close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
టీనేజీని అర్థం చేసుకుందాం 

పిల్లలు - పెంపకం: టీనేజి

టీనేజీని అర్థం చేసుకుందాం 

అప్పటివరకూ...అమాయక ప్రశ్నలకు విసుక్కుంటూనైనా జవాబిస్తాం. గొంతెమ్మ కోరికలు కోరినా లేదులేదంటూనే తీరుస్తాం.అంతలోనే... చెప్పినట్టు విన్న చిన్నారులే పొగరుబోతులుగా కనిపిస్తారు. కొంగు పట్టుకొని తిరిగినవాళ్లే ‘గది పక్షులు’గా అనిపిస్తారు. ఎందుకింత మార్పు? బాల్యాన్ని దాటి... యవ్వనంలోకి దూకుతున్న పిల్లలపై ఎందుకిన్ని ఫిర్యాదులు? నిజాయతీగా ప్రశ్నించుకుంటే... సహృదయతతో ఆలోచిస్తే సామరస్య పరిష్కారం దొరక్కపోదు!!

యౌవ్వనంలో శారీరకంగానే కాదు, మానసికంగానూ ఎన్నెన్నో మార్పులు మొగ్గతొడుగుతాయి. అప్పటివరకూ అమ్మకూచిగా తిరిగిన పిల్లల మనసులో స్వతంత్ర భావనలు, స్వీయ అభిప్రాయాలు గూడుకట్టుకునే సమయం. ఒకవైపు బయటి ఆకర్షణల ప్రభావాలు, స్నేహితుల ప్రోద్బలాలు... మరోవైపు తల్లిదండ్రుల ఆకాంక్షలు, చదువుల భారం... వీటన్నింటి మధ్య పసి మనసులు కొట్టుమిట్టాడుతుంటాయి. మంచి, చెడు తేల్చుకోలేని సందిగ్ధావస్థలో ఊగిసలాడుతుంటాయి. ఇంట్లో పెరిగిన వాతావరణానికి, బయటి పరిస్థితులకూ పొంతన కుదరదు. ఈ మానసికావస్థే కొన్నిసార్లు తల్లిదండ్రులు, పిల్లల మధ్య పొరపొచ్చాలకు, అపార్థాలకు దారితీస్తుంటుంది. తల్లిదండ్రులకు పిల్లలు చేసేవన్నీ పొరపాట్లుగానే కనిపిస్తే... పిల్లలకు పెద్దల మాటలన్నీ పాత చింతకాయ పచ్చడిలా తోస్తుంటాయి. అయితే మనం కూడా అలాంటి దశను దాటుకొనే వచ్చామని, జీవితంలో ఇదొక అనివార్య మార్పని గుర్తించినపుడు పరిష్కారం దానంతటదే లభిస్తుంది. కావాల్సిందల్లా పిల్లలకూ స్వతంత్ర భావాలుంటాయని గుర్తించడమే. 

1. ఎప్పుడూ ఫోన్‌ పట్టుకొని కూర్చోవడమేనా? 

టీనేజీని అర్థం చేసుకుందాం 

చాలామంది తల్లిదండ్రులు చేసే ఫిర్యాదు ఇది. ఎప్పుడు చూసినా ఫోన్‌లోనే తలదూరుస్తుంటారని, ఆ ధ్యాసలో పడి సరిగ్గా చదువుకోవటం లేదని నిందిస్తుంటారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ రోజుల్లో తోటివాళ్ల కన్నా తామెక్కడ వెనకబడిపోతామో అనే బెంగ కుర్రకారును నిలవనీయదనే సంగతి పెద్దవాళ్లు గుర్తించాలి. ఉబుసుపోక కబుర్ల వంటివి పక్కనపెడితే- చదువుల్లోనైనా, ఉద్యోగాన్వేషణలోనైనా పరస్పర సహకారానికి ఇలాంటి ‘సాంకేతిక బంధాలు’ మున్ముందు ఎంతగానో ఉపయోగపడతాయని తెలుసుకోవాలి. ఒకవేళ పరిస్థితి మరీ శ్రుతిమించుతోందని అనిపించినపుడు... ముందు చదువు, ఆరోజు పాఠాలు, ప్రాజెక్టుల వంటివన్నీ పూర్తిచేశాకే ఫోన్‌ ముట్టుకోవాలని షరతులు పెట్టొచ్చు. అవసరమైతే ఫోన్‌ బిల్లు కూడా చూపించొచ్చు. పిల్లలు కూడా దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. కోపగించుకుంటే, అరిస్తే ప్రయోజనం ఉండకపోవచ్చు. గట్టిగా మందలించినపుడు ఫోన్‌ను పక్కకు పెట్టినా మనం బయటికి వెళ్లినప్పుడూ అలాగే ఉంటారని చెప్పలేం.

2. స్నేహితులే లోకమా?  

టీనేజీని అర్థం చేసుకుందాం 

యుక్తవయసులో స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువ. ఈ వయసులో పిల్లలు ఇంట్లో కన్నా ఎక్కువ సమయం బయటే గడుపుతుంటారు. వయసు ప్రభావమో ఏమో గానీ కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లటానికీ కొందరు ఆసక్తి చూపించరు. ఇదే తల్లిదండ్రుల మనసును కలచివేస్తుంది. కానీ పెద్దయ్యాక కష్టనష్టాల్లో స్నేహితులే ఎక్కువగా తోడుంటారనే విషయాన్ని మరవరాదు. పైగా అన్ని స్నేహాలూ చివరికంటా కొనసాగవు. ఒకసారి మీ చిన్ననాటి స్నేహాలను తలచుకోండి. అప్పుడు ఎంతమంది స్నేహితులుండేవారు? ఇప్పుడు ఎంతమంది ప్రాణ స్నేహితులు మిగిలారు? ఒకరో, ఇద్దరో! పిల్లల విషయమూ అంతే. కాబట్టి స్నేహం చేయనివ్వండి. బాధ్యతగా మెలగటం, ఆపదల్లో ఆదుకోవటం వంటివి పిల్లలు స్నేహాలతోనే నేర్చుకుంటారు. అయితే స్నేహాల మధ్య తారతమ్యాలను గ్రహించగలిగేలా చేయాలి. నిజమైన స్నేహితులెవరూ మనకు ఇష్టంలేని పనులు చేయమని బలవంతపెట్టరనీ.. మన నిర్ణయాలు, నిబంధనలను గౌరవిస్తారనే విషయాలను తెలుసుకునేలా చూడాలి. ఒకవేళ ఈ విషయంలో మీరు ఆందోళన పడుతోంటే వారి తల్లిదండ్రులను ఇంటికి ఆహ్వానించండి. కలిసి భోజనం చేయండి, షికారుకు వెళ్లండి. పిల్లల దృష్టికోణంలోంచి ఆలోచిస్తుంటే మనమూ ఎదుగుతాం, మనలోనూ మార్పు వస్తుంది. 

3. చెల్లిని, తమ్ముడిని పట్టించుకోకపోతే ఎలా? 
ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు చెల్లినో, తమ్ముడినో పట్టించుకోకపోతే తల్లిదండ్రుల మనసు చివుక్కుమనటం నిజమే. అలాగని తోబుట్టువులను కచ్చితంగా పట్టించుకోవాల్సిందేనని పట్టుబట్టడం మాత్రం తగదు. దీంతో మంచి కన్నా చెడు జరిగే అవకాశమే ఎక్కువ. అందువల్ల ఇతరత్రా మార్గాలతో పిల్లల మనసు గెలవడానికి ప్రయత్నించాలి. వీలైనప్పుడల్లా కుటుంబమంతా కలిసి బయటకు వెళ్లొచ్చు. ఒకరితో మరొకరు చనువుగా మెలగటానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. నిజానికి చిన్నప్పుడు తోబుట్టువుల మధ్య ‘వైరం’ ఉండడం సహజమే. అయితే అది రాన్రానూ పోతుంది. పిల్లలు ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి అవసరాలను మరొకరు కనిపెట్టుకోవడం అలవడుతుంది. ఒకసారి మీ పిల్లల చిన్ననాటి రోజులను గుర్తుతెచ్చుకొని చూడండి. చెల్లి, తమ్ముళ్ల విషయంలో అప్పటి ప్రవర్తనకూ ఇప్పటి ప్రవర్తనకూ గల తేడా మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఒకప్పుడు ప్రతిదానికీ పేచీ పడినవాళ్లే ఇప్పుడు ఎంత కలిసిమెలిసి ఉంటున్నారనేది తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని పదే పదే చెప్పాల్సిన పని లేదు. 
4. ఈ వయసులో ప్రేమలా? 
నవ యౌవన ఆకర్షణలు, ఇతరుల చనువు కోరుకోవటం సహజం. అంతమాత్రాన ప్రేమలో పడినట్టు కాకపోవచ్చు. అయితే పిల్లలు ఏదైనా విషయాన్ని దాచిపెడుతున్నారా? ఒకవేళ ఎవరినైనా ఇష్టపడుతుంటే ఆ విషయాన్ని మీతో ధైర్యంగా చెప్పగలుగుతున్నారా లేదా అనేవి ప్రశ్నించుకోవాలి. ఏ విషయాన్నయినా చెప్పటానికి సంకోచిస్తుంటే అంత చనువు, స్వేచ్ఛ లేదనే అర్థం. కాబట్టి ముందు నుంచే పిల్లలతో స్నేహితుల్లా మెలగాలి. ఒకవేళ పిల్లలు ప్రేమలో పడినట్టు తెలిస్తే ఆ విషయాన్ని నిర్భయంగా, నిస్సంకోచంగా ఇంట్లో చెప్పగలిగే వాతావరణం ఉండాలి. దీంతో ప్రేమబంధంలో ఏవయినా సమస్యలు ఉన్నా తెలుసుకుని ముందే గుర్తించే వీలుంటుంది. తమ సమస్యల్ని వేరెవరితోనో కాకుండా తల్లిదండ్రులతోనే చెప్పుకోవటం మంచిది కదా. పిల్లలు ప్రేమలో పడినట్టు తెలియగానే చాలామంది ‘అవన్నీ కట్టిపెట్టు, బుద్ధిగా చదువుకో’ అంటూ వాళ్లను కట్టడి చేస్తారు. ఇలాంటివి వికటించే అవకాశమే ఎక్కువ. అంతకన్నా ‘ఒంటరిగా కలుసుకోవద్దు, ఇతర స్నేహితుల సమక్షంలోనే మాట్లాడుకోవాలి, పెద్దవాళ్లు ఉన్నప్పుడే ఇంటికి రానివ్వాలి’ వంటి జాగ్రత్తలు చెప్పొచ్చు.
5. ఇంటి పరిస్థితులు తెలియకపోతే ఎలా? 
చిన్నప్పుడంటే ఏమో గానీ ఇంత వయసు వచ్చాకా ఇంటి పరిస్థితుల గురించి తెలుసుకోకపోతే ఎలా? ఇది మరికొందరి ఫిర్యాదు. ఒక వయసుకు వచ్చాక పిల్లలు బాధ్యతగా మెలగాలని కోరుకోవటంలో తప్పులేదు. కానీ నిజంగా అలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నామా? వారి బాధ్యతను గుర్తించేలా చేస్తున్నామా? ఒకసారి మనకు మనమే ప్రశ్నించుకుంటే సమాధానం తెలిసిపోతుంది. అన్నీ మన చేతుల్లోనే, మనం అనుకున్నట్టుగానే జరగాలని కోరుకుంటాం. అలాంటప్పుడు పిల్లలు తమ అభిప్రాయాలను చెప్పుకోవటానికి వీలుంటుందా? ఒకవేళ చెప్పినా ఆచరణ సాధ్యమవుతుందా? తప్పు మనలోనే పెట్టుకొని పిల్లలను నిందించటం తగదు. వారికి ముందు నుంచే బాధ్యతలను తెలుసుకునే మార్గాలను తెరచి ఉంచాలి. పిల్లలతో కలిసి ఇంటి బడ్జెట్‌ వేసుకోవచ్చు. ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చు చేయాలో, ఎంత ఆదా చేయాలో అనేవి కలిసి నిర్ణయించుకోవచ్చు. కావాలంటే ఒక నెల జీతం పిల్లల చేతికివ్వచ్చు. ఆ నెలంతా వాళ్లనే చూసుకోమనొచ్చు. ఇలాంటివి పరోక్షంగానే