close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇది మహిళా వత్సరం!

ఇది మహిళా వత్సరం!

అప్పుడే 2018 అయిపోయిందా...! 
ఒక్కో రోజును తీసుకున్నా... 
365 రోజులు గుర్తుచేసుకున్నా... 

ఇది మహిళా వత్సరం!ఈ ఏడాది మహిళలకు 
ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. 
కొన్ని సమస్యలు భయపెడితే... 
కొందరి విజయం స్ఫూర్తిని పెంచింది. 
కొన్ని పోరాటాలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే... 
కొంత ప్రోత్సాహమూ లభించింది. 
ఓర్పుకు ఓదార్పుకి ప్రతీకగా... 
అపర కాళికగా... 
ఆమె నడక మారింది. 
కొలువులు, చదువులు ఆసక్తులు.... 
ఇలా ఏ రంగం తీసుకున్నా... 
ఈ సారి మహిళలకు 
అన్నీ ప్రత్యేకతలే.

పద్మ పురస్కారాలతో మెరిసి...

ఇది మహిళా వత్సరం!

ఈ ఏడాది మొదటి నెల జనవరే మహిళలకు గుర్తింపు మోసుకొచ్చింది. సేవ, యోగా, రాజకీయం, క్రీడలు, వైద్యం, సాహిత్యం... ఇలా విభిన్న రంగాలకు చెందిన దాదాపు పద్నాలుగు మంది మహిళలు ఈ ఏడాది పద్మ పురస్కారాల గ్రహీతలయ్యారు. వీళ్లలో చిన్నచిన్న పనులు చేస్తూ సమాజానికి తమవంతుగా సాయం అందించినవారూ లేకపోలేదు. కోల్‌కతాకు చెందిన సుభాషిణికి అక్షరం ముక్క రాదు. దినసరి కూలి. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో తనలాంటి నిరుపేదలకు ఆ పరిస్థితి రాకూడదని ఓ ఆసుపత్రి కట్టించాలనుకుంది. ఆ డబ్బు సమకూర్చేందుకు కూరగాయలు అమ్మింది. కూలి పనులకూ వెళ్లింది. చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఎన్నోవేలమందికి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే ఆమెకు పద్మశ్రీ తెచ్చిపెట్టింది. 

న్యాయపోరాటం చేశారు...

ఇది మహిళా వత్సరం!

నడిరోడ్డుమీదా, కాలేజీల్లో, కార్యాలయాల్లో వేధించే మగాళ్లకు కాళికలుగా మారారు కొందరు. కన్న కొడుకును పోలీసులే చంపేసి మసిబూసి మారేడుకాయ చేస్తే... పోలీసుల్నే ఎదిరించింది ఓ అమ్మ. చదువు లేకపోయినా, అవమానాలు పడినా, వయసు మీదపడి శక్తి సన్నగిల్లుతున్నా, ఏళ్లు గడిచిపోతున్నా అనుకున్నది సాధించగలిగింది. ఆ పోలీసులకు శిక్షపడేలా చేసింది. ఆమే కేరళకు చెందిన ప్రభావతీ అమ్మ. సాధారణ మధ్యతరగతి కుటుంబం దంగేటి పావనిది. తండ్రి లేడు. ఆమెకు ఉన్నది తల్లి, అక్కే. కళ్లముందే అక్క మరణాన్ని చూసింది. దాన్ని ప్రమాదంగా మార్చాలనుకున్నారు నిందితులు. పోరాటానికి సిద్ధపడింది. ఇరుగుపొరుగు వద్దన్నారు. బంధువులు వెలేశారు. అయినా మూసేసిన కేసుని హత్యకేసుగా రుజువు చేయించింది. ఫోనులో వైరల్‌ అయిన ఓ నగ్నచిత్రాన్ని చూసి తన భార్యదే అని భావించిన ఓ భర్త ఆమెను ఇంటినుంచి గెంటేశాడు. తాను తప్పుచేయలేదు శిక్ష ఎందుకు అనుభవించాలనుకుని శివంగిలా మారిందామె. సీడాక్‌ నివేదిక ద్వారా తనని తాను నిరూపించుకుంది. ఆ ఫొటోలో ఉన్నది ఆమె కాదని నిరూపితమైంది. ఆమే కేరళకు చెందిన శోభా సాజు. హెచ్‌ఐవీ ఉందని డాక్టర్లు చెప్పిన ఓ తప్పుడు నివేదికను అబద్ధం అని రుజువు చేసేందుకు డాక్టర్లపై పోరాటం చేసింది వరంగల్‌కి చెందిన మమత. నష్టపరిహారం కూడా అందుకుంది. శానిటరీ న్యాప్‌కిన్‌... మహిళల నిత్యావసర వస్తువుల్లో ఇప్పుడు ఇదీ ఒకటి. ప్రభుత్వం దానిపైనా జీఎస్‌టీ వేటు వేస్తే రద్దు చేయమంటూ పోరాడింది ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జర్మీనా ఇస్రార్‌ఖాన్‌. ఆమె పోరాటం ఫలించి జీఎస్‌టీ పన్నెండు శాతం రద్దయ్యింది. ఓ సమస్య ఎదురైనప్పుడు చనిపోవడం కన్నా పోరాడి గెలవాలని నిరూపిస్తూ తమలాంటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు వీళ్లు.

