close

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రోజాల్లాంటి పెదవుల కోసం!

గులాబీ మొగ్గల్లా చూడచక్కగా కనిపిస్తున్న ఇవి ‘హాండయాన్‌ రోజ్‌ ఫ్లవర్‌ మిర్రర్‌ లిప్‌గ్లాస్‌లు’. చూడ్డానికి రోజాలా ఉండడమే కాదు, ఈ లిప్‌ గ్లాస్‌ని రాసుకుంటే పెదవులు నిజంగా గులాబీ రేకుల్లా కోమలంగా మారతాయట. ఎందుకంటే, ఈ వాటర్‌ప్రూఫ్‌ లిప్‌గ్లాస్‌ మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది ఎక్కువసేపు చెక్కుచెదరకుండా ఉంటుంది కాబట్టి, పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక, రోజాపువ్వులా డిజైన్‌ చేసిన ఈ లిప్‌గ్లాస్‌లు అబ్బాయిలు ప్రియురాలికీ అమ్మాయిలు స్నేహితురాళ్లకూ కానుకగా ఇచ్చేందుకూ బాగుంటాయి. 


బటన్‌ నొక్కితే చాలు..!

బిస్కెట్లూ స్వీట్లూ హాటూ... లాంటి వాటిని గాలి చొరబడని గట్టి మూత ఉన్న డబ్బాల్లో పెడితే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. కాకపోతే ఇబ్బంది ఏంటంటే గట్టిగా పట్టేసి ఉంటాయి కాబట్టి, ఈ డబ్బాల మూతలు ఒక్క చేత్తో తీస్తే రావు. భోజనం చేసేటపుడైనా అందులో ఉన్నవేదైనా తీసుకోవాలంటే రెండో చెయ్యి ఉపయోగించాల్సిందే. ఈ సమస్యలేకుండా వచ్చినవే ఈ టప్పర్‌వేర్‌ కౌంటర్‌పార్ట్‌ డబ్బాలు. వీటి మూతలకున్న బటన్‌ నొక్కితే చాలు, మూత వదులై సులభంగా వచ్చేస్తుంది. ఇవి వేరు వేరు సైజులూ రంగుల్లో దొరుకుతున్నాయి.


అడుగేస్తే డిజైన్‌ మారుతుంది..!

టైల్స్‌ చూస్తే ఒకలా ఉంటాయి. కానీ అడుగేస్తే వాటి రంగులూ డిజైన్లూ మారిపోతాయి. అదే లిక్విడ్‌ ఫ్లోర్‌ టైల్స్‌ చేసే మాయ. పారదర్శకంగానూ రబ్బరులా మెత్తగానూ ఉండే మందపాటి ఈ ప్లాస్టిక్‌ టైల్స్‌ లోపల వేరు వేరు రంగుల ద్రవాలను ప్రత్యేక పద్ధతిలో నింపుతారు. ఈ రంగు ద్రవాలు ఒకదానికొకటి కలిసిపోవు. దాంతో వీటిమీద అడుగు వేసినపుడు ఆ ద్రవాలు అటూ ఇటూ కదిలి మనకు కొత్త డిజైన్‌ ఏర్పడినట్లు అనిపిస్తుంది. ఈ టైల్స్‌ అడుగుభాగాన్ని పక్కకు జరిగిపోకుండా నేలకు అతుక్కునేలా తయారుచేశారు. ఇక, ఇవి చూడ్డానికే కాదు, పిల్లలు ఆడుకోవడానికీ బాగుంటాయి. అందుకే, లిక్విడ్‌ ఫ్లోర్‌ టైల్స్‌ని పిల్లల గదుల్లో ప్రత్యేకంగా వేయించుకుంటున్నారు. 


చిటికెలో అరల్ని పెట్టేయొచ్చు!

సొంత ఇల్లు అయితే మనకు నచ్చినట్లు సౌకర్యంగా కట్టించుకోవచ్చు. కానీ వేరు వేరు కారణాల వల్ల పట్టణాలూ నగరాల్లో ఎక్కువమంది అద్దె ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి. వాటిలో కొన్నిటిలో అరలు తక్కువ ఉంటే మరికొన్నిటిలో బట్టల్ని హ్యాంగర్లకు వేలాడదీసేలా ఒకటే పెద్ద వార్డ్‌రోబ్‌ ఉన్న గదులుంటాయి. దాంతో ఒక్కోరకం బట్టల్ని విడివిడిగా సర్దుకునే వీలుండదు. అన్నీ ఒకదానిమీద ఒకటి పెడితే, ఒకటి లాగితే పది పడతాయి. ఈ ఇబ్బంది లేకుండా మార్కెట్లోకి వస్తున్నవే ఈ ‘హై ఫ్యాన్‌ స్టర్‌ ఎక్స్‌పాండబుల్‌ సెపరేటర్‌ షెల్ఫులు’. మనక్కావల్సిన సైజులో పెద్దగానూ చిన్నగానూ మార్చుకునే వీలున్న ఈ అరలకు రెండు వైపులా సక్షన్‌ కప్‌లు ఉంటాయి. కాబట్టి, ఏ వార్డ్‌రోబులలోనైనా చిటికెలో అమర్చేసుకోవచ్చు. సందులా ఉన్న రెండు గోడల మధ్య కూడా వీటిని పెడితే షెల్ఫులు సిద్ధమైనట్లే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు