పోకూడదన్నా, వ్యాయామ ఫలితం శరీరానికి సరైన దిశలో అందాలన్నా తగిన ప్రణాళిక ఉండాలి. 
నీరసపడకుండా: వ్యాయామానికి ముందు కొన్నినీళ్లు తాగాలి. దీనివల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉంటుంది. ఇక వ్యాయామం చేసేవారికి శక్తి చాలా అవసరం. శక్తికి కొలమానం కెలొరీలు. ఇవి మనం తీసుకునే ఆహారం నుంచి అందుతాయి. అయితే బరువు తగ్గాలనే ఆలోచనతో చాలామంది...ఆహారాన్ని కెలొరీల్లో లెక్కపెట్టుకుని తింటారు. దీని వల్ల మేలు కంటే చెడే ఎక్కువంటున్నారు నిపుణులు. ఎందుకంటే వయసుని బట్టి కెలొరీల అవసరం ఉంటుంది. అవి సరైన మోతాదులో శరీరానికి అందకపోతే బరువుని అదుపులో ఉంచుకోవడం అసాధ్యం. పైగా నీరసం, ఇతర అనారోగ్యాలూ మిమ్మల్ని చుట్టుముడతాయి. జీవక్రియలు దెబ్బతినే ప్రమాదమూ ఉంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారం సమతులంగా ఉండేలా చూసుకోవాలి. తేలిగ్గా జీర్ణమైన పోషకాహారం అంటే..ఎండుఫలాలూ, ఆకుకూరలూ, కాయగూరలు వంటివన్నీ మీ ఆహారప్రణాళికలో చేర్చుకోండి. ఫలితంగా తగినంత శక్తి లభించి మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. 
నచ్చినట్లుగా...  మొదటిసారి వ్యాయామం చేసేవాళ్లు ఆరుబయట చేస్తే ఉత్సాహం పెరుగుతుంది. వ్యాయామం బోర్‌ కొట్టకుండా ఉండాలంటే మీకు ఆటలా అనిపిస్తూనే శరీరానికి శ్రమ కల్పించేవాటిని ఎంపిక చేసుకోండి. వ్యాయామం చేయాలన్న ఆలోచన రాగానే రెండు రోజులు చేసి తరువాత మానేస్తారు కొందరు. అలాంటివారు మనసుకి నచ్చిన వర్కవుట్లను ఎంచుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు మీకు డ్యాన్స్‌ అంటే ఇష్టమయితే హాయిగా జుంబా తరగతిలోనో, ఏరోబిక్స్‌ క్లాస్‌లోనో చేరిపోండి. ఆటలంటే ఆసక్తి ఉందా! ఏదైనా క్రీడా తరగతుల్లో చేరండి. నీళ్లను చూస్తే మైమరిచిపోతారా? అయితే ఈతను ఎంచుకోండి. 
ఏం చేయాలి? ఎలా చేయాలి... 
  అన్ని వ్యాయామాల్ని ఒకేసారి, అదేపనిగా చేయడం వల్ల కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దానికంటే వ్యాయామం చేసే సమయాన్ని రోజూ కొంత చొప్పున పెంచుకుంటూ వెళ్లండి. క్రమంగా అలవాటు పడతారు. అలానే ఏ ఇబ్బందీ రాకుండా ఉండాలంటే ప్రారంభంలో నిపుణుల సాయంతో చేయడం మంచిది. చాలామంది అమ్మాయిలు వ్యాయామం అంటే పెద్ద పెద్ద బరువులెత్తాలని, దానివల్ల సున్నితత్వం కోల్పోతామనీ, మగవారిలా కండలు పెరిగిపోతాయని అనుకుంటారు. అయితే అవన్నీ అపోహలే. అన్ని వ్యాయామాలు అందరూ చేయొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం వారంలో కనీసం రెండు సార్లు బరువులెత్తాలి. ఉదాహరణకు నటి సమంతనే తీసుకుంటే...తన శరీరానికి సరిపోయే బరువుల్ని తన ఫిట్‌నెస్‌లో భాగంగా ఎత్తుతుంది. అంతే నాజూగ్గానూ కనిపిస్తుంది. నిజానికి దీనివల్ల కండరాలు దృఢమవుతాయి. అలానే శరీరంలోని ప్రతిభాగానికి వ్యాయామ ఫలితం అందేలా మిక్స్‌డ్‌ వర్కవుట్లను ఎంచుకుంటే మేలు. అంటే యోగా, పరుగూ, జుంబా, సైక్లింగ్‌....ఇలా అన్నిరకాలూ మీ వ్యాయామ ప్రణాళికలో ఉంటే మీరు కోరుకున్న ఫలితం సులువుగా సాధ్యమవుతుంది. 
క్రమం తప్పొద్దు... వ్యాయామం చేయడానికి ఇంత సమయం అని పెట్టుకోకండి. ఉదాహరణకు అరగంట పాటు నడవాలనుకున్నారు. కానీ ఆ సమయం కూడా మీకు లేదు. దాంతో మొత్తానికి నడకే ఆపేయొద్దు. ఆ రోజుకి కనీసం ఐదు నిమిషాలైనా సరే! చేయండి. ఇలా నెమ్మదిగా ఆ సమయాన్ని పెంచుకోండి. క్రమం తప్పకుండా మీ శరీరానికి వ్యాయామాన్ని అలవాటు చేయండి. అదీ కుదరలేదంటే మరో మార్గం ఉంది. వారంలో మూడురోజులు చేసినా చాలు. అలానే మీ వ్యాయామ ప్రణాళికకు తగ్గట్లుగా మీ దినచర్యలో సర్దుబాట్లు చేసుకోవడం తప్పనిసరి. ఇవన్నీ చేయగలిగితే మీరు అలవాటు పడతారు. అయితే వ్యాయామం మొదలుపెట్టిన రెండు, మూడు వారాల్లోనే మీరు కోరుకున్న మార్పు వచ్చేస్తుందని ఆశించకండి. ఎందుకంటే ఇలా కనీసం పన్నెండు వారాల పాటు చేస్తే ఫలితం కనిపిస్తుందంటున్నారు వ్యాయామ నిపుణులు. 
సమయ పాలన... మారిన పరిస్థితుల్లో ఆహారం తినేవేళలూ, నిద్రపోయే సమయం అన్నీ మారిపోయాయి. వీటికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ ప్రతిదానికీ సమయపాలన పాటించండి.  నిద్రపోవడానికి కనీసం రెండుగంటల ముందు ఆహారం తీసుకోవడం వల్ల సక్రమంగా జీర్ణం అవుతుంది. అలానే రోజూ కనీసం ఏడెనిమిది గంటలు గాఢమైన నిద్ర శరీరంలో అనారోగ్యకరమైన బరువు పెరగదు. ఇవన్నీ సక్రమంగా చేయగలిగితే బరువుతగ్గడం సులువే. 
తోడు అవసరం...   వ్యాయామం చేయాలని చాలా సార్లే అనుకున్నా కొందరు పదే పదే వాయిదా వేస్తుంటారు. అందుకోసం బోలెడు సాకులూ వెతుక్కుంటారు. నిజానికి ఒంటరిగా వ్యాయామం చేయలేకే అలా చేస్తుంటారు. ఈసారి అలా వాయిదా వేయకుండా ఉండాలంటే మీలానే వ్యాయామం చేయాలనుకుంటున్న మరో తోడుని వెతుక్కోండి. దీనివల్ల ఒకరికి ఒకరు స్ఫూర్తినందించుకుంటూ సాగిపోవచ్చు. అలానే ఇప్పుడు హోం ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌లూ అందుబాటులో ఉంటున్నారు. వ్యాయామం చేయాలనుకున్న నలుగురైదుగురు కలిస్తే...శిక్షకులనే ఇంటికే పిలవొచ్చు. దీనివల్ల మీ సమయం సద్వినియోగం చేసుకోవచ్చు.

అప్‌డేట్‌ చేసుకుంటూ.. 

ఎప్పుడే ఒకే తరహా వ్యాయామలు బోర్‌ కొడతాయి. వైవిధ్యంగా ఎంచుకోవడం వల్ల మీలో ఆసక్తి పెరుగుతుంది.  అది జిమ్‌లో వర్కవుట్‌ కావొచ్చు, యోగా, వోగా, స్విమ్మింగ్‌, తాయ్‌చీ...ఇలా ఏదైనా కావొచ్చు. ప్రయత్నించండి. బరువులు ఎత్తి చేసే వ్యాయామాలని వెయిట్‌ ట్రైనింగ్‌ అంటారు. తక్కిన వ్యాయామాలతో పోలిస్తే... ఇది మహిళలకు ఎక్కువ మేలు చేస్తాయి. వీటివల్ల శరీరం నుంచి విడుదలయ్యే ఫీల్‌గుడ్‌ హార్మోన్‌లు మెదడునీ ఉల్లాసంగా ఉంచుతాయి. 

-మణిపవిత్ర, ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌


మరిన్ని