ఇది మహిళా వత్సరం!

 

అంతర్జాతీయ యానంలోనూ...

ఇది మహిళా వత్సరం!

అమ్మాయిలు చీకటిపడేలోగా ఇంటికి చేరాలనే రోజులు ఎప్పుడో పోయాయి. ఈ రోజుల్లో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఉద్యోగాలు చేసేవారే ఎక్కువ. అలాంటివాళ్లందరికీ ఇంకాస్త స్ఫూర్తిని పంచారీ మహిళలు. హైదరాబాద్‌కి చెందిన జయభారతి బృందం యాభై రోజుల పాటు పదిహేడువేల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. చేనేత యాత్రనూ చేపట్టింది. ఐఎన్‌ఎస్‌ తరణి పేరుతో ప్రపంచమంతా తెరచాప పడవపై చుట్టొచ్చిన ఆరుగురు మహిళా నౌకా అధికారిణుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సమస్యలు ఎదురైనా అన్నింటినీ అధిగమించి ప్రపంచాన్నే చుట్టొచ్చారు. ఆర్మీ అధికారిణులు అంతే. ‘మహిళలు మీరు కూడా సైన్యంలో చేరండి’ అంటూ ప్రత్యేంగా వివిధ రాష్ట్రాల్లో ప్రయాణించారు. 

సరస్వతీ పుత్రికలే...

ఇది మహిళా వత్సరం!

తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు...  అని పోరాడి మరీ తమ హక్కుల్ని సాధించుకున్నారు కొందరు. ఆమె పేరు రమణమ్మ. నిరుపేద కుటుంబం. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామం. పన్నెండేళ్లకే తల్లిదండ్రులు పెళ్లిచేసేందుకు సిద్ధమయ్యారు. వద్దని బతిమాలినా,  తల్లిదండ్రులు కరగలేదు. చివరకు పోరాడి మరీ తన హక్కును సాధించుకుంది. ఇప్పుడు ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించుకుంది. ఆమే కాదు... చాయ్‌ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోన్న ఓ పేద తండ్రి సమస్యల్ని తీర్చేందుకు కష్టపడి చదివింది చిత్తూరు జిల్లా, నాగులాపురం మండలం, ఎస్‌. ఎస్‌ పురానికి చెందిన సుభాషిణి. పన్నెండో తరగతిలో 98 శాతం మార్కులు తెచ్చుకుని 3.8 కోట్లు స్కాలర్‌షిప్‌తో మసాచుసెట్స్‌లోని బాబన్స్‌ కాలేజీలో ఛాన్సు కొట్టేసింది. అక్షరాస్యతలో బిహార్‌ ఇప్పటికీ వెనకబడే ఉంది. అలాంటి చోట చదువులతల్లిగా మారి సాటి ఆడపిల్లలకు ఆదర్శంగా నిలిచింది కల్పనాకుమారి. నీట్‌లో 99.99 పర్సంటైల్‌తో జాతీయ స్థాయిలో మొదటిస్థాయి ర్యాంకర్‌గా నిలిచింది. ఒకేసారి ఐదు బంగారుపతకాలు సాధించినవారూ లేకపోలేదు. 96 ఏళ్ల వయసులో పరీక్ష రాసిన మహిళా ఉన్నారు.

ఇది మహిళా వత్సరం!

మీటూతో... 

ఇది మహిళా వత్సరం!

పనిచేసేచోట లైంగికవేధింపులు ఎందుకు ఎదుర్కోవాలీ అంటూ ఎంతోమంది మహిళలు మీటూతో తమ సమస్యల్ని నలుగురికీ చెప్పేందుకు బయటకు రావడం ఈ సంవత్సరం ఓ పెద్ద ప్రకంపనే రేపింది. బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా, చిన్మయి శ్రీపాద మొదలు ఎంతోమంది మహిళలు తమ రంగాల్లో ఎదుర్కొన్న వేధింపుల్ని, ఇబ్బందుల్ని బయటపెట్టారు. దానివల్ల వాళ్లకు ఉన్న అవకాశాలు తగ్గాయి. అవమానాలు ఎదురయ్యాయి. అయినా భయపడలేదు. వెంటనే తమ సమస్య పరిష్కారం కాకపోవచ్చు కానీ... భావితరాలకు ఓ శక్తిమంతమైన వేదికను ఏర్పాటుచేయగలిగారు. ఎప్పుడయినా సరే... ధైర్యంగా బయటకు వచ్చి తమ సమస్యను తెలియజేసేలా ఓ చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశారు వీళ్లు.

ఇది మహిళా వత్సరం!

అడుగులు సాధికారత వైపు...

ఇది మహిళా వత్సరం!

అవరోధాలు ఎన్ని ఉన్నా... ఒక్కోదాన్ని దాటుకుంటూ అనుకున్నది సాధిస్తూ సాధికారత, సమానత్వం దిశగా ప్రయాణం సాగించే మహిళలు కొందరు లేకపోలేదు. మహిళల సంఖ్య తక్కువగా ఉండే న్యాయ రంగంలో ఈ సంవత్సరం ఇందూ మల్హోత్రా తనకంటూ గుర్తింపు సాధించింది. ఓ మహిళా న్యాయవాది అయిన ఆమె ఈ ఏడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైంది. అలా ఎంపికైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది.  కర్నూలుకు చెందిన అనితా నరహరి ప్రపంచ ఆహార పథకం డిప్యూటీ ఛీఫ్‌ ఆఫ్‌ బిజినెస్‌గా ఎంపికైంది. ఆమె కూడా అలాంటి అవకాశాన్ని అందుకున్న తొలి భారతీయురాలే. ఎక్కువమంది మహిళలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లోకి రారు. కానీ ఈ సంవత్సరం ఈ రంగంలోకి చకచకా అడుగులు వేయడం మొదలుపెట్టారు కొందరు మహిళలు. వారిలో విశ్వంలో తొలి నక్షత్ర కాంతి కనుక్కొన్న శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన నివేదితా మహేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారతీయ మూలాలున్న ఆమె ఈ రంగంలోకి ఆసక్తిగా వచ్చింది. ఇక, 2022 లక్ష్యంగా మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్టు బృందానికి నాయకురాలిగా ఎంపికైంది ఇస్రోకు చెందిన వీ.ఆర్‌. లలితాంబిక. ప్రకృతిది బిహార్‌. పాతికేళ్లకే ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీస్‌ విభాగంలో తొలి మహిళా అధికారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. గువహటిలో ఇప్పటివరకూ రైలుపెట్టెల నిర్వహణ విభాగం బాధ్యత పురుషులదే. అలాంటిది ఈ ఏడాది 165 ఏళ్ల చరిత్రను తిరగరాసి ఆ బాధ్యతని మొదటిసారి తమ చేతుల్లోకి తీసుకుంది ఓ మహిళాబృందం. ఆమె పేరు జిల్‌మోల్‌. చేతుల్లేవు. కానీ కారు నడపడం అంటే ఇష్టం. ఎలాగైతేనేం నేర్చుకుంది. కానీ లైసెన్సు ఉండాలిగా. దానికోసం పెద్ద పోరాటమే చేసింది. చివరకు సాధించింది. అలా లైసెన్సు సాధించిన తొలి భారతీయురాలిగా అరుదైన గుర్తింపునీ సొంతం చేసుకుంది.

ఇది మహిళా వత్సరం!


మరిన్ని