close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మనసెరిగి మాట!

మనసెరిగి మాట!

పిల్లల పెంపకం అంత తేలికైన వ్యవహారం కాదు. ముఖ్యంగా వారితో మాట్లాడటం ‘చిన్న’ విషయం కాదు. చిన్నారులకు సరిగ్గా అర్థమయ్యేలా, విషయాన్ని గ్రహించేలా చెప్పడం కత్తి మీద సామే. పిల్లల మనసు తెల్ల కాగితం లాంటింది. దాని మీద పడిన ముద్రలు దీర్ఘకాలం ప్రభావం చూపుతాయి. కాబట్టి అప్పుడప్పుడే మానసిక వికాసం పురుడుపోసుకుంటున్న తరుణంలో నిరాశా నిస్పృహలకు తావివ్వకుండా.. సానుకూల భావనలు పెంపొందేలా మాట్లాడితే అది జీవితాంతం తోడుంటుంది. మంచి వ్యక్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే పౌరులుగా ఎదగడానికి తోడ్పడుతుంది.

పిల్లలు - పెంపకం 
పిల్లలకు ఇల్లే తొలి పాఠశాల. తల్లిదండ్రులే ఆది గురువులు. ఇంట్లో పెద్దవాళ్లు మాట్లాడే మాటల ద్వారానే వాళ్లు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అమ్మానాన్నలు తమతో మాట్లాడే తీరును బట్టే పిల్లలు తమపై ఒక అభిప్రాయాన్ని, నమ్మకాన్ని ఏర్పరచుకోవటం ఆరంభిస్తారు. పెద్దల మీద గౌరవం పెరగటానికి, ఇతరులతో మాట్లాడే విధానం అబ్బటానికీ ఇదే మూలం. తమ మాటలను తల్లిదండ్రులు వింటున్నారని, అర్థం చేసుకుంటున్నారనే సంగతే పిల్లలకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేస్తుంది. అదే పిల్లల మాటలను పట్టించుకోకపోతే వెంటనే చిన్నబుచ్చుకుంటారు. తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతో కుంగిపోతారు. దీంతో పిల్లలకు తల్లిదండ్రులపై నమ్మకమూ పోవచ్చు. కాబట్టి పిల్లల మనసెరిగి మాట్లాడటం చాలా కీలకం. 

పూర్తిగా, సవివరంగా.. 
పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వారికి అవసరమైన సమాచారం ఇవ్వడానికే ప్రయత్నించాలి. ఆయా అంశాలు మనకు ఇష్టం లేనివైనా కూడా సవివరంగా చెప్పడమే మంచిది. అరకొర సమాచారం ఇస్తే ‘అవి అంత ముఖ్యమైన విషయాలు కావేమో’ అనే దురభిప్రాయానికీ రావొచ్చు. అలాగని అన్ని విషయాలను మనం లోతుగా తెలుసుకుని ఉండాల్సిన అవసరమేమీ లేదు. పిల్లలకు అవసరమైన మేరకు, అవసరమైనప్పుడు చెప్పగలిగితే చాలు. అయితే వారి వయసును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వారికి ఎంతవరకు అవసరమో అంతవరకే వివరించాలి. ఇదంతా ఎందుకొచ్చిన గొడవని అనుకోవద్దు. ప్రశ్నలు అడిగినప్పుడు విసుక్కోవద్దు. పిల్లలు ఎలాంటి విషయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారో, వారికి ఆసక్తి కలిగిస్తున్నవేంటో అనేవి తెలుసుకోవడానికి ఇలాంటి ప్రశ్నలు బాగా ఉపయోగపడతాయి.
కళ్లలో కళ్లు పెట్టి చూసి.. 
విషయగ్రహణలో, అభిప్రాయ వ్యక్తీకరణలో శ్రద్ధగా వినడమనేది కీలకపాత్ర పోషిస్తుంది. దీన్ని ఎవరికివారు నేర్చుకొని, సాధన చేయాల్సిందే. తల్లిదండ్రులు మాట్లాడే తీరుతోనే ఇది పిల్లలకు సొంతమవుతుంది. ముఖ్యంగా కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడడం వల్ల పెద్దవాళ్లు తమ మాటల మీద ఆసక్తి చూపుతున్నారని, తాము చెప్పేది వింటున్నారనే భావన పిల్లల మనసుల్లో పొడసూపుతుంది. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడమూ ముఖ్యమనే సంగతినీ పరోక్షంగా నేర్చుకుంటారు. అదే పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు టీవీ చూడటమో, పుస్తకం చదవడమో, పనుల్లో మునిగిపోవడమో చేస్తుంటే తామంటే లెక్కలేదనే అభిప్రాయానికి వస్తారు. ఇది ఆత్మన్యూనతకు దారితీస్తుంది.
తెలియకపోతే తెలియనట్టుగానే.. 
చిన్నారులకు రకరకాల సందేహాలు వస్తుంటాయి. వాటిని దాచుకోకుండా వెంటనే అడిగేస్తుంటారు కూడా. కొన్నిసార్లు వాళ్లు అడిగిన వాటికి మనకు సమాధానం తెలియకపోవచ్చు. అన్ని విషయాలూ మనకు తెలియాలనేమీ లేదు కదా. అంత మాత్రాన నామోషీ పడాల్సిన పనీ లేదు. ఏదైనా తెలియకపోతే ‘తెలియదు’ అని అంగీకరించడమే మంచిది. ఒకవేళ తప్పుడు సమాధానం చెబితే.. తరువాత అది తప్పని తేలితే పిల్లల దృష్టిలో చులకనైపోతాం. కావాలంటే ఇలాంటి సందర్భాలను అవకాశంగానూ మార్చుకోవచ్చు. ‘దీనికి సమాధానమేంటో డిక్షనరీలో చూసి తెలుసుకుందాం. ఎన్‌సైక్లోపీడియాలో వెతికి చూద్దాం’ అని ప్రోత్సహించొచ్చు. దీంతో పిల్లలకే కాదు.. మన మెదడుకూ పని పెట్టినట్లు అవుతుంది.
అవసరమైతే ప్రత్యేక భేటీలూ.. 
ఉద్యోగాలు, వ్యాపారాల వంటి వాటిల్లో బాగా నిమగ్నమయ్యే కొందరికి కుటుంబంతో, పిల్లలతో గడిపే సమయం అంతగా చిక్కకపోవచ్చు. ఇలాంటివాళ్లు వారానికో, నెలకో.. ప్రత్యేక సమయాన్ని కేటాయించుకుని కుటుంబమంతా కలుసుకునేలా చూసుకోవడం మంచిది. వీటిల్లో పిల్లలకూ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కుటుంబ సభ్యులు తమ అభిప్రాయాలను, సమస్యలను కలబోసుకోవడానికి ఇలాంటి భేటీలు బాగా ఉపయోగపడతాయి. గత వారంలో తమకు ఎదురైన మంచి సంఘటనలను నెమరు వేసుకోవడానికీ  దోహదం చేస్తాయి. ఇవి పిల్లల్లోనూ కొత్త ఆలోచనలు అంకురించడానికి మార్గం వేస్తాయి.
స్థాయి తెలుసుకుని.. 
పిల్లల స్థాయిని గుర్తించి, వారికి తేలికగా అర్థమయ్యేలా మాట్లాడటం ముఖ్యం. మన మాటల్లోని ఉద్దేశమేంటో పిల్లలు గ్రహించేలా చూసుకోవడం కీలకం. లేకపోతే తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇది మొదటికే మోసం తేవొచ్చు. ఉదాహరణకు- ‘తమ్ముడిని కొడితే చూడు. నీ తాట తీస్తా’ అని అన్నారనుకోండి. భయపెట్టి గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారనే సంగతిని పిల్లలు అర్థం చేసుకోకపోవడమే కాదు.. మొండితనంతో మళ్లీ మళ్లీ కొట్టే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పడం మంచిది. ‘తమ్ముడు నీకన్నా చిన్నవాడు. నువ్వు కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడివి. వాడిని కొట్టడం తప్పు. నువ్వే బాగా చూసుకోవాలి’ అని చెబితే ఇట్టే అర్థం చేసుకుంటారు. ఇలాంటి మాటలు చిన్నారుల మనసుల్లో గాఢంగా నాటుకుపోతాయి.
సూటిగా, సుత్తిలేకుండా.. 
పిల్లలు ఒక దగ్గర కుదురుగా ఉండరు. ముఖ్యంగా ఐదారేళ్ల చిన్నారులను పట్టుకోవడం కష్టం. వీరికి సుదీర్ఘమైన సంభాషణలంటే ఇష్టముండదు. కాబట్టి కొద్దిసేపట్లోనే ముగిసే చిన్న చిన్న మాటలతో.. సూటిగా విడమరచి చెప్పడం మంచిది. ఏ మాటైనా 30 సెకన్లలోనే ముగిసేలా చూసుకుంటే మేలు. ఆ తరువాత ‘నేనేం చెప్పానో అర్థమైందా’ అని అడిగితే గుర్తుచేసుకుని మరీ చెబుతారు. మనం మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ‘ఇక చాలు’ అని అనుకుంటున్నట్లు అనిపిస్తే.. అంటే దిక్కులు చూడటం, కళ్లు తిప్పుకోవడం వంటివి చేస్తుంటే వెంటనే ఆపేయడం ఉత్తమం. పిల్లలతో ఎప్పుడు మాట్లాడాలో కాదు, ఎప్పుడు ముగించాలో కూడా తెలిసి ఉండాలన్నమాట.
భావాలూ, ఆలోచనలూ.. 
పిల్లలతో మాట్లాడేప్పుడు మనలోని భావాలను, ఆలోచనలు కలబోసుకోవడమూ ఎంతో మేలు చేస్తుంది. వీటి ద్వారా నైతిక విలువలు నేర్పించొచ్చు. ‘మా ఆఫీసులో గుమాస్తా కొడుక్కి పుస్తకాలు కొనిస్తే ఎంత సంతోషించాడో.. గూర్ఖా కుమార్తెకు దుస్తులు కొనిస్తే ఎంత మురిసిందో’.. ఇలాంటి మాటలు పిల్లలకు ఆసక్తి కలిగించడమే కాదు. పరోక్షంగానూ వారిలో సేవా దృక్పథం నాటుకోవడానికి దోహదం చేస్తాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో తమలాగే ఉండాలని పిల్లలకు గట్టిగా చెబుతున్నట్లు అనిపించకుండా చూసుకోవడం మంచిది. లేకపోతే వారికి ఆయా విషయాలపై ఆసక్తి సన్నగిల్లే ప్రమాదముంది.
- పి. భాగ్య

మరిన్ని