close

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దత్తత

- పోర్షియాదేవి

కిటికీకి తల ఆనించి వీధి మలుపుకి చూపు సారించి దీర్ఘంగా చూస్తూనే ఉంది సుజాత. అప్పటికే టీ తాగడం పూర్తిచేసిన రాఘవ, ‘‘వీధి చివరికి వచ్చిన పిల్ల ఇంటికి రాకుండా పోతుందా సుజా... వచ్చి టీ తాగు చల్లారిపోతుంది’’ అని పిలిచాడు.
మళ్లీ ఒకసారి చివరికంటా చూసి... వచ్చి కూర్చొని మెల్లగా టీ తాగుతూ ‘‘ఈ మధ్యన ఇంచుమించు రోజూ లేటవుతోంది. పిల్లకి ఎంతాకలి వేస్తుందో. మధ్యాహ్నం లంచ్‌లో తిన్న నాలుగు మెతుకులు ఎప్పుడో అరిగిపోయుంటాయి పాపం. వద్దండీ అని మొత్తుకున్నా వినకుండా ఆ కాలేజీలో చేర్చారు. రెండు గంటలు ప్రయాణం చేసి వచ్చేసరికి అలిసిపోతుంది పిల్ల’’ అంటూ కణతలు నొక్కుకుంది.
‘‘మనపిల్లొక్కతేనా సుజా... అందరూ వెళ్తున్నారు, అది మంచి కాలేజీ అనే కదా. అందులోనూ బైపీసీ గ్రూప్‌ కదా మంచి ర్యాంక్‌ వస్తేనే మెడిసిన్‌ సీట్‌ వస్తుంది. పోనీ కాలేజీ పక్కనే ఉన్న కాలనీకి మారిపోదాం అంటే నువ్వొప్పుకోలేదుగా, అయినా ఇంకో ఆరు నెలలేగా బాధపడకు’’ అని ఓదార్పుగా చేయి వెయ్యబోయేసరికి... చేయి విసురుగా తోసేస్తూ... ‘‘ఏంటీ ఆ కాలనీకా... నా కూతుర్ని నాకు దూరం చేసేవరకూ మీకు తృప్తి లేదా ఏం’’ అని అరిచింది.
ఇంక మారు మాట్లాడలేదు రాఘవ. కానీ సుజాత ఏదో గొణుక్కుంటూనే ఉంది.
బెల్‌ మోగిన శబ్దానికి గొణుగుడు ఆపి మొహానికి నవ్వు పులుముకుని తలుపు తీసింది. సిరి మెల్లగా లోనికి వచ్చి బ్యాగ్‌ ఛైర్‌లో జారవిడిచి హుస్సురంటూ కూర్చుంది.
‘‘అయ్యో తల్లీ ఎంత అలసిపోయావు... ఇదిగో మంచినీళ్లు తాగు. కాళ్లూ చేతులూ కడుక్కునిరా, మసాలా గారెలు చేశాను తిందువుగాని’’ అంటూ హడావిడి చేసింది సుజాత.
‘‘అబ్బా.. ఆగమ్మా... నాకు ఆకలి లేదుగానీ పాలివ్వు తాగేసి చదువుకుంటా. మసాలాగారెలు రాత్రికి అన్నంతో తింటాలే’’ అంటూ వాష్‌ రూమ్‌లోకి వెళ్లింది.
ప్రాణం ఉసూరుమంది సుజాతకి, మధ్యాహ్నం నిద్రపోకుండా కష్టపడి చేస్తే తినననేసింది. ఈ పిల్లకి ఆకలి లేదా... లేక...
ఏదో అనుమానం మనసులోకి వస్తున్నా, దాన్ని పెరగనీయకుండా పాలు పొయ్యిమీద పెట్టి మళ్లీ హాలులోకి వచ్చి బ్యాగ్‌ తీసుకుని సిరి రూమ్‌లో పెట్టింది.
వేడివేడిగా పాలు గ్లాస్‌లో పోసి తీసుకొచ్చే సరికి సిరి బయటకు వచ్చి టవల్‌తో మొహం తుడుచుకుంటూ ఉంది. ప్రెష్‌గా ఉన్న సిరి మొహం చూడగానే అంతదాకా పడిన టెన్షన్‌ అంతా పోయి మనసు తేటగా అయింది.
మనసులోని అనుమానాన్ని ఏమోలే అనుకుని సమాధానపర్చుకుంది.
‘‘ఎందుకమ్మా ఆకలి లేదా’’ అని అడుగుతూ పాలగ్లాసు అందించింది.
సిరి ఏదో చెప్పబోయి తండ్రి హెచ్చరిక గుర్తొచ్చి, ‘‘లేదమ్మా చదువుకోవాలి. ఇప్పుడు తినే టైం కూడా లేదు. వంటకాగానే నువ్వే తినిపించేసేయమ్మా, నేను చదువుకుంటూ ఉంటాను’’ అంటూ కిటికీ దగ్గరకు ఛైర్‌ లాక్కొని కూర్చుంది.
వంటింట్లోకి వెళ్లబోతూ ఏదో గుర్తొచ్చి హాలులోకి వెళ్లింది సుజాత. రాఘవ పక్కనే కూర్చొని ‘‘ఏవండీ కాలేజీ నుంచి రాగానే ఆవురావురుమంటూ ఏది పెట్టినా తినే పిల్ల ఈ మధ్య తరచూ ఆకలి లేదంటోంది కొంపతీసి...’’ అని ఆర్థోక్తిలో ఆపేసింది.
టీవీ ఛానెల్‌ మారుస్తున్నవాడల్లా విసుగ్గా మొహం పెట్టి ‘‘ఏమీ కాదులే సుజా, పిల్లలు పఫ్‌లనీ, పేస్ట్రీలనీ కొనుక్కుని తింటుంటారు అంతే. వంటచేయి త్వరగా’’ అని టీవీ వైపు మొహం తిప్పేశాడు.
‘అయినా తన పిచ్చి కాకపోతే ఏనాడైనా తనకి ఏమైనా చెప్పాడా తన మాట విన్నాడా, ఇదంతా తన ఖర్మ’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది.
కొద్దిసేపటికి సిరి కిచెన్‌లోకి వచ్చి ‘‘ఏమొండుతున్నావమ్మా’’ అంటూ వెనుకనుంచి తల్లిని కావలించుకుంది. ఒక్కసారిగా మనసులోని ఆందోళన పోయి సంతోషం నిండిపోయింది. ‘ఈ ప్రేమకోసం తానేమైనా చేస్తుంది’ అనుకుంది.
రాత్రంతా ఏవో ఆలోచనలతో నిద్ర పట్టక కలత నిద్రపోయినా రోజులానే వేకువనే నిద్ర లేచింది సుజాత.
ఎప్పుడూకూడా సిరిలేచేలోపే లేచి టిఫిన్‌, బాక్స్‌లోకి ఏదో స్పెషల్‌ చేసేసి అప్పుడు సిరిని లేపుతుంది. టిఫిన్‌ తినిపిస్తూ వెనుకే తిరుగుతూ సిరి కాలేజీకి వెళ్లేవరకూ బిజీగానే ఉంటుంది.
సిరి వెళ్లిపోయాక ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి పూజ చేసుకుంటేనే ఆమెకి ప్రశాంతత.
సిరికి బై చెప్పి ‘‘ఏమండీ’’ అంటూ లోపలికి వచ్చింది సుజాత.
రాఘవ టేబుల్‌ ముందు కూర్చొని టిఫిన్‌ తింటున్నాడు. ఎదురుగా కూర్చొని ‘‘ఏమండీ మీరెన్నయినా చెప్పండి, సిరి తప్పనిసరిగా వాళ్లని కలుస్తోంది. మీరు కళ్లు మూసుకుని నన్నూ మూసుకోమంటున్నారు. ఇదెక్కడికి వెళుతుందో అని నాకు రోజు రోజుకీ టెన్షన్‌ పెరుగుతోంది’’ అని తల కొట్టుకుంది.
‘‘నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు సుజా’’ అని తాపీగా సమాధానం చెప్పాడు రాఘవ.
‘‘అంతేలెండి, నేనేగా పరాయిదాన్ని. నా ఖర్మ కాకపోతే దేవుడే నాకు అన్యాయం చేశాడు ఇంక మీరేమి మేలు చేస్తారులే నాకు’’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది.
స్నానమదీ చేసి సిరి గదిలో దుప్పట్లు మడతపెడదామనుకుని దులుపుతుంటే సిరి సెల్‌ఫోన్‌ కనిపించింది.
‘అయ్యో మర్చిపోయినట్టుంది. ఈరోజు ఇంక కనీసం లంచ్‌ టైంలో కాల్‌ చేసి తిన్నావామ్మా అని అడగడానికి కూడా వీలవదుగా. ఏంటో ఈ పిల్ల ఎంత వెంట ఉన్నా ఏదో ఒకటి మర్చిపోతుంది.’ అనుకుంటూ... చార్జింగ్‌ పెడదామని ఫోన్‌ అందుకుని, ఏదో ఆలోచన రాగా ఫోన్‌ ఆన్‌చేసి కాల్‌ లిస్ట్‌ ఓపెన్‌ చేసింది.
ముందురోజు రిసీవ్డ్‌ కాల్స్‌లో బాబాయి అనే పేరు చూడగానే ఒక్కసారి కోపంతో ఊగిపోయింది సుజాత. చెప్పలేనంత దుఃఖంతో అరుస్తూ... బయటకు వెళ్లడానికి రెడీ అవుతున్న రాఘవ దగ్గరికి వెళ్లి ఫోన్‌ కళ్లముందు ఆడించి, ‘‘ఇదేమిటి... అందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారన్నమాట. నేను మీకేమి ద్రోహం చేశానండీ’’ అంటూ గోడకేసి తలబాదుకోసాగింది.
రాఘవ దగ్గరకొచ్చి గట్టిగా పట్టుకుని ‘‘పిచ్చెక్కిందా నీకు’’ అంటూ బలవంతంగా కూర్చోబెట్టి నీళ్లు తాగించబోయాడు.
సుజాత తల అటూ ఇటూ తిప్పుతూ ‘‘నాకొద్దు. మీరూ మీ కూతురూ మీ వాళ్లూ అంతా కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారుగా. నేను చస్తాను మీరంతా హాయిగా ఉండండి’’ అంటూ హిస్టీరికల్‌గా ఏడవసాగింది.

రాఘవకి ఏమి చేయాలో అర్థంకావడం లేదు. అతను ఊహిస్తూనే ఉన్నాడు ఇలాంటి పరిస్థితి రావొచ్చని. తీరా వచ్చినప్పుడు ఎలా స్పందించాలో అర్థమే కావడంలేదు.
మెల్లగా ఆమె పక్కనే కూర్చొని ‘‘నా మాట విను సుజా. కాస్త స్థిమితపడు’’ అంటూ దగ్గరికి తీసుకోబోయాడు. సుజాత ఒక్క విదిలింపుతో తోసేసి విసురుగా లేచి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి మంచంమీద వాలిపోయి వెక్కిళ్లు పెడుతూ ఉంది.
రాఘవ దీర్ఘంగా నిట్టూర్చి ఫోన్‌ తీసుకుని పెరట్లోకి వెళ్లాడు. ఒక్క క్షణం ఏదో ఆలోచించి తమ్ముడికి కాల్‌ చేశాడు.
కుమార్‌ ఫోన్‌లో ‘‘హలో అన్నయ్యా బాగున్నారా’’ అని అనగానే ‘‘మా బాగు ఏమి చెప్తాలేగానీ నువ్వు నిన్న సిరి కాలేజీకి వెళ్లావా’’ అని స్ట్రెయిట్‌గా అడిగాడు.
కుమార్‌ ఒక్క క్షణం మౌనం వహించాడు. ‘చెప్పరా’ అని రాఘవ రెట్టించేసరికి మెల్లగా ‘‘ఇంట్లో చికెన్‌ బిర్యానీ చేశామన్నయ్యా. సిరికి ఇష్టం కదా, తననీ ఒకసారి చూసినట్టు ఉంటుందని నేనూ మీ మరదలూ వెళ్లాం. వదినకి తెలిసిపోయిందా అన్నయ్యా’’ అన్నాడు.
కుమార్‌ కంఠంలో బెదురు చూసి రాఘవ బాధ రెట్టింపు అయింది. ‘‘ఏమీ లేదులేరా, నిన్న సిరి ఆకలి లేదంటేనూ మీరేమైనా తీసుకుని వెళ్లి తినిపించారేమోనని అనుమానం వచ్చింది. సరేలేగానీ నువ్విలా కాలేజీకి వెళ్లి కలవడం మానేస్తేనే బెటర్‌రా, అర్థం చేసుకో’’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు.
‘నిజానికి ఎవరు అర్థం చేసుకోవాలి... కుమారా నువ్వా’ అని లోపలి నుంచి ఎవరో ప్రశ్నించినట్టు అనిపించి తల దించుకున్నాడు.
అసలు తాము పిల్లలులేని వాళ్లలానే ఉండిపోతే ఒకటే బాధ ఉండేదేమో ఇప్పుడు అందరికీ బాధ అని అనుకుంటుంటే గతం గుర్తొచ్చింది.

*           *           *

పెళ్లయ్యాక ఒక రెండేళ్లు తానూ సుజాతా పిల్లలకోసం ఏమీ ఆలోచించలేదు. రెండేళ్ల తరువాత అందరూ ‘ఇంకా విశేషమేమీ లేదా’ అని అడుగుతుంటే కూడా ఇంకో మూడేళ్లు  కులాసాగానే గడిపేశారు.
ఈలోగా తమ్ముడు కుమార్‌కి పెళ్లవడం, సంవత్సరం తిరగకుండానే మరదలు గర్భం దాల్చడంతో సుజాత కొంచెం కలత చెందడం మొదలయింది.
సీమంతాలు, సూడిదలు, కళ్లముందే తోడికోడలు పండంటి పాపను ఎత్తుకోవడం, భర్తతో పీటలమీద కూర్చొని బారసాల చేసు కోవడం చూస్తూ ఆత్మన్యూనతకు లోనయ్యేది.
‘ఏమండీ నాకెందుకు పిల్లలు పుట్టడం లేదు... నాలో ఏదో లోపం ఉందా, నేను తల్లిని కాలేనా’ అని బేలగా ప్రశ్నించేది.
అలాగే ఇంకో సంవత్సరం కూడా గడిచి పోయాక తండ్రి హెచ్చరించడం, తల్లి కొద్దిగా సూటిపోటి మాటలనడం మొదలయ్యాక గుండెలు దడదడలాడుతుండగా డాక్టర్‌ని కలిశారు.
ఒక ఐదేళ్లు ఆ టెస్టులూ, ఈ మందులూ, సుజాతకి చిన్న చిన్న ఆపరేషన్లూ జరిగాక ఇద్దరిలోనూ పెద్దగా సమస్యలేదుకానీ సంతానం ఎందుకు కలగడం లేదో తెలియడం లేదని తేల్చారు.
ఇంకో ఐదేళ్లు ఆయుర్వేదం, హోమియో, పసర్లూ, మొక్కులూ, మంత్రాలూ, తాయెత్తులూ... ఒకటేంటి సుజాత ఎవరు ఏంచెప్తే అది చేసింది.
మొత్తానికి పెళ్లయి పదిహేనేళ్లు గడిచాక ఇద్దరికీ అర్థమయిపోయింది తమకింక సంతానం కలగదని.

అప్పటికి తమ్ముడికి ఇద్దరు ఆడపిల్లలు. మూడోసారి మరదలు గర్భంతో ఉంది. ఇద్దరూ ఆడపిల్లలవడం మూలానా మగసంతానం కోసం తల్లి పట్టుపట్టడంతో తమ్ముడికి ఇష్టం లేకపోయినా మూడో సంతానానికి రెడీకాక తప్పలేదు.
తమ్ముడు గవర్నమెంట్‌ టీచర్‌. పల్లెలోనే పోస్టింగ్‌ అవడంతో అమ్మా వాళ్ల దగ్గరే పల్లెలోనే ఉండేవాడు. తనుకూడా మొదట్లో పల్లెలోనే ఉంటూ బ్యాంకుకి వెళ్లేవాడు. తరువాత వైద్యం కోసమని మెల్లమెల్లగా ట్రాన్స్‌ఫర్లు అవుతూ సిటీకి వచ్చేశాడు. సుజాత కూడా మంచి కాన్వెంట్‌లో టీచర్‌గా జాబ్‌ చేసేది.

పండగలకీ పబ్బాలకీ రెగ్యులర్‌గా పల్లెకు వెళ్లేవారు. తమ్ముడూ తనూ ఇద్దరే అవడంతో మంచి అనుబంధమే ఉండేది. అదృష్టమేంటంటే మరదలూ, సుజాతా కూడా సొంత అక్కాచెల్లెళ్లలానే కలిసిపోయారు.
తోడికోడలు నిండుగా పూసిన చెట్టులా పిల్లలతో కళకళలాడుతుంటే కొంచెం చివుక్కు మంటున్నా దాన్ని పెరగనియ్యక పిల్లల్ని దగ్గరికి తీస్తూ వాళ్లకి సేవలు చేస్తూ తోడి కోడలికి చేదోడుగా ఉండేది. పుట్టినరోజులకీ, పండగలకీ పిల్లలకి పట్టులంగాలూ, బట్టలూ, బొమ్మలూ కొనేది. వాళ్లను చూసుకుంటూ పిల్లలు లేరన్న బాధ మరిచిపోయేది.
మరదలికి ఏడో నెల వచ్చాక స్కానింగ్‌లో- కవలలు పుట్టనున్నారని తెలిసింది.
నిజానికి సుజాతకి పిల్లలు పుట్టడం కష్టమని తెలిసినప్పటినుంచీ తమ్ముడి పిల్లలు దివ్య, రమ్యలలో ఒకరిని పెంచుకోమని తల్లి చెప్తూనే ఉండేది.
కానీ ఊహ తెలిసిన పిల్లలను పెంచుకుంటే తమని అమ్మా నాన్నా అంటారా అని తాము దానికి సిద్ధపడలేదు. ‘ప్రత్యేకంగా పెంచుకోవడం ఎందుకమ్మా, వాడి పిల్లలు నా పిల్లలు కారా’ అంటూ దాటవేస్తూ వచ్చాడు.
కానీ కవలలు పుట్టబోతున్నారనేసరికి, ‘ఇప్పటికే ఇద్దరున్నారు. తమ్ముడికి పెంచడం భారమే కదా. మీరు పెంచుకోవాల్సిందే’ అని తల్లి ఖచ్చితంగా చెప్పేసింది.
పురిట్లోనే తెచ్చుకుని పెంచుకోవచ్చనేసరికి సుజాతకి కూడా ఆశ కలిగింది. మరదలికి ఒక పాపా ఒక బాబూ పుట్టడంతో బారసాల రోజే పాపని తాము దత్తత తీసుకున్నారు.
సుజాతతో పీటలమీద కూర్చొని పాపను చూసుకుంటుంటే జన్మ ధన్యమయినట్లనిపించింది. తాము కన్నపిల్లే అనిపించింది తప్ప పెంచుకుంటున్న భావమే కలగలేదు ఇద్దరికీ.
మరదలూ, తమ్ముడూ కొంచెం దిగులు పడినా... ‘‘నీ, నా అన్న తేడా ఏముందిరా. అందరూ మనపిల్లలే పండుగలకూ పబ్బాలకూ కలుస్తూనే ఉంటాము కదా. సెలవులొస్తే మీరు మా దగ్గరకి వస్తారు. ఇంచుమించు కలిసే పెరుగుతారు. ఇంక విచారం దేనికి’’ అని తాను ధైర్యం చెప్పాడు. మరదలికి మాత్రం మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించాడు.

‘‘అయ్యో బావగారూ, మీ దగ్గర నా బిడ్డ పెరగడం దాని అదృష్టం. చిన్నదాన్ని నాకు నమస్కరించకండి’’ అంటూ గుండెలోని బాధని దిగమింగుకుంటూ వీడ్కోలు పలికింది.
మరదలు అన్నట్లు సిరిపాప నిజంగానే అదృష్టవంతురాలే. పాప వచ్చిన వేళావిశేషం- రాఘవకి ప్రమోషన్‌ వచ్చింది. అలాగే లోన్‌పెట్టి సొంత ఇంటివాడయ్యాడు.
ఇక సుజాత అయితే మాతృత్వపు మధురిమల్లో మునిగిపోయింది. పాపే తన ప్రపంచమయింది. ఓ మూడేళ్లు జాబ్‌కి లాంగ్‌ లీవ్‌ పెట్టేసింది.
పల్లెకు వెళ్లాలంటే కూడా ఇష్టపడేది కాదు.
‘అమ్మో పాపకి ఏ జ్వరమో వస్తే...’ అంటూ కంగారుపడిపోయేది. అయితే అత్తామామా ఉన్నంత కాలం ఊరెళ్లక తప్పకపోయేది. పాపకి మూడోఏడు జరుగుతుండగా అత్తా మామా ఆరుమాసాల తేడాలో చనిపోయారు. దానితో ఊరెళ్లడం తగ్గించేసింది. అంతేకాదు, సిరిని తోడికోడలుగానీ మరిదిగానీ ముద్దుచేస్తే తట్టుకోలేకపోయేది. పెద్దపిల్లలిద్దరికీ సకల సేవలూ చేసిన సుజాత సిరితోపాటే పుట్టిన శ్రీకర్‌ని కనీసం ఎడంచేత్తో కూడా తాకేది కాదు.
మొదటి సంవత్సరం పండగకి వెళ్లినప్పుడు మరిది తన పిల్లలతోపాటు సిరికి కూడా బట్టలు తీసుకొచ్చాడు. అది చూసి సుజాత మరిదిని పక్కకి పిలిచి ఇంకెప్పుడూ సిరికి బట్టలు కొనవద్దని ఖచ్చితంగా చెప్పేసింది.
కుమార్‌ ఆశ్చర్యపోయాడు వదినలోని మార్పుని చూసి. పండగలకీ పుట్టినరోజులకీ పిల్లలందరికీ బట్టలు తీసే వదిన శ్రీకర్‌కే కాదు పెద్దపిల్లలిద్దరికి సైతం బట్టలు తేలేదు సరికదా, సిరికి కొనవద్దని తనతో చెప్పడం మనసుని చివుక్కుమనిపించింది.
సరితకూడా అక్కలోని మార్పుకి బాధపడింది. ‘తమ మధ్య అనుబంధం మరింత చిక్కనవుతుందని తాము పిల్లని దత్తత ఇస్తే అక్కేమో ఇంకోలా ప్రవర్తిస్తోంది ఎందుకో’ అని ఆలోచనలో పడింది.
దత్తతకు ఇవ్వాలి అనుకున్నప్పుడు తాను బాధపడుతుంటే, ‘‘ఎక్కడికో దూరం ఇస్తున్నావా ఏంటి, వాళ్లు ఇక్కడికీ మీరు అక్కడికీ వెళ్తూనే ఉంటారు. అయినా సుజాత నీ పిల్లలను సాకడం ఏమైనా కొత్తా... కలిసే పెంచారు కదా ఇప్పటివరకూ, ఇదీ అంతే. ఏదో వాళ్ల తృప్తి కోసం దత్తత ఇవ్వడం అంతే’’ అని భర్తా అత్తా ఓదార్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు.
ఇక తరువాత వారి మధ్య పూర్తిగా దూరం పెరిగిపోయింది. మరిది కుటుంబాన్ని సెలవులకు పిలవడాలూ తాము పండగలకు పోవడాలూ మానేశారు.
అప్పుడప్పుడూ కుమార్‌వాళ్లే వచ్చేవారు. వాళ్లున్న నాలుగురోజులూ ఇల్లంతా సందడిగా ఉండి సిరి శ్రీకర్‌తోనూ అక్కలిద్దరితోనూ చక్కగా ఆడుకుంటుంటే రాఘవకి సంతోషంగా ఉండేది.
కానీ సుజాత మాత్రం వాళ్లు ఎప్పుడెళ్లి పోతారా అన్నట్టు చూసేది. దానితో రోజు రోజుకీ వాళ్లు రావడం కూడా తగ్గిపోయింది.
పెద్ద పిల్లలు కాలేజీ చదువులకొచ్చేసరికి తమ్ముడు కూడా సిటీకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని ఫ్యామిలీతో షిఫ్ట్‌ అయిపోయాడు. అయినా వారిమధ్య రాకపోకలు పెరగలేదు.
అద్దెలు తక్కువని కుమార్‌ శివార్లలో ఇల్లు తీసుకున్నాడు. వాళ్లు ఒకటి రెండుసార్లు వచ్చినా సుజాత ఒక్కసారైనా వాళ్లింటికి వెళ్లలేదు. ‘‘ఆ... అంతదూరం పిల్ల వడిలిపోతుంది ఏం వెళ్తాంలెండి’’ అంటూ రాఘవ అడిగినప్పుడల్లా తోసిపుచ్చేసేది. దాంతో అన్నదమ్ముల మధ్య రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.
సిరికి మొదటినుంచీ చిన్నాన్న వాళ్లొస్తే చాలా ఇష్టం. రాఘవ కన్నా కుమార్‌ పిల్లలను బాగా ముద్దు చేస్తాడు. ఇక సరిత కూడా అవకాశం దొరికితే సిరిని ఎత్తుకుని ముద్దుచేసేది. అందుకని వాళ్లెళ్లిపోయిన తరువాత మళ్లీ వాళ్లు ఎప్పుడొస్తారూ అని అడుగుతూ ఉండేది.
వాళ్లున్నన్ని రోజులూ ఇంట్లో సందడిగా అలవాటుపడి వెళ్లిపోయాక తల్లీ, తండ్రీ, తానూ ఏంటో ఒంటరితనంగా ఉండేది.
‘‘మన ఇంట్లో కూడా అలా అందరూ ఉంటే బాగుండేది కదా నాన్నా’’ అని అడిగేది.
పాపకి మూడేళ్లు నిండగానే- సుజాత తాను గతంలో పనిచేసిన స్కూల్‌లోనే వేసి తాను కూడా టీచర్‌గా జాయిన్‌ అయిపోయి సిరి టెన్త్‌ వరకూ దగ్గరుండే చూసుకుంది. టెన్త్‌ అయిపోయాక సుజాత కూడా జాబ్‌కి రిజైన్‌ చేసేసింది.

సిరి బైపీసీ తీసుకుంటాననగానే ఇప్పుడు చదువుతున్న కాలేజీ అయితే బాగుంటుందని రాఘవే కాక ఇంకా చాలామంది చెప్పడంతో సుజాత ఆలోచనలో పడింది... ‘అక్కడికి దగ్గరలోనే మరిదివాళ్లుంటారు, మళ్లీ రాకపోకలు మొదలవుతాయేమో, పిల్ల తనకి దూరమయిపోతుందేమో’ అని. కానీ పిల్ల భవిష్యత్తు కోసం రాజీపడింది. ముందే భర్తని హెచ్చరించింది ఎటువంటి కమ్యూనికేషన్‌ వాళ్లతో ఉండకూడదని.
ఇదేమీ తెలియని సిరి ‘‘నాన్నా మా కాలేజీ పక్కనే చిన్నాన్న వాళ్లుంటారు కదా, ఎంచక్కా అక్కలూ, శ్రీకర్‌ మేమంతా కలుసుకోవచ్చు కదా’’ అని సంబరంగా అనేసరికి, ఎప్పుడూ పిల్లని పల్లెత్తి మాటనని సుజాత ‘‘ఇందుకేనా లక్షలు పోసి నిన్నా క్యాంపస్‌లో చేర్చింది. ఇలాంటివన్నీ పెట్టుకుంటే నువ్వు మెడిసిన్‌లో సీట్‌ తెచ్చు కోవడం కష్టం’’ అని ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చేసరికి సిరి మెత్తగా అయిపోయింది.
కుమార్‌ ఎంతగా అన్నవాళ్లకు దూరంగా ఉన్నా సిరి పక్కనే కాలేజీలో చేరిందని తెలిసి భార్యని తీసుకుని వెళ్లి కలిసొచ్చాడు. ఆ విషయం సిరి ఎగురుకుంటూ వచ్చి చెప్పగానే పెద్ద గొడవే జరిగింది ఇంట్లో.
రాఘవని ఇష్టమొచ్చినట్టు తిట్టి ఏడుస్తూ పడుకుంది. సిరికి అర్థం కాలేదు తల్లి ఎందుకు చిన్నాన్నవాళ్లను కలవడం అంత తప్పన్నట్టు గొడవచేస్తుందీ అని.
ఆ మాటే తండ్రిని అడిగితే ‘అమ్మకి నీమీదున్న ప్రేమ తల్లీ. నువ్వు వాళ్లతో చనువు పెంచుకుని మీ అమ్మకు దూరమయి పోతావని భయమమ్మా’ అని సర్దిచెప్పాడు.
సిరి కాలేజీకి వెళ్లిన తరువాత మరిదికి ఫోన్‌చేసి ‘‘ఇందుకేనా మీ పిల్లని మాకు దత్తత ఇచ్చింది అది నా కూతురుకాదు మీరే కన్నారని చెప్పి దానిని నాకు దూరం చెయ్యడానికేగా కాలేజీకి వెళ్లి కలిశారు’ అని చెడామడా తిట్టేసింది.
అంత గొడవ జరిగిన తరువాత రాఘవ ఒక నిర్ణయానికి వచ్చి సుజాత లేనప్పుడు సిరితో ‘‘చూడమ్మా ఒకవేళ నువ్వు చిన్నాన్నా వాళ్లని కలిసినా ఆ విషయం అమ్మతో చెప్పకమ్మా’’ అని చెప్పాడు.
‘అదేంటి నాన్నా, ఇంత చిన్న విషయానికి అమ్మకు అబద్ధం చెప్పాలా’ అని ఆశ్చర్యపోతే, ‘చూడమ్మా నువ్వలా ఆ విషయం దాస్తేనే నువ్వు చిన్నాన్నా వాళ్లను అప్పుడప్పుడైనా కలవగలవు’ అనేసరికి ‘సరే నాన్నా’ అని ఒప్పుకుంది.
అదిగో అప్పటినుంచీ ఈ దాగుడుమూతలు మొదలయ్యాయి. వారంలో రెండుమూడు సార్లయినా వాళ్లు కాలేజీకి వెళ్లడమో లేదా ఏమైనా పుట్టినరోజులు లాంటి స్పెషల్స్‌ ఉన్న ప్పుడు సిరిని ఇంటికి తీసుకెళ్లడమో చేసేవాళ్లు.
సిరికి చిన్నాన్నా వాళ్లను కలవడం, ఇంటికెళ్లి అందరితో సందడిగా ఉండడం చాలా నచ్చేది.
రాఘవకి భార్యను మోసం చేస్తున్నందుకు ఒక్కోసారి బాధనిపిస్తున్నా ప్రశాంతంగా బతకా లంటే తప్పదనుకుని సమాధానపర్చుకునేవాడు.
ఇన్నాళ్లకు అబద్ధం బద్దలయింది.

*           *           *

ఆలోచనల్లోంచి బయటపడి సుజాత ఏంచేస్తుందో అనుకుంటూ గదిలోకి వెళ్లాడు.
సుజాత ఇంకా ఏడుస్తూనే ఉంది. మెల్లగా వెళ్లి పక్కనే కూర్చొని ‘‘సుజా ఎందుకింత బాధ పడుతున్నావు’’ అని నెమ్మదిగా వీపుమీద రాస్తూ అడిగాడు. ‘‘మీకర్థం కాదండీ, వాళ్లు ఇలాగే కలుస్తూ కొన్ని రోజులకి నిజం చెప్పే శారనుకోండి... నా కూతురు నాకు దూరమయి పోదా చెప్పండి’’ అంటూ బావురుమంది.
‘‘ఏంటి సుజా, నీ అనుమానాలకు అంతు లేదా. వాళ్లెందుకు చెప్తారు. చెప్పేవాళ్లయితే ఎప్పుడో నువ్వు వాళ్లని దూరం పెట్టినప్పుడే చెప్పేవాళ్లు. అయినా వాళ్లు చెప్పినా సిరి మనల్ని వదిలిపోతుందా చెప్పు. ఒక్కక్షణం ఆవేశ పడకుండా నేను చెప్పింది విను... ఒకవేళ సిరి మన కన్నకూతురే అయితే నువ్విలా భయపడేదానివా, అన్నదమ్ముల పిల్లలు కలిసిమెలిసి ఉండడం ఎంతో సహజమే కదా. ఎందుకు నువ్వింకా పరాయిదానిగానే ఆలోచిస్తున్నావు?’’ అని సూటిగా ప్రశ్నించాడు.
సుజాత ఒక్కక్షణం తికమక పడింది.  ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది.
సిరి వచ్చేవేళకు లేచి పొయ్యిమీద కుక్కర్‌ పెట్టి స్నానానికి వెళ్లింది.
హమ్మయ్య అనుకుని నిట్టూర్చాడు రాఘవ.
స్నానం చేసి బట్టలు ఆరపెట్టడానికి డాబా ఎక్కుతుంటే... పక్కవాటా గేటు ముందు మాటలు వినిపించి అటు చూసింది. ఎవరో చీపుర్లు అమ్ముకునే ఆమె... చంకలో నెలల పిల్లని ఎత్తుకుని, మూడేళ్ల పిల్లగాడు చేయిపట్టుకుని నడుస్తూ ఉంటే, పాపం తలమీద చీపుర్లు పెట్టుకుని అమ్ముకుంటోంది.
పక్కింటామె చీపుర్లు బేరంచేస్తూ ‘‘ఆ పిల్లల్ని ఎండలో తిప్పి చంపకపోతే ఏదైనా హోమ్‌లో చేర్చొచ్చుకదా శుభ్రమయిన తిండీ, చదువూ అబ్బుతాయి’’ అని సలహా ఇచ్చింది.
పక్కింటామె ఎన్జీవోలో పనిచేస్తుంది.
వెంటనే చీపుర్లు అమ్మే ఆమె ఆగ్రహంగా ‘చాలు చాల్లేమ్మా, నా కష్టంతో కలో గంజో పెట్టి నా పిల్లల్ని నేను పెంచుకోగలను. కొంటే కొను లేకపోతే మానెయ్‌. అంతేగానీ ఇట్టా చెప్పకు. కడుపారా కన్న పిల్లల్ని ఎక్కడో వదిలేయాలా మా బాగా చెప్పావు’ అని గొణుక్కుంటూపోయింది.
సుజాత లోనికివచ్చి, ఆ పనీ ఈ పనీ చేస్తూ ఉందన్న మాటేగానీ మనసులో ఆ చీపురులామె మెదులుతూనే ఉంది. ‘ఎంత ధీమాగా సమాధానం చెప్పింది, ఎంత ప్రేమ దానికి పిల్లలమీద’ అనుకుంటూ భర్తని భోజనానికి పిలిచింది.
సాయంత్రం సిరి వస్తూనే ‘‘అమ్మా ఈసారి నా పుట్టినరోజు సండే వచ్చింది కాలేజీకి వెళ్లక్కర్లేదోచ్‌’’ అంటూ ‘‘పోమ్మా... నువ్వు నాకింతవరకూ కొత్తబట్టలే తీయలేదు’’ అంది గోముగా.
‘అవునుకదా, ఈ సరికే నేను బట్టలు తీసేసి పుట్టినరోజు ప్లాన్స్‌లో ఉండేదాన్ని. అలా ఎలా మర్చిపోయాను’ అనుకుంటూ ‘‘లేదు బంగారూ రేపే మనం షాపింగ్‌కి వెళ్దాం. నీక్కావలసినవన్నీ కొనుక్కుందువుగాని’’ అంటూ సిరిని దగ్గరకు తీసుకుంది.
‘అప్పుడే తన బంగారానికి పదహారేళ్లు’ అనుకుంటుంటే కళ్లు తడయ్యాయి. ఒక నిశ్చయానికి వచ్చినదానిలా కళ్లు తుడుచుకుంటూ ‘తను ఈ పుట్టినరోజుకి సిరికి మరిచిపోలేని బహుమతిని ఇవ్వాలి’ అని గట్టిగా నిర్ణయించుకుంది.
చూస్తుండగానే సిరి పుట్టినరోజు వచ్చేసింది పొద్దుట నుంచీ సుజాత హడావిడికి అంతులేదు. సిరికి ఇష్టమని ముందురోజే గులాబ్‌జామూన్లు చేసేసింది. మొదటిసారి పట్టులంగా వోణీలో సిరి మెరిసిపోతోంది.
ఎప్పట్లాగే లంచ్‌కి రెస్టారెంట్‌కి వెళదామని రాఘవ అంటే ‘‘అదేమీ వద్దండీ. ఇంట్లోనే నేను చికెన్‌ కర్రీ, సాంబార్‌ అవీ చేస్తానుగానీ మీరెళ్లి బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్‌, ఐస్‌క్రీమ్‌ ఫ్యామిలీ ప్యాక్‌ తీసుకురండి’’ అని పురమాయించింది.
‘‘ఫ్యామిలీప్యాక్‌ ఎందుకు సుజా, సింగిల్‌ బిర్యానీ చాల్లే. ఐస్‌క్రీమ్‌ కూడా ఫ్యామిలీ ప్యాక్‌ అంటే చాలా ఎక్కువయిపోతుంది. సిరికి అసలే పడదు. ఎక్కువ తిన్నదంటే మళ్లీ జ్వరం పట్టుకుంటుంది’’ అని చెప్పాడు రాఘవ.
‘‘అబ్బా చెప్పింది చెయ్యండి’’ అని విసుక్కుంటుంటే సిరి కూడా ‘‘నిజమేనమ్మా ఈ ఇయర్‌ నా ఫ్రెండ్స్‌కూడా ఎవరూ రామన్నారు, అసలే సెకండియర్‌ కదా చదువుకోవాలని. మనముగ్గురమే సింపుల్‌గా కేక్‌ కట్‌ చేసుకోవాలి’’ అంటుంటే సిరి గొంతులో నిరుత్సాహం దాగలేదు.

సుజాత అదేమీ పట్టించుకోకుండా ‘వెళ్లరేమండీ’ అంటూ తొందర పెట్టింది.
పన్నెండుగంటలకల్లా టేబులుమీద అన్నీ రెడీ చేసి హమ్మయ్య అనుకుంది.
ఇంతలో గేటు చప్పుడయ్యేసరికి అటు చూసిన రాఘవ మెల్లగా నడిచొస్తున్న తమ్ముడినీ మరదల్నీ పిల్లల్నీ చూసి నివ్వెరపోయాడు.
‘అయిపోయింది... ఇంక ఈ రోజు సుజాతని నేను సమాధానపరచలేను’ అనుకుంటూ ఆవేశంగా వరండాలోకి వెళ్లి ‘‘ఏంటిరా ఇలా వచ్చారు... నీకెలా చెప్తే అర్థమవుతుంది...’’ అంటూ ఇంకా ఏదో అనబోతున్నాడు. ఈలోగా సుజాత హడావిడిగా వరండాలోకి వచ్చి ‘‘రా కుమార్‌, సరితా వచ్చావామ్మా, రండమ్మా రమ్యా... విష్‌ యు మెనీ మోర్‌ హ్యాపీ రిటన్స్‌ ఆఫ్‌ ది డే శ్రీ’’ అంటూ హడావిడిగా రిసీవ్‌ చేసుకుంది.

మొదటిసారి తనని దగ్గరికి తీసుకుని విషెస్‌ చెపుతున్న పెద్దమ్మని చూస్తూ థ్యాంక్స్‌ చెప్పడమే మరిచిపోయాడు శ్రీకర్‌. దివ్య, రమ్య అయితే ఎంత భయపడుతూ వచ్చారో పెద్దమ్మ ఎలా ఉంటుందో అని. సరిత సుజాతను చూసి చిన్నగా నవ్వుతూ లోపలికి నడిచింది.
అందరూ లోపలికెళ్లాక కుమార్‌ అన్నయ్య దగ్గరికొచ్చి ‘‘కంగారుపడకన్నయ్యా, వదిన పిలిస్తేనే వచ్చాము’’ అని నెమ్మదిగా చెప్పాడు. రాఘవ ఆశ్చర్యంలో ఉండగానే లోపలినుంచి సుజాత గట్టిగా ‘‘మీ అన్నదమ్ముల కబుర్లు తరువాత లోనికిరండి’’ అంటూ అరిచింది. రాఘవ ఆప్యాయంగా తమ్ముడి భుజంమీద చెయ్యివేసి లోనికి తీసుకెళ్లాడు.
ఈ సందడికి లోపలినుంచి వచ్చిన సిరి ఒక్కసారిగా తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అక్కా అంటూ దివ్యను వాటేసుకుంది. అందరూ సిరికి విషెస్‌ చెప్పారు. మాటలు తరువాత ముందు కేక్‌ కట్‌ చేయిద్దామంటూ సుజాత హడావిడి చేసింది. ఉదయమే డెలివరీ అయిన కేక్‌ ఫ్రిజ్‌లోంచి తీసి టేబుల్‌ మీద అమర్చింది.
అప్పుడు చూశాడు రాఘవ కేక్‌ మీద ‘హ్యాపీ బర్త్‌డే శ్రీకర్‌-సిరి’ అని ఉండడం. అతనికి ఆశ్చర్యం మీద ఆశ్చర్యం కలుగుతోంది. ఇటు సిరీ, మిగిలిన వాళ్ల పరిస్థితీ కూడా అంతే. నిన్న ఫోన్‌ చేసి వదిన లంచ్‌కి రమ్మని పిలవగానే కుమార్‌ ఒకింత ఇబ్బంది పడ్డాడు. శ్రీకర్‌ బర్త్‌డే కూడా కదా అని ఆలోచించి ‘సరేలే సాయంత్రం తిరిగొచ్చి వాడితో కేక్‌ కట్‌ చేయించవచ్చులే’ అనుకున్నాడు.
శ్రీకర్‌ అయితే రావడానికి ఇష్టపడలేదు... నా పుట్టినరోజునాడు అక్కడికెందుకు నాన్నా అంటూ. పెద్ద పిల్లలిద్దరికీ పెద్దమ్మ ప్రేమాభిమానాలు తెలుసుకానీ శ్రీకర్‌కి సుజాతతో ఏమాత్రం చనువూలేదు.
‘‘రారా శ్రీ, నువ్వూ సిరీ ఇద్దరూ కేక్‌ కట్‌ చేయండి’’ అని సుజాత చెప్పగానే అంతా కేక్‌ చుట్టూ చేరారు. ఇద్దరికీ కేక్‌ తినిపిస్తుంటే కుమార్‌కీ సరితకీ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. అది చూసి రాఘవకి కూడా కళ్లు తడయ్యాయి.
అంతా భోజనాలకి కూర్చున్నారు. సుజాత గలగలా మాట్లాడుతూ భోజనాలు వడ్డిస్తోంది. సరిత అక్కకి సహాయం చేస్తోంది.
తండ్రి పక్కనే కూర్చున్న శ్రీకర్‌ ఎప్పట్నుంచో అడగాలనుకున్న విషయాన్ని మెల్లగా అడిగాడు... ‘‘నాన్నా, మరి నేనూ సిరీ ఒకేరోజు పుట్టామా? అంటే ఒకే హాస్పిటల్‌లోనే పుట్టామా?’’
సుజాత ఒక్కక్షణం కుమార్‌ ఏం చెపుతాడో అని కుతూహలంగా చూసింది.
‘‘లేదు నాన్నా, మనమప్పుడు పల్లెలోనే ఉన్నాం కదా, నువ్వక్కడే పుట్టావు. సిరి ఇక్కడ పుట్టింది.’’
‘‘మరి మా పేర్లెవరు పెట్టారు?’’
‘‘మీ పెద్దమ్మే నాన్నా, ఇద్దరికీ ఒకే అక్షరంతో పెట్టాలని పెట్టింది’’
వాళ్లు శ్రీకర్‌కి ఆ పేరు పెట్టినప్పుడు తనెంత చికాకు పడిందో గుర్తొచ్చి అపరాధభావంతో తల వాల్చుకుంది సుజాత.
సిరి మొహంలో ఆనందం చూస్తుంటే తను ఇన్నిరోజులూ ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో అర్థమయింది సుజాతకి.
రోజంతా ముచ్చట్లతో ఎలా గడిచిందో తెలియకుండానే గడిచిపోయింది. రాత్రి భోజనాలు కూడా చేసి కుమార్‌వాళ్లు బయలుదేరారు.
వాళ్లు వెళ్లిపోతుంటే సిరి ముఖంలో దిగులు చూసి దగ్గరకు తీసుకుంటూ ‘‘దిగులు పడకు తల్లీ, ఇంకో రెండునెలలు ఓపిక పట్టు. మన మేడమీద పోర్షన్‌ ఖాళీ అవుతుంది. మీ చిన్నాన్నా వాళ్లను ఇక్కడికే వచ్చేయమన్నాను, సరే అన్నారు వాళ్లు’’ అని చిరునవ్వుతో చెప్పింది. సిరి ఆనందానికి ఇక పట్టపగ్గాలు లేవు.
రాత్రి పడుకున్నప్పుడు రాఘవ ‘‘సుజా నువ్వు నువ్వేనా’’ అని అడిగేసరికి, ‘‘ఇన్ని రోజులూ నేను ఎంత మూర్ఖత్వంలో ఉన్నానో తెలిసిందండీ. కన్న కూతురిని దత్తత ఇచ్చిన సరితా కుమార్‌ల త్యాగం ముందు నా ప్రేమ ఎంత స్వార్థపూరితమైనదో అర్థమయింది. అయినా అన్నదమ్ముల పిల్లలు కలిసి ఉండాలను కోవడం నేరమేమీ కాదు కదండీ’’ అని సంతృప్తితో కూడిన చిరునవ్వు నవ్వింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు