close

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా వేళ కొత్త గ్యాడ్జెట్లు..!

కరోనా పుణ్యమా అని ఇప్పుడు అత్యవసరంగా వాడే వస్తువుల్లో శానిటైజర్లూ క్రిమి సంహారకాలూ ఎయిర్‌ ప్యూరిఫయర్లూ చేరిపోయాయి. అయితే, వీటిలోనూ కొన్ని ఉత్పత్తులు రొటీన్‌కి భిన్నంగా కొత్తగా వస్తున్నాయి. అవేంటో చూద్దామా..?


ఎయిర్‌ ప్యూరిఫయర్‌ లాకెట్‌

పీల్చే గాలిని కూడా నేరుగా ముక్కుకి చేరనివ్వకుండా మాస్కులు పెట్టుకుంటున్నాం. ఎటు నుంచి వైరస్‌ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయో అని భయం మరి. ఈ కారణంతోనే ఇపుడు ఎయిర్‌ప్యూరిఫయర్లు మెడలో వేసుకునే అంత చిన్నగా వస్తున్నాయి. కానీ అసలే ఈతరానికి ఫ్యాషన్‌ పిచ్చి కాస్త ఎక్కువ. అందంగా లేకపోతే మెడలో ఎలా వేసుకుంటాం అని ఫీలైపోతారు కదా... అందుకే, ఎయిర్‌ప్యూరిఫయర్లను చూడచక్కని లాకెట్‌లా కనిపించేలా రూపొందించేస్తున్నారు. బంగరు రంగులో మెరిసిపోయే ఈ ‘బీఎస్‌టీ ఎయిర్‌ ప్యూరిఫయర్‌ నెక్లెస్‌’ను చూస్తే ఎవరూ అది గ్యాడ్జెట్‌ అనుకోరు మరి. ఇది ముప్పై లక్షల నెగెటివ్‌ అయాన్లను విడుదల చేస్తూ మన చుట్టూ ఉండే గాల్లోని కాలుష్య, హానికర రేణువులూ అలర్జీ కారకాలను దూరంగా నెట్టేస్తుందట. ఎన్నో కంపెనీలు ఇలా ఆకర్షణీయంగా ఉన్న ఎయిర్‌ ప్యూరిఫయర్‌ లాకెట్లను తయారుచేస్తున్నాయి. పిల్లలకోసం రకరకాల బొమ్మల్లా ఉన్నవీ వస్తున్నాయి. అన్నీ రీఛార్జబుల్‌ బ్యాటరీలతో పనిచేసేవే. ఇక, ఐడీ కార్డులా ఉండే పోర్టబుల్‌ ఎయిర్‌ శానిటైజర్‌ కార్డ్‌ కూడా ఎయిర్‌ ప్యూరిఫయరే. ఇది మన చుట్టూ ఉన్న గాలిని 99శాతం శుభ్రం చేస్తుందట. ప్యాకెట్‌ని ఓపెన్‌ చేశాక ముప్ఫై రోజుల పాటు పనిచేస్తుంది.


వాచ్‌లో శానిటైజర్‌!

చేతులు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలన్నది ఇప్పుడు అందరూ మంత్రంలా జపిస్తున్న మాట. ఇక, జనం మధ్య ఉన్నపుడైతే దేన్ని ముట్టుకున్నా భయమే. అలాంటపుడు బ్యాగులో శానిటైజర్‌ బాటిల్‌ ఉన్నా బ్యాగుని ముట్టుకుని, లోపల చేతులు పెట్టి, అందులో ఉన్న శానిటైజర్‌ తీసేసరికి మన చేతికి ఏమైనా ఉంటే వాటన్నిటికీ అంటేసుకుంటుంది. అలాకాకుండా మన చేతికే చిన్న శానిటైజర్‌ బాటిల్‌ ఉంటే... ఈ ఆలోచనతో మార్కెట్లోకి వస్తున్నవే సిలికాన్‌ జెల్‌ హోల్డర్‌ రిస్ట్‌బ్యాండ్‌ లేదా బ్రేస్‌లెట్లు. వీటిలో శానిటైజర్‌ జెల్‌ లేదా లిక్విడ్‌ సోప్‌ని నింపుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.


ఇది కరోనా ఓవెన్‌..!

పాల ప్యాకెట్‌ దగ్గర్నుంచి పండ్లూ కూరగాయలూ బ్రెడ్డూ సరుకులూ... ఇలా బయట నుంచి ఏది ఇంట్లోకి తీసుకురావాలన్నా వాటిమీద కరోనా వైరస్‌ ఉందేమో అని భయపడుతున్న కాలమిది. ప్రతిదాన్నీ కడుక్కోవడమో ఓరోజు బయట ఉంచడమో శానిటైజర్లు పుయ్యడమో... ఈ పనులతో విసిగిపోతున్నారు జనం. ఇక, బయటికెళ్లొచ్చిన ప్రతిసారీ మాస్కుని ఉతుక్కోవడం ఇంకో పెద్ద పని. ఈ బాధను పోగొట్టేందుకు వచ్చిందే ఈ ‘కరోనా ఓవెన్‌’. చిన్నా పెద్దా సైజుల్లో ఉండే ఈ ఓవెన్‌లో మనం సరుకులూ పండ్లూ కూరగాయల్లాంటి వేటినైనా ఉంచి బటన్‌ నొక్కితే చాలు, నిమిషాల్లో వాటి మీదున్న వైరస్‌ చనిపోతుందట. ఈ మెషీన్‌ వైరస్‌ చనిపోయేలా ఒక స్థాయిలో యూవీ కాంతిని ప్రసరింపజేస్తుందట. కానీ ఆ కాంతి వల్ల ఆహార పదార్థాలకు ఏమీ కాదు.


గ్యాడ్జెట్లను శుభ్రం చేస్తుంది

యట అడుగుపెడితే ఎప్పుడూ మన చేతుల్లో ఉండేది సెల్‌ఫోనే. మరోపక్కేమో చేతుల ద్వారానే కరోనా వైరస్‌ ఎక్కువ వ్యాప్తి చెందుతుందంటున్నారు. కానీ సెల్‌ఫోన్‌ని శానిటైజర్‌లతో తుడిస్తే పాడైపోతుందన్నది నిపుణుల మాట. ఇయర్‌ ఫోన్స్‌, వాచ్‌... లాంటి యాక్సెసరీలను కూడా రోజూ శుభ్రం చేయడం కష్టమే. ఈ ఇబ్బంది లేకుండా చిటికెలో గ్యాడ్జెట్లూ యాక్సెసరీలను శుభ్రం చేసేందుకు మార్కెట్లోకి ‘మల్టీ ఫంక్షనల్‌ యూవీ స్టెరిలైజర్లు’ వస్తున్నాయి. రీఛార్జబుల్‌ బ్యాటరీలతో పనిచేసే ఈ బాక్సులో ఫోన్‌ని పెట్టి బటన్‌ నొక్కితే దాన్లోని అతినీలలోహిత కాంతి ఫోన్‌ చుట్టూ ప్రసరించి 99శాతం క్రిముల్ని చంపుతుందట.


పెన్నుంటే చాలు..!

లిఫ్ట్‌ బటన్లూ ఏటీఎమ్‌ కీ బటన్లూ ఆఫీసుల్లో స్విచ్‌ బోర్డుల్లాంటి వాటిని అందరూ ముట్టుకుంటారు. దాంతో ఆ చోటుల్లో కొవిడ్‌ వైరస్‌లు ఉండే అవకాశం ఎక్కువ. అలా అని మనం వాటిని ముట్టుకున్న ప్రతిసారీ చేతుల్ని శుభ్రం చేసుకోవాలంటే కుదరకపోవచ్చు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారమే ఈ ‘పెంటోనిక్‌ కొవిడ్‌-19 కిల్లర్‌’ పెన్‌. ఈ మార్కర్‌లో ఉండే ఇంక్‌ని ఇథనాల్‌తో తయారు చేస్తారు. పెన్ను పైభాగంలో ఉన్న బటన్‌ని నొక్కగానే ఈ మార్కర్‌ ముక్కు బయటికి వస్తుంది. దీంతో లిఫ్ట్‌ బటన్‌లనూ స్విచ్‌లనూ నొక్కితే మార్కర్‌కి ఉన్న ఇథనాల్‌ కారణంగా ఆ చోటు స్టెరిలైజ్‌ అయిపోతుంది. అంటే మనం చేత్తో ముట్టుకునే పనుండదు, పైగా ఆ చోటుని కూడా శుభ్రం చేసినట్లవుతుందన్నమాట. మళ్లీ పెన్ను బటన్‌ నొక్కితే మార్కర్‌ లోపలికెళ్లిపోతుంది కాబట్టి, లోపలున్న ఇథనాల్‌ వల్ల క్రిములేమైనా మార్కర్‌కి అంటుకున్నా చనిపోతాయి. ఈ పెన్నుల్ని అమ్మాయిలూ అబ్బాయిలు కూడా సులభంగా వెంట తీసుకెళ్లొచ్చు. ఇక, శావ్‌లాన్‌, వింకెల్‌, ఫర్న్‌ అస్పైర్‌... లాంటి కంపెనీలు పెన్ను ఆకారంలోనే శానిటైజర్లను తయారుచేస్తున్నాయి. వీటిలో అటు శానిటైజర్‌లా ఇటు పెన్నులానూ పనికొచ్చేవీ ఉన్నాయి. ఇవి పాకెట్‌లో ఉంటే ఎప్పుడూ చేతులు శుభ్రమేనన్నమాట.


శానిటైజరే పవర్‌బ్యాంక్‌

యటికెళ్లినపుడు అనుకోకుండా ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోతే పనికొచ్చేలా మినీ పవర్‌బ్యాంకుల్ని వెంట తీసుకెళ్తుంటాం. అయితే, ఈమధ్య శానిటైజర్‌ కూడా పాకెట్‌లోనో హ్యాండ్‌ బ్యాగులోనో ఉండడం తప్పనిసరి అయిపోయింది. దాంతో రెండింటినీ విడివిడిగా పట్టుకెళ్లడం ఎందుకు... అంటూ కొన్ని కంపెనీలు ఒకేదాన్లో పవర్‌బ్యాంక్‌, శానిటైజర్‌లు ఉండేలా తయారుచేస్తున్నాయి. అలాంటిదే ఈ ‘పవర్‌బ్యాంక్‌ నానో మిస్ట్‌ స్ప్రేయర్‌ శానిటైజర్‌’. ఈ మినీ స్ప్రేయర్‌లో శానిటైజర్‌ పోసుకుని ఆఫీసుకి వెళ్లేటపుడు తీసుకెళ్లినా రోజంతా వాడుకోవచ్చు. కీ చెయిన్లూ, పర్సులూ, నోట్లు... ఇలా దేనికైనా స్ప్రే చేసుకోవచ్చు. ఇక, ఈ పవర్‌బ్యాంక్‌తో ఫోన్‌కి గంట సమయం పాటు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు.


అటు శుభ్రత... ఇటు సువాసన..!

శానిటైజర్లు రాసుకోకుండా ఉండలేని రోజులివి. కానీ వాటి ఘాటు వాసనను భరించడమే ఇబ్బంది. అలాకాకుండా అవి కూడా పూలూ పండ్ల సువాసనలతో వస్తే ఎన్నిసార్లైనా హాయిగా రాసుకోవచ్చు కదా. ఇలా కోరుకునే వారికోసమే రకరకాల సువాసనలు కలిగిన శానిటైజర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. స్ట్రాబెర్రీ, నారింజ, మామిడీ, జామ... లాంటి పండ్లతో పాటు మల్లె, చామంతి, జాజి, లిల్లీ... ఇలా రకరకాల పూల సుగంధాలతోనూ ఈ శానిటైజర్లు దొరుకుతున్నాయి. అంటే అటు శుభ్రం ఇటు సువాసనా... రెండు ఉపయోగాలన్నమాట.


వైరస్‌ని చంపేసే దుప్పటి

ఎంత వద్దనుకున్నా అప్పుడప్పుడూ అయినా దూర ప్రాంతాలకు వెళ్లినపుడు హోటళ్లలో ఉండాల్సి వస్తుంది. కానీ అక్కడి మంచాల మీద ముందు ఎవరు నిద్రించారో తెలియదు. తర్వాత ఆ దుప్పట్లను మార్చారో లేదో అనే సందేహం ఉండనే ఉంటుంది. అలాంటపుడు ఆ దుప్పట్ల మీద పడుకుని ఏ వైరస్‌లను అంటించుకుంటామో అని భయపడేకన్నా ఈ ‘యాంటీ బ్యాక్టీరియల్‌ స్లీప్‌ కకూన్‌’ని వెంట ఉంచుకుంటే ధైర్యంగా ఉండొచ్చు. ఈ దుప్పటికి వాడిన ‘యాంటీ మైక్రోబియల్‌’ ఫ్యాబ్రిక్‌ బ్యాక్టీరియా వైరస్‌ ఫంగైలను చంపుతుందట. ఇక, సంచిలా కుట్టిన దీన్లో దూరి పడుకుంటే వైరస్‌లూ ఫంగైల వల్ల వచ్చే వ్యాధుల్నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. రైలు ప్రయాణాల్లో స్లీపర్‌ బెర్తుల్లో ప్రయాణించేటపుడు కూడా ఈ దుప్పటి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ తరహా టవళ్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు