close

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉద్యోగులకు 4,116 కార్లు!

పండగలకో, ప్రత్యేక సందర్భాలకో కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు రకరకాల బహుమతులు ఇస్తుంటాయి. చైనాకు చెందిన ఓ ఉక్కు పరిశ్రమ ఏకంగా ఖరీదైన కార్లు బహూకరించి తమ ఉద్యోగుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. అలాగని ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు... ఆ సంస్థలో పనిచేసే 4,116 మందికీ అందించి అంతర్జాతీయ వార్తల్లో నిలిచింది. జయాంగ్జీ వెస్ట్‌ దజియా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ సంస్థ ఐదేళ్లుగా భారీ లాభాలు గడిస్తోంది. ఆ విజయంలో ఉద్యోగుల శ్రమే కీలకం అని భావించి అందరినీ పేరు పేరునా అభినందించా లనుకుంది. అందుకే ఖరీదైన వోక్స్‌వ్యాగన్‌, ఫోర్డ్‌ కార్లని కొనుగోలు చేసి ఉద్యోగుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించడంతోపాటు ఐదేళ్లపాటు వాహనబీమా, రోడ్డు ట్యాక్సులు కూడా చెల్లించింది. అందుకోసం రూ.540 కోట్లు వెచ్చించిన ఆ సంస్థ ఈ మధ్య ఉద్యోగులందరికీ సెలవు ఇచ్చి... గెట్‌టుగెదర్‌ ఏర్పాటు చేసి కారు తాళాలను చేతిలో పెట్టి సర్‌ప్రైజ్‌ చేసింది.


జెట్‌ సూటే ఎయిర్‌ అంబులెన్స్‌

బ్రిటన్‌లోని లేక్‌ జిల్లా పర్వత సానువులతో భూమికి పచ్చాని రంగేసినట్టు ఉంటుంది. అయితే అందమైన ఆ కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యులు అందుబాటులో ఉండరు. ప్రజలకు బాగోలేదని తెలిసినప్పుడే అక్కడకు వైద్యులు వెళుతుంటారు. పైగా మెడికల్‌ కిట్లతో రోడ్డు సదుపాయం కూడా సరిగాలేని ఆ కొండ ప్రాంతానికి నడుచుకుంటూ చేరుకునేసరికి అరగంట నుంచి గంట సమయం పడుతుంది. రోగులకు అత్యవసర చికిత్స కూడా కొన్నిసార్లు అందక ప్రాణాల మీదకొస్తుంటుంది. దాంతో ఆ పరిస్థితుల్ని గమనించిన గ్రేట్‌ నార్త్‌ ఎయిర్‌ అంబులెన్స్‌ సర్వీస్‌, గ్రావిటీ ఇండస్ట్రీస్‌ అనే సంస్థలు జెట్‌ సూట్‌ అంబులెన్స్‌ ఆలోచన చేశాయి. కాస్త తక్కువ బరువుతో, చేతులతో గ్రావిటీని నియంత్రించుకునేలా టెక్నాలజీలో మార్పులు చేసి వైద్యులకు అందజేశాయి. వీటితో ఇప్పుడు వైద్యులు కొండప్రాంతాలకు కేవలం తొంభై సెకన్ల నుంచి రెండు నిమిషాల్లోపు మెడికల్‌ కిట్లతో అతి సులువుగా చేరు కుంటున్నారు. వేగంగా అత్యవసర చికిత్సలూ అందిస్తున్నారు.


80ల్లో పెళ్లి ఫొటో షూట్‌

ఈ రోజుల్లో పెళ్లి అనగానే కొత్త జంటలు ఫొటో షూట్‌లతో తలమునకలైపోతున్నారు. అలాంటిది కేరళకు చెందిన 85 ఏళ్ల కుంజిట్టి, 80 ఏళ్ల చినమ్మ అనే ఓ వృద్ధ జంట ఈ మధ్య వెడ్డింగ్‌ ఫొటోషూట్‌తో నెట్టింట్లో వైరల్‌ అయ్యారు. అదేంటీ ఈ వయసులో వాళ్లు పెళ్లి చేసుకున్నారా అనుకునేరు... అరవై ఏళ్ల క్రితమే వాళ్ల పెళ్లైంది. అయితే ఈ జంట వద్ద పెళ్లినాటివిగానీ, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలుగానీ లేవట. ఏదో సందర్భంలో వాళ్ల మనవడు ఫొటోలు అడగడంతో ఆలోచనలో పడిన కుంజిట్టి... భార్యతో కలిసి ఫొటోలు తీయించుకోవాలనుకున్నాడు. అంతే, ఈ వృద్ధ దంపతులిద్దరూ తమ పెళ్లినాటి దుస్తులు ధరించి వధూవరుల్లా ముస్తాబై ఫొటోలు తీయించుకున్నారు. వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ బామ్మా తాతలు వైరల్‌ అయి అందరి చేతా వహ్వా అనిపించుకుంటున్నారు.


కార్లలో కూర్చుని చూసేలా పెళ్లి...

లండన్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులు రోమా పాపట్‌, వినాల్‌ పటేల్‌లు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నారు. కానీ కరోనా వల్ల పెళ్లికి 15 మందిని మాత్రమే పిలవాలనేది అక్కడి ప్రభుత్వ నిబంధన. అయితే ఎలాగైనా తాము అనుకున్నట్టుగానే పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ జంట ఈ మధ్య ఏం చేసిందంటేే... 500 ఎకరాల గ్రౌండ్‌ను బుక్‌ చేసుకుని ఓ కల్యాణ మండపం, సామాజిక దూరం పాటిస్తూ కార్ల పార్కింగ్‌, టాయిలెట్లకు ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌లోనే 300 మంది సమీప బంధువులూ, స్నేహితుల్నీ ఆహ్వానించి వారంతా కార్లలోనే ఉండి పెళ్లిని వీక్షించడానికి పెద్ద పెద్ద ఎల్‌ఈడీ తెరల్ని అమర్చారు. అందరికీ శానిటైజర్లూ, టిష్యూలూ, వెల్కమ్‌ డ్రింకులూ, స్నాక్సూ అందజేసి ఎవరూ కారు దిగకుండా జాగ్రత్త పడ్డారు. అలానే ప్రధాన విందులో భాగంగా నచ్చిన పదార్థాల్ని ఆన్‌లైన్‌లో ఉచితంగా తెప్పించుకునే వెసులుబాటు కల్పించారు. చివరిగా కార్లలో ఉన్న అతిథుల వద్దకే ఈ దంపతులు నేరుగా వెళ్లి వారి ఆశీర్వాదాలుతీసుకోవడంతో పెళ్లితంతు పూర్తైంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు