close

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గుడ్డే కానీ... కోడి పెట్టలేదు..!

గుడ్డు ఆరోగ్యానికి మంచిది. తినడానికి రుచిగానూ ఉంటుంది. కానీ శాకాహారులు దానిని తినలేరు. ఇది... నిన్న మొన్నటి మాట. అయితే, ఇప్పుడు శాకాహారులు కూడా ఎంచక్కా గుడ్డుని తినేయొచ్చు. ఈమధ్య గుడ్డుసొనను మొక్కల ఉత్పత్తులతో తయారుచేసి అమ్మేస్తున్నారు మరి. రుచికి అచ్చం గుడ్డులానే ఉండే ఈ గుడ్డుకాని గుడ్డు కథేంటో చూసేద్దామా..?

న శరీరానికి కావల్సిన అన్ని విటమిన్లూ ఖనిజ లవణాలూ గుడ్డులో ఉంటాయి. అందుకే, దీన్ని భూమ్మీద అన్నిటికన్నా ఆరోగ్యవంతమైన ఆహారంగా చెబుతారు. ‘రోజుకు ఒక గుడ్డు తింటే ఆరోగ్యం మీ సొంతం’ అంటుంటారు వైద్యులు. ఈ కరోనా కాలంలో అయితే, వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే రోజుకి రెండు గుడ్లు తింటే మరీ మంచిది అని చెప్పడంతో అండాల అమ్మకాలు తెగ పెరిగాయి. ‘ఇక్కడ వరకూ బాగానే ఉంది కానీ అసలు గుడ్లు తినని వారికి ఈ పోషకాలు ఎలా అందుతాయి...’ అన్నది శాకాహారుల ప్రశ్న. ఈ ఆలోచనతోనే మొక్కల ఉత్పత్తులతో గుడ్డును తయారు చెయ్యడానికి ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఫలితం... వెజిటేరియన్‌ గుడ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇవి కృత్రిమంగా తయారుచేసేవి కాబట్టి పైన పెంకు ఏమీ ఉండదు. పెసలూ, సెనగలూ, గుమ్మడి గింజలూ, సబ్జా గింజలూ, మొక్కజొన్న పువ్వులు, పసుపు, ఆవనూనె... ఇలా వేరు వేరు మొక్కల ఉత్పత్తులతో అచ్చం గుడ్డులాంటి రుచీ, అందులోని పోషకాలూ ఉండేలా సొనను తయారు చేసి, ప్యాక్‌ చేసి అమ్ముతున్నారు. ఈ సొనతో ఆమ్లెట్లు వేసినా, వేపుడు చేసినా మామూలు గుడ్డుతో చేసినట్లే ఉంటుందట. బర్గర్లూ, శాండ్‌విచ్‌ల మధ్యలో పెట్టేందుక్కూడా కోడి గుడ్డు సొనను వాడినట్లే దీన్నీ వాడొచ్చు.

ఒక్కో కంపెనీ ఒక్కోలా...
మామూలు కోడిగుడ్డు దానికదే సాటి కానీ దాని పచ్చసొనలో కొవ్వు స్థాయులు చాలా ఎక్కువ. అందుకే, హృద్రోగాలు ఉన్నవారిని గుడ్లు ఎక్కువగా తినొద్దంటారు. ఆరోగ్యవంతులైనా ఎక్కువ తింటే కొలెస్ట్రాల్‌ సమస్య. ఇక, గుడ్డుని సరిగా ఉడికించకపోవడం వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా బారిన పడే అవకాశం ఉంది. అయితే వేగన్‌ గుడ్లలో మామూలు గుడ్లలో ఉండే అన్ని పోషకాలూ ఉంటాయి. కొవ్వు మాత్రం ఉండదు. గుడ్లకోసం కోళ్లను హింసిస్తున్నారు అని బాధపడి వాటిని తినడం మానేసే జంతు ప్రేమికులూ వీటిని హాయిగా తినేయొచ్చు. మరో విషయం ఏంటంటే... వేగన్‌ గుడ్లను కొనేవారిలో 77శాతం మంది శాకాహారులు కాదట. దీనిక్కారణం అటు గుడ్డు రుచీ ఇటు గుడ్డులోని పోషకాలూ ఉండడంతో పాటు ఇవి కొలెస్ట్రాల్‌ ఫ్రీ కావడమే. పైగా ఇవి మామూలు గుడ్లకన్నా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. శాకాహారుల కోసం పాశ్చాత్య దేశాల్లో చాలా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లూ హోటళ్లూ ఇప్పటికే ఈ వేగన్‌ గుడ్డుతో చేసిన బర్గర్లూ స్ప్రింగ్‌ రోల్సూ... వంటి రుచులను తమ మెనూలో చేర్చేశాయి.

గుడ్డు సొన తయారీలో ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన పదార్థాలను ప్రధానంగా ఉపయోగిస్తోంది. ఉదాహరణకు వేగన్‌ ఎగ్‌ మార్కెట్‌లో 40శాతం వాటా ఉన్న ‘జస్ట్‌ ఎగ్‌’ కంపెనీనే తీసుకుంటే దీని గుడ్డుసొనలో పెసలు, ఆవనూనె ప్రధాన పదార్థాలు. రంగుకోసం పసుపుని వాడతారు. ‘ఫాలో యువర్‌ హార్ట్‌’ కంపెనీ సోయాపిండి, ఆల్గే పిండినీ ప్రొటీన్లనూ బ్లాక్‌ సాల్ట్‌నీ ఉపయోగిస్తుంది. ‘స్క్రాంబుల్‌ ఇట్‌’ కంపెనీ గుడ్డు సొనలో ప్రధానమైంది గుమ్మడి గింజలే. శాకాహార గుడ్లని తయారు చేయడానికి మన దేశంలో ముంబైకి చెందిన ‘ఈవో’ కంపెనీ తొలి అడుగు వేసింది. ఇది ఆసియాలోనే మొదటి వేగన్‌ గుడ్ల కంపెనీ అట. ఈవోలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలూ ముందుకొచ్చాయి. త్వరలోనే ఈ కంపెనీ గుడ్లు(అదే... గుడ్డు సొన) మన మార్కెట్లోకి రాబోతున్నాయి. అయితే, ఇప్పటికే ఇతర కంపెనీల వేగన్‌ గుడ్లు ఆన్‌లైన్‌లో మనకీ దొరుకుతున్నాయి. అదండీ సంగతి... గుడ్డు కాని గుడ్డు ఇప్పుడు కొత్త ఆహార ట్రెండు. మరో అయిదేళ్లలో ఈ ట్రెండ్‌ రూ.పదకొండు వేల కోట్ల మార్కెట్‌ను సాధిస్తుందన్నది ‘జియోన్‌ మార్కెట్‌’ అంచనా.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు