close

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పండగనాడు... పొంగలి రుచులు!

నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించే పదార్థాల్లో... పాయసం, పులిహోర లాంటివి మామూలే. ఈసారి వాటితోపాటూ ఈ వంటకాలనూ వండి ఆ జగన్మాతకు సమర్పిద్దామా...


కొబ్బరిపాల పొంగలి

కావలసినవి:బియ్యం: అరకప్పు, బెల్లం: కప్పు, కొబ్బరి పాలు: ఒకటింబావు కప్పు, పాలు: పావుకప్పు, యాలకులపొడి: చెంచా, నెయ్యి: పావుకప్పు, జీడిపప్పు- కిస్‌మిస్‌ పలుకులు: పావుకప్పు.

తయారీవిధానం: బియ్యాన్ని కడిగి కుక్కర్‌లో వేసి కప్పు నీళ్లు పోసి రెండు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఆ అన్నాన్ని మళ్లీ స్టౌమీద పెట్టి కొబ్బరిపాలు పోయాలి. పాలు సగం అయ్యాక బెల్లం తరుగు వేసి, స్టౌని సిమ్‌లో పెట్టాలి. పాలు ఆవిరైపోయాక మామూలు పాలు, యాలకులపొడి వేసి కలపాలి. పొంగలి పూర్తిగా దగ్గరకు అయ్యాక నేతిలో వేయించిన జీడిపప్పు-కిస్‌మిస్‌ పలుకుల్ని వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. 


కదంబం

కావలసినవి:బియ్యం: కప్పు, కందిపప్పు: అరకప్పు, పెసరపప్పు: టేబుల్‌స్పూను, సెనగపప్పు: టేబుల్‌స్పూను, బెండకాయ, మునగకాయ, గుమ్మడి, వంకాయ, దోసకాయ, చిలగడదుంప, సొరకాయ, బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు: అన్నీ కలిపి రెండుకప్పులు, చింతపండు రసం: టేబుల్‌స్పూను, సాంబారు పొడి: టేబుల్‌స్పూను, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, నెయ్యి: టేబుల్‌స్పూను, ఆవాలు: అరచెంచా, జీలకర్ర: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఎండుమిర్చి: రెండు, ఇంగువ: చిటికెడు.

తయారీవిధానం: బియ్యం, పప్పులు కడిగి, సరిపడా నీళ్లు పోసి కుక్కర్‌లో మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. కూరగాయ ముక్కల్ని కూడా ఉడికించుకుని స్టౌని సిమ్‌లో పెట్టి చింతపండు రసం, తగినంత ఉప్పు, సాంబారుపొడి, కరివేపాకు వేసుకోవాలి. అయిదు నిమిషాలయ్యాక అన్నం వేసి కలపాలి. మరో స్టౌమీద బాణలి పెట్టి, నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించి అన్నంపైన వేసి ఓసారి కలిపితే చాలు. 


కట్టుపొగలి

కావలసినవి: పెసరపప్పు: అరకప్పు, బియ్యం: అరకప్పు, పచ్చిమిర్చి ముక్కలు: చెంచా, అల్లం తరుగు: చెంచా, ఎండుకొబ్బరి తురుము: అరకప్పు, నూనె: రెండు చెంచాలు, నీళ్లు: మూడుకప్పులు, ఉప్పు: తగినంత, జీలకర్ర: ఒకటిన్నర చెంచా, మిరియాలు: ముప్పావుచెంచా. తాలింపుకోసం: నెయ్యి: మూడు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: అరచెంచా, మిరియాలు: అరచెంచా, జీలకర్ర: అరచెంచా, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, కరివేపాకు రెబ్బలు: రెండు, ఇంగువ: చిటికెడు.

తయారీవిధానం: ముందుగా మిరియాలు, జీలకర్రను నూనె లేకుండా వేయించుకుని తరువాత పొడిచేసి పెట్టుకోవాలి. పెసరపప్పును పది నిమిషాలు నానబెట్టుకోవాలి. స్టౌమీద కుక్కర్‌ పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పెసరపప్పు, బియ్యం వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు వేయించి, నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి కుక్కర్‌ మూత పెట్టాలి. ఒక కూత వచ్చాక పొయ్యి కట్టేయాలి. అదే కుక్కర్‌ని మళ్లీ స్టౌమీద పెట్టి కప్పు నీళ్లు పోయాలి. ఇది ఉడుకుతున్నప్పుడు కొబ్బరితురుము, ముందుగా చేసుకున్న మిరియాలపొడి వేసి కలపాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేసి ఆవాలు, మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ వేయించి పొంగలిలో వేసి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.


మిరియాల అన్నం

కావలసినవి: అన్నం: కప్పు, నెయ్యి: రెండు చెంచాలు, మిరియాలు: చెంచా, జీలకర్ర: ఒకటిన్నర చెంచా, ఎండుమిర్చి: అయిదు, నూనె: చెంచా, ఆవాలు: పావుచెంచా, మినప్పప్పు: చెంచా, సెనగపప్పు: చెంచా, పల్లీలు: పావుకప్పు, పచ్చిమిర్చి: ఒకటి, కరివేపాకు: ఒక రెబ్బ, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, జీడిపప్పు పలుకులు: పావుకప్పు.

తయారీవిధానం: స్టౌమీద కడాయి పెట్టి చెంచా నెయ్యి వేసి..  మిరియాలు, చెంచా జీలకర్ర, మూడు ఎండుమిర్చి వేయించుకుని తీసుకోవాలి. వేడి పూర్తిగా చల్లారాక మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. స్టౌమీద మళ్లీ కడాయిపెట్టి మిగిలిన నెయ్యి, నూనె వేయాలి. ఈ రెండూ వేడెక్కాక ఆవాలు, మిగిలిన జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, సెనగపప్పు, ఇంగువ, జీడిపప్పు పలుకులు, పల్లీలు వేయాలి. అవి కాస్త వేగుతున్నప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు కూడా వేయాలి. అన్నీ వేగాక ముందుగా చేసుకున్న మిరియాలపొడి, తగినంత ఉప్పు వేసి ఓసారి కలిపి ఆ తరువాత అన్నం వేసి కలిపి... అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు