close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చికెన్‌ కోసం... లక్షల జీతం వదిలేసి

చికెన్‌ కోసం... లక్షల జీతం వదిలేసి

అందరు నడిచే దారిలో ఆమె వెళ్లాలనుకోలేదు. వైవిధ్యంగా తానొక మార్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. సవాళ్లు ఎదురైనా అనుకున్నది చేసింది. ఇంతకీ ఎవరామె.. ఏం చేసింది అనుకుంటున్నారా! అయితే మదురైకి చెందిన కార్తీగ అందిస్తోన్న హెర్బల్‌ చికెన్‌ గురించి తెలుసుకోవాల్సిందే! 
హెర్బల్‌ చికెన్‌ అంటే... అదేదో వెజిటేరియన్‌ ఆహారం అనుకుంటారేమో! ఇక్కడ ఆ పేరు పెట్టడానికి కారణం హెర్బల్‌ ఉత్పత్తులను పెట్టి పెంచిన కోళ్ల నుంచి వచ్చిన చికెన్‌ అని అర్థం. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని మెడికల్‌ కాలేజీలు కూడా 
నిర్ధారించాయి. 
ఉద్యోగం వద్దని: కార్తీగ స్వస్థలం మదురై. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఓ కోళ్ల పరిశ్రమను నిర్వహించేవాడు. చిన్నతనం నుంచి తండ్రిని చూస్తూ పెరిగిన కార్తీగ కూడా పెద్దయ్యాక  ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంది. ఆ ఆలోచనలతోనే ఇంజినీరింగ్‌ మంచి మార్కులతో పాసైంది. క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగం కూడా వచ్చింది. లక్షల్లో జీతం వస్తుందని తెలిసినా ఉద్యోగంలో చేరడానికి ఇష్టపడలేదు. కారణం... వ్యాపారంపై మక్కువ.   ఆమె తండ్రి పౌల్ట్రీ రంగంలో ఉన్నారు. అలాగని అదే రంగంలో తానూ కొనసాగితే కొత్తేముంటుందని ఆలోచించింది. అప్పుడే ఆమెకి కోళ్లకి రోగాలు రావడం... వాటికి యాంటీబయోటిక్స్‌, ఇతర మందులు ఇవ్వడం గమనించింది. పైగా చికెన్‌, ఇతర మాంసాహారం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు బాధిస్తోన్న రోజులివి. అలాగని మాంసాహారులు తినకుండా ఉండలేరు. ఈ దిశగా ఆలోచించిన కార్తీగ కోళ్లకి కేవలం మేలు చేసే పోషకాహారం ఇచ్చి పెంచాలని అనుకుంది. దాంతో వెంటనే కోళ్లకి ఎలాంటి ఆహారం అందిస్తే మేలో వెటర్నరీ వైద్యనిపుణుల్ని అడిగి తెలుసుకుంది. రకరకాల అధ్యయనాలు, పరిశోధనల అనంతరం మదురైలోనే హెర్బల్‌ పౌల్ట్రీని ఏర్పాటు చేసింది. 
48 రకాల పంటలు: సేంద్రీయ పద్ధతుల్లో వేప, తులసి, ఉసిరి, మిరియలు, పిప్పళ్లు, మెంతులు, కరివేపాకు వంటి నలభై ఎనిమిది రకాల పంటల్ని పండించడం మొదలుపెట్టింది. వాటినే కోళ్లకు ఆహారంగా వేస్తూ... రోగాలు రాకుండా చూస్తోంది. ఇలాంటి ఆహారం తీసుకున్న కోళ్లు మిగతా వాటిలా బరువు పెరగవు. ఈ క్రమంలో కార్తీగకు నామక్కల్‌ లైవ్‌స్టాక్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ బృందం సాయమందించింది. అలా ఆమె తల్లి దాచుకున్న డబ్బులు, బంగారం పెట్టుబడిగా పెట్టి కార్తీగ ఈ వ్యాపారం మొదలుపెట్టింది. 
హేళన చేసినా:  చాలామంది ‘ఎలా తిన్నా మాంసాహారమే కదా... అలాంటి పదార్థాలు పెట్టినంత మాత్రాన వెజిటేరియన్‌ కాదు కదా’ అంటూ ఆమెని ఎగతాళి చేసేవారు. కానీ కార్తీగ ఎవరి మాటల్నీ పట్టించుకోలేదు. అయితే ఆ కోళ్ల గురించి ప్రచారం చేయడం ఆమెకి సవాలుగా మారింది. సామాజిక మాధ్యమాలు, బస్టాండులు, రైల్వేస్టేషన్లు, చికెన్‌ సెంటర్లు, జన సంచారం ఉండే చోట సాళ్లు పెట్టి ప్రచారం చేసింది. నిదానంగా జనాలు ఈ హెర్బల్‌ చికెన్‌ను ఆదరించడం మొదలుపెట్టారు. అలానే నామక్కల్‌ లైవ్‌స్టాక్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ కూడా కార్తీగ అందిస్తోన్న చికెన్‌ ఆరోగ్యానికి హాని చేయదని గుర్తించి ధృవీకరణ పత్రాన్ని అందించింది. దాదాపు ఏడాది పాటు ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కొన్న కార్తీగకు ఇప్పుడు చికెన్‌ సెంటర్‌ ఏర్పాట్లు చేస్తామని, ఫ్రాంచైజీ ఇవ్వమని ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం మదురై, కోయంబత్తూరు చుట్టుపక్కల దాదాపు యాభై చికెన్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఈ హెర్బల్‌ పౌల్ట్రీ నిర్వహణకు, తోటల పెంపకానికి ఖరీదు ఎక్కువైనా ఈ చికెన్‌ను సాధారణ చికెన్‌ రేటుకే విక్రయిస్తోంది కార్తీగ.


మరిన్ని