close

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తొలి ప్రేమ

అందమూ, బలమైన వ్యక్తిత్వమూ కల అమ్మాయి భావన. జీవిత భాగస్వామి విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి ఆమెకు. వాటిని అనుసరించే సుధాకర్‌ని ఎంచుకుంది. ఆమెది మధ్య తరగతి. అతడిది సంపన్న కుటుంబం. అయినా మొదటి చూపులోనే భావనను ఇష్టపడ్డ సుధాకర్‌ ఆమె మనసు గెలుచుకోవడానికి తన దారి మార్చుకున్నాడు. చెల్లెలి పెళ్లి కాగానే తానూ భావనని పెళ్లి చేసుకోవచ్చని కలలు కంటున్న సుధాకర్‌కి మేనమామ ఓ ప్రతిపాదన తెచ్చాడు. అది వారి జీవితాల్లో రేపిన కల్లోలం ఈ ప్రేమ కథని ఏ మలుపు తిప్పిందో, నిజమైన ప్రేమ జీవితకాలం ఎలా నిలుస్తుందో చెబుతుంది ఈ నవల. నేటి సమాజంలోని సమస్యల గురించి తాను చెప్పాలనుకున్న మాటల్ని నాయికా నాయకుల చేత చర్చింపజేశారు రచయిత. నవల ఆసక్తిగా చదివిస్తుంది.

- పద్మ
ప్రాణం ఉన్నంత వరకు (నవల)
రచన: షేక్‌ అహమద్‌ బాష
పేజీలు: 192: వెల: రూ. 160/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు


మనందరి తరపున...

వులది ఎప్పుడూ విశ్వగొంతుకే! ప్రపంచ ప్రజల అంతఃచేతనని అక్షరాలుగా మలుస్తాడు కవి. కరోనా కాలంలో అలా భయం జీర అంటుకున్న మన ఆలోచనలకి ప్రతినిధిగా నిలుస్తూ చెప్పిన కవితలివి. ‘మనిషికేమి తెలియదని/ఓ క్రిమి వచ్చి చెప్పేదాక తెలియలేదు/ఇది అఖండ నాగరికతకు/ఒక గర్వభంగం’(మథనం) అనే కవి ఇంకాస్త ముందుకెళ్లి ‘ఇంతటి చరిత్రా నాగరికతా/యుగయుగాల/తపఃఫలితాల కథా/ఇంతటి ఆత్మసాక్షాత్కారం/కేవలం ఒక శరీరంగా కుంచించుకుపోయింది’(అస్థిమితం) అని వాపోతాడు. కేవలం బాధని పంచుకోవడమే కాదు ‘మనిషికి యుద్ధం కొత్తకాదు/పోరాటం/ఇప్పుడే పొడిచిన పొద్దుకాదు/చావు బతుకుల సంధ్యాకాలంలో ఉన్నాం/వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అంటూ కర్తవ్యబోధా చేస్తాడు. ఈ సంక్షోభంలోనూ ఎందుకు రాయాలి అనే ప్రశ్న వచ్చిందేమో ‘భయంలోనైనా సరే/నేను కవిత్వమే రాస్తాను/అదే నా ధైర్యం’ అంటాడు!

- అంకిత
ప్రపంచీకరోనా(కవితలు)
రచన: డా.ఎన్‌.గోపి
పేజీలు: 69: వెల: రూ. 100/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


మంచిని పంచే కథలు

రుగులో ఒలింపిక్‌ పతకాలు సాధించిన సుందరం అవార్డు రాజకీయాలను మాత్రం గెలవలేకపోయాడు. అతడికి ఏ పతకాలూ ఇవ్వని సంతృప్తిని ఓ పని ఇచ్చింది. అదేమిటో చెప్పే కథ ‘సాహసక్రీడ’. కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తూ తన కుటుంబంలాగే అమ్మాయి కుటుంబంలోనూ అన్నీ ప్లస్సులే ఉండాలని ఆశపడిన ఆంజనేయులు చివరికి తానే మైనస్‌గా మారడం- ‘ప్లస్సూమైనస్సూ’. మదనపల్లి నుంచీ వెళ్లి పాకిస్తాన్‌ సరిహద్దులో కాపలా కాస్తూ గాయపడిన సైనికుడు అతడు. తన పని అయిపోయిందనుకుంటున్న అతడిని శత్రుదేశ సైనికుడు గుర్తుపట్టి చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టడానికి ‘వారధి’గా మారింది- హద్దులు లేని అంతర్జాలంలో వారిద్దరి పిల్లల స్నేహబంధం. ఈ పుస్తకంలోని 20 కథలూ కనుమరుగైపోతోందను కుంటున్న మనిషిలోని మంచితనాన్ని గుర్తు చేస్తాయి. రేపటి మీద ఆశ కలిగిస్తాయి.

-శ్రీ
వారధి(కథా సంపుటి)
రచన: రాచపూటి రమేష్‌
పేజీలు: 148: వెల: రూ. 120/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు


సింగపూర్‌ సిత్రాలు

కొన్ని కథలూ, కొన్ని కబుర్లతో సరదాగా సాగే పుస్తకమిది. పద్దెనిమిది కథల్లో ఆరు సింగపూర్‌ జీవనవిధానాన్ని ప్రతిబింబిస్తాయి. ఉపాధికోసం విదేశాలకు వెళ్లినా స్వదేశ సంస్కృతిని మర్చిపోకుండా ముందుతరాలకు అందించాలనుకునే తరానికీ, సంస్కృతి పేరుతో చుట్టూ ఉన్నవారికి భిన్నంగా కనిపించడం ఇష్టంలేక విదేశీయులను అనుకరించే తరానికీ మధ్య రాజీ కుదిర్చే కథ ‘అలా... సింగపురంలో’. చిన్ననాటి స్నేహితులు తమ పిల్లలిద్దరికీ పెళ్లిచేసి చుట్టరికం కలుపుకోవాలనుకుంటారు. పాతిక లక్షల ఖర్చుతో పెళ్లీ చేసినా ఎవరింటి పెళ్లికో వెళ్లి వచ్చినట్టుంది కానీ మనింటి పెళ్లి మనం చేశామన్న తృప్తి ఏ కోశానా లేదని బాధపడతారు ‘ప్యాకేజీ పెళ్లి’ తల్లిదండ్రులు. సింగపూర్‌లో పనిమనుషుల సిన్సియారిటీని సరదాగా చెబుతూనే వారి జీవితాల్లోని మరో కోణాన్నీ సున్నితంగా స్పృశిస్తారు ‘పనిమనిషోపాఖ్యానం’కథల్లో.

- పూర్ణ
అలా సింగపురంలో...(కథా సంకలనం)
రచన: రాధిక మంగిపూడి
పేజీలు: 132: వెల: రూ. 100/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు