close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పెళ్లి వద్దన్నందుకు యాసిడ్‌ పోశాడు!

పెళ్లి వద్దన్నందుకు యాసిడ్‌ పోశాడు!

పెళ్లి వద్దన్నందుకు యాసిడ్‌ పోశాడు!

కామంతో కళ్లు మూసుకుపోతే...వావి వరసలు, మంచి చెడులు ఏవీ గుర్తురావేమో! యాభై ఐదేళ్ల వ్యక్తికి పదిహేనేళ్ల అమ్మాయిపై పుట్టిన ఇష్టం ఆ చిట్టితల్లి జీవితాన్ని చీకటిమయం చేసింది. అయితే... కంటి చూపును కోల్పోయినా, పట్టుదల సడలనివ్వలేదామె. పోరాడి చదువుకుంది. లైబ్రరీలో ఉద్యోగం తెచ్చుకుని తన కాళ్లపై తాను నిలబడింది. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోన్న ఆమే ఉత్తరప్రదేశ్‌కి చెందిన అన్షూ రాజ్‌పుత్‌.

కలల ప్రపంచాన్ని చూద్దామనుకునేలోపే కంటిచూపు  కోల్పోయా. ప్రతి అమ్మాయి అందంగా కనిపించాలనుకున్న టీనేజీ వయసులో అంద విహీనంగా మారిపోయా. అలాని జీవితం మీద ఆశ వదులుకోలేను కదా. ప్రతి సవాల్‌ని స్వీకరించా. పోరాడి నిలబడ్డా. మాది బిజినోర్‌. మా నాన్న రైతు. అమ్మ చదువుకోలేదు. మేం ఆరుగురం పిల్లలం. ఉన్నంతలోనే సంతోషంగా ఉండేవాళ్లం. ఆడుతూపాడుతూ ఉండే సమయంలో అకస్మాత్తుగా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. అప్పడు నాకు పదిహేనేళ్లు. పదోతరగతి చదువుతున్నా. మా ఇంటిపక్కనే మరో కుటుంబం అద్దెకుండేది. మేమంతా ఆయన్ని దాదాజీ అని, ఆమెను ఆంటీ అని పిలిచేవాళ్లం. వాళ్లకిద్దరు పిల్లలు. పెళ్లిళ్లు అయిపోయాయి. దాదాజీకి 55 ఏళ్లుంటాయి. ఒకరోజు ఆయన నా వద్దకు వచ్చి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా, నువ్వంటే నాకు ఇష్టం...’ అని అన్నాడు. నాకు భయమేసింది. పరుగెత్తికెళ్లి అమ్మావాళ్లకి ఈ విషయం చెప్పా. అంతే అమ్మ నాన్నను తీసుకుని వాళ్లింటికి వెళ్లి గొడవ పెట్టుకుంది. 
గోడదూకి వచ్చి... 
ఆ సాయంత్రం నేను మా ఇంటి ఎదుట మంచంపై నిద్రపోతున్నా. నాపై ఏదో పడిందని గ్రహించేలోపే ముఖమంతా మండి పోతున్నట్లనిపించింది. రెండు చేతులతో ముఖాన్ని మూసేసుకున్నా. అప్పటికే ప్రమాదం జరిగిపోయింది. గోడ దూకి వచ్చి, ముఖంపై యాసిడ్‌పోసి అక్కడి నుంచి పారిపోయారెవరో. బాధతో విలవిల్లాడా. అమ్మావాళ్లు నన్ను దగ్గర్లో ఉండే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడివరకే తెలుసు. ఆ తరువాత స్పృహ కోల్పోయా. మెలకువ వచ్చేటప్పటికి ఆసుపత్రిలో ఉన్నా. నెలరోజులు గడిచినా కోలుకోలేకపోయా. సరైన చికిత్స అందక ముఖంపై గాయాలు తగ్గలేదు. మానాన్న తన తల తాకట్టు పెట్టయినా నాకు మంచి వైద్యం చేయించాలనుకున్నాడు. అక్కడి నుంచి నన్ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి  మార్చారు. ఆ తరువాతే తెలిసింది యాసిడ్‌ పోసింది దాదాజీ అని. 
చచ్చిపోవాలనిపించింది... 
అక్కడికి వెళ్లాక కాస్త కోలుకున్నా. ముఖంపై గాయం మానింది కానీ, కళ్లల్లో యాసిడ్‌ పడటంతో ఎడమ కన్ను పూర్తిగా కాలిపోగా, కుడి కంటి చూపు కూడా లోపించింది. వైద్యుల చికిత్సతో కుడికన్ను కొంత మేర కనిపించేది. గాయాలన్నీ మానిన తరువాత నా ముఖాన్ని నేనే తడుముకొనేదాన్ని. ఓ రోజు ధైర్యం తెచ్చుకుని, అద్దంలో చూసుకున్నా. కాలిపోయిన నా ముఖాన్ని చూసుకుని, చచ్చిపోవాలనిపించింది. అమ్మ మాత్రం ‘నువ్వు బతికావు మాకు అదే చాలు’ అని భరోసా ఇచ్చింది. అయినా నా మనసు నా ఆధీనంలో ఉండేదికాదు. ఆ ఆసుపత్రిలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  కొంచెంకొంచెంగా మార్పు, ధైర్యం వచ్చాయి. నేను చేయని తప్పునకు శిక్ష ఎందుకు అనుభవించాలనుకున్నా.  తిరిగి ప్రపంచంలోకి వచ్చా. 
నా పేరు తీసేశారు... 
కాస్త గాయాలు మానాక స్కూల్‌కెళ్లా. తీరా వెళ్తే రిజిస్టరులో నా పేరు లేదు. అడిగితే... తోటిపిల్లలు నన్ను చూసి భయపడుతున్నారని రావొద్దన్నారు. ఏడుపొచ్చినా ధైర్యం చేసి స్కూల్‌ హెడ్‌మాస్టర్‌తో మాట్లాడా. చదువుకోవడం నా హక్కు అది నాకు కావాలి అంటూ పట్టుబట్టా. నా ధైర్యాన్ని, పట్టుదలను చూసి మళ్లీ చేర్చుకున్నారు. తోటి పిల్లలు నన్ను చూసి దూరం జరిగేవారు. మొదట్లో బాధేసినా చదువుకోవడానికి వచ్చా కాబట్టి దానిపైనే దృష్టిపెట్టా. అలా ఇంటర్మీడియట్‌ పూర్తిచేశా. 
ఉద్యోగంలో... 
యాసిడ్‌ ప్రభావం నా ఆరోగ్యంపైనా పడింది.  తరచూ ఏదో ఒక చికిత్స తప్పేది కాదు. ఇంట్లోవాళ్లు నాకోసం ఆర్థికంగా చాలా ఇబ్బందిపడ్డారు. ఇవన్నీచూసి నా కాళ్లపై నేను నిలబడాలనుకున్నా. ఉద్యోగం కోసం ప్రయత్నించా. నా ముఖం చూసి ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడే లఖ్‌నవూలో యాసిడ్‌ బాధితులకు చేయూతగా నిలిచే ‘షీరోస్‌ హ్యాంగవుట్‌’ గురించి తెలిసింది. వారిని కలుసుకున్నా. నాకు వాళ్లు లైబ్రరీ మేనేజర్‌గా ఉద్యోగమిచ్చారు.   నా జీతం ఇప్పుడు 22 వేల రూపాయలు. కొంత అమ్మకు పంపిస్తా. ఇప్పుడు  మరో సమస్య మొదలైంది. ‘షీరోస్‌ హ్యాంగవుట్‌’ ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇది మాలాంటివారికి ఉపాధితోపాటు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. అందుకే న్యాయస్థానాన్ని సంప్రదించా. సుప్రీంకోర్టు ఈ కేసుపై స్టే ఆర్డరిచ్చింది. ఆ సంస్థ అలాగే ఉండిపోయేందుకు నా వంతుగా ప్రయత్నిస్తున్నా. ఇటీవల టెడెక్స్‌ నా గురించి తెలుసుకుని ఆ వేదికపై మాట్లాడమంటూ ఆహ్వానించింది. అక్కడ నా కథంతా పంచుకున్నా. నా అనుభవాలనుంచి ఎవరైనా స్ఫూర్తి పొందితే అంతకన్నా కావాల్సిందేముంటుంది. అదే నేను సాధించిన పెద్ద విజయం.


మరిన్ని