close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నక్షత్రాన్ని అందుకుంది

నక్షత్రాన్ని అందుకుంది

ముంబయికి చెందిన 30 ఏళ్ల గరిమా అరోరా చెఫ్‌. భారతీయ వంటకాలతోపాటు బ్యాంకాక్‌ రుచులను అందిస్తున్న ఈమె ఈ ఏడాది ప్రత్యేకమైన గౌరవాన్ని అందుకుంది. రుచితోపాటు, నాణ్యమైన పదార్థాలు అందించే హోటల్‌ని రెడ్‌ మిఛెలిన్‌ గైడ్‌ అనే సంస్థ గుర్తించి, మిఛెలిన్‌ స్టార్‌తో గౌరవిస్తుంది. ఇది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఈ ఏడాది తొలిసారిగా భారతీయ మహిళ గరీమ ఆ పురస్కారాన్ని దక్కించుకుంది. గరీమా అరోరా పుట్టింది ముంబయిలోనే. జైహింద్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, పాత్రికేయురాలిగా పనిచేసింది. చెఫ్‌ కావాలనే లక్ష్యంతో ఈ రంగంలోకి వచ్చింది. శిక్షణానంతరం ప్రముఖ హోటళ్లలో పనిచేసింది. ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ స్థాయికి చేరుకున్నాక 2017లో బ్యాంకాక్‌లో ‘రెస్టారెంట్‌- గా’ అనే హోటల్‌ను ప్రారంభించింది. అప్పట్లో బ్యాంకాక్‌లో రెస్టారెంట్‌ ప్రారంభించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ స్థానికంగానే కాదు, దేశవిదేశాలకు చెందిన అతిథుల మన్ననలు అందుకుంది. ‘మిఛెలిన్‌ గైడ్‌ సంస్థ నుంచి గుర్తింపు పొందడమంటే... అరుదైన గౌరవమే. వంటకాల నాణ్యతతోపాటు, ఆయా రకాల ప్రత్యేకతలను, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల అభిప్రాయాలను కూడా పరిశీలించిన తరువాతే ఈ స్టార్‌ను బహూకరిస్తుందా సంస్థ. ఆ గుర్తింపుతోపాటు  మిఛెలిన్‌ స్టార్డ్‌ రెస్టారెంట్‌ టైటిల్‌ కూడా సొంతం చేసుకున్నా. ఈ విజయం నా బృందానికీ చెందుతుంది...’ అంటోంది గరిమ. ఈ నక్షత్రాన్ని అందుకున్న తొలి మహిళా చెఫ్‌ కూడా గరిమానే కావడం గమనార్హం. 
  
 


మరిన్ని