close

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అరిటాకుల్నీ అల్లేస్తున్నారు!

పెళ్లీ పేరంటాల్లో పండుగ వేళల్లో కొబ్బరాకులతో పందిరి వేయడం, అరిటాకుల్లో భోజనం పెట్టడం మన సంప్రదాయం. అయితే గట్టిగా పట్టుకుంటేనే చిరిగిపోయే సున్నితమైన అరటి ఆకుతో ఇప్పుడు వేదికల్నీ అలంకరిస్తున్నారు, ఏ వెదురుతోనో వైరుతోనో అల్లినట్లుగా పూలూ పండ్లూ మిఠాయిలూ పెట్టుకునే అందమైన బుట్టల్నీ సజ్జల్నీ అల్లేస్తున్నారు.

అరటి ఆకులో భోజనం చేయడం పవిత్రమైనదిగానూ శ్రేష్ఠమైనదిగానూ భావిస్తారు. అందుకే ఒకప్పుడు పెళ్లి వేడుకలూ పండుగ సమయాల్లో అరటి ఆకుల్లో భోజనాలు పెట్టేవారు. వండి వడ్డించే ఓపికా తీరికా లేకపోవడంతో క్యాటరింగులూ బఫేలూ వాడుకలోకి వచ్చాయి. అలాగే పెళ్లీ, పూజా మండపాల్ని అరటి మొక్కలతో అలంకరించేవారు. కృత్రిమ పూలూ సెట్టింగులూ రావడంతో అవన్నీ క్రమంగా కనుమరుగయ్యాయి. పాతే... కొత్త ఫ్యాషన్‌గా భావించో లేదూ ఎకో ఫ్రెండ్లీ అన్న ఆలోచనతోనో ఇప్పుడు మళ్లీ అంతా గతంలోకి తొంగి చూస్తున్నారు. అయితే అప్పట్లోలా ఓ చెట్టు తెచ్చి అక్కడ పెట్టేయకుండా ఆకుల్ని అందంగా పేరుస్తూ వేదికల్ని అలంకరిస్తున్నారు. అంతేనా... ఆ ఆకులతో అల్లిన బుట్టలూ సజ్జల్లో పూలూ పండ్లూ అమరుస్తున్నారు. ట్రేల్లా అల్లిన వాటిల్లో దేవతా ప్రతిమల్నీ ప్రతిష్ఠిస్తున్నారు.

అదే థాయ్‌ వాళ్లకయితే అరటి ఆకు లేందే అసలు వేడుకే మొదలవ్వదట. విందు కోసమో వేదికను అలంకరించేందుకో మాత్రమే కాదు, ఏ శుభకార్యమైనా అరటి ఆకుల అల్లికతోనే మొదలవుతుంది. అసలవి అరటి ఆకుతోనే చేశారా అన్న అనుమానం వచ్చేలా వాటిని కత్తిరిస్తూ చేత్తోనే మడతపెడుతూ పూల రేకులతో కలిపి అల్లుతూ అద్భుతమైన కళారూపాల్ని సృష్టిస్తుంటారు. మనదగ్గర కార్తిక పౌర్ణమికి నదుల్లో చెరువుల్లో అరటి డొప్పల్లో దీపాలు వదిలినట్లే, లోయ్‌ క్రాథంగ్‌ వేడుకలో ఈ అరటి ఆకుల బుట్టల్లో పూలనీ వత్తుల్నీ అమర్చి నదుల్లో వదిలి నమస్కరిస్తారు థాయ్‌ వాసులు. అలా తేలియాడుతూ వెళ్లే అరటి ఆకుల దోనె అదృష్టాన్ని తెస్తుందనీ భావిస్తారు.

నిజానికి అరటి ఆకులతో అందమైన కళారూపాల్ని చేయడం థాయ్‌ సంస్కృతిలో భాగమని చెప్పవచ్చు. అందుకే ఆ కళను తరతరాలుగా అందిపుచ్చుకుంటూనే ఉంటారక్కడ. అక్కడి నుంచి బౌద్ధగురువుల ద్వారా ఇది మనదేశంలోకీ ప్రవేశించింది. అవి చూసి ముచ్చటపడి ఆసక్తితో అక్కడికి వెళ్లి నేర్చుకొచ్చినవాళ్లూ ఉన్నారు. వాళ్లలో కొందరు వర్కుషాపులు పెట్టీ కళను నేర్పిస్తున్నారు. చూశారుగా మరి... అరిటాకులతో ఎంత అందంగా అల్లేస్తున్నారో..!


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు