close

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కుషన్‌... అతుక్కుపోతుంది!

గోడకు వాల్‌ పేపర్లను అంటించడం తెలిసిందే. అలాగే కుషన్లను కూడా ఎక్కడ కావాలంటే అక్కడ చిటికెలో అంటించేసుకోగలిగితే..? నిజం... ఇప్పుడు కుషన్లు వాల్‌ స్టిక్కర్లలా వస్తున్నాయి. రకరకాల డిజైన్లలో వచ్చే ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటు, ఇంటికి కొత్తందాన్ని కూడా తెస్తున్నాయి.

దో కాసేపైతే పర్లేదు కానీ ఓ గంటసేపు టీవీ చూడాలన్నా, పుస్తకం చదవాలన్నా దేనికీ ఆనుకోకుండా కూర్చుంటే నడుమూ, మెడా రెండూ నొప్పే. కాబట్టే, ఎక్కువగా సోఫాల్లో వాలిపోతుంటాం. కానీ ఇంట్లో ఉన్న అందరూ ఓచోట చేరితే ఒక్క సోఫా సరిపోదు. అవసరాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కోచోట కూర్చోవాల్సి వస్తుంది కూడా. అందుకే, దివాన్‌ మీదా, మంచం మీదా ఇంకెక్కడైనా గోడకు ఆనుకుని కూర్చోవాలంటే కుషన్‌ని గానీ దిండుని కానీ వీపు వెనక్కు చేర్చేస్తాం. కాకపోతే మాటిమాటికీ ఎక్కడకు పడితే అక్కడకు దిండుని తీసుకెళ్లడం ఇబ్బందే. అలాకాకుండా మనక్కావల్సిన చోటుల్లో గోడలకు కుషన్లను అంటించేసుకోగలిగితే ఎంత సౌకర్యంగా ఉంటుందో కదా... అలాంటివే ఈ ‘టాటామీ త్రీడీ కుషన్‌ వాల్‌ స్టిక్కర్లు’. మామూలు కుషన్లంత కాకపోయినా కాస్త మందంగా ఉండే ఈ కుషన్‌ స్టిక్కర్ల పైభాగం సింథటిక్‌ లెదర్‌తో ఉండి, మెత్తగా ఉండేందుకు లోపల ఫోమ్‌ ఉంటుంది. అడుగున దేనికైనా అతుక్కునేలా జిగురు ఉంటుంది. వీటిని మంచం, దివాన్‌ పక్కగా ఉండే గోడలకే కాదు, నేలమీద కూర్చున్నపుడూ, కిటికీల దగ్గరా, బాల్కనీలోనూ... వెనక్కు ఆనుకునే గోడలకు ఎంచక్కా అంటించేయొచ్చు. మంచానికి హెడ్‌బోర్డ్‌ లేనివాళ్లు ఆ స్థానంలోనూ కుషన్‌ స్టిక్కర్లను అందంగా అంటించేయొచ్చు.

పిల్లలకోసం కూడా...
చంటి పిల్లలు ఇంట్లో ఉన్నారంటే వాళ్లు కూర్చోవడం నేర్చుకునేటప్పట్నుంచీ నిలబడేటపుడూ, నడక నేర్చుకునేటపుడూ ఎప్పుడు ఎటు పడతారో తెలీదు. అలాంటపుడు గోడలకు తగిలితే గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. కాస్త పెద్ద పిల్లలు కూడా అటూ ఇటూ గెంతుతూ ఆడుతూ పడిపోతుంటారు. అందుకే, కేవలం పిల్లల కోసమే ‘కిడ్స్‌ అండ్‌ బేబీ సాఫ్ట్‌ వాల్‌ స్టిక్కర్స్‌’ పేరుతో ఎన్నో రకాల ఆకారాలూ కార్టూన్‌ ప్రింట్లున్న కుషన్‌ స్టిక్కర్లు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. వీటిని హాలూ, పిల్లల గదుల్లో గోడకు కింది భాగంలో వరుసగా అంటించేస్తే పిల్లలు గభాల్న ఆవైపు పడిపోయినా దెబ్బ తగలదు. మంచానికి పక్కగా ఉండే గోడలకూ ఆకర్షణీయంగా అంటించేయొచ్చు. ఇక, సింథటిక్‌ లెదర్‌తో చేసిన స్టిక్కర్లు కాబట్టి, వీటిమీద నీళ్లు పడినా లోపలకు పీల్చవు, మరకలైనా శుభ్రం చేయడం సులభం. చూడముచ్చటగా ఉండే ఈ త్రీడీ వాల్‌ స్టిక్కర్‌ కుషన్లను ఇంటి అలంకరణలో భాగంగా అమర్చుకునేవాళ్లూ ఉన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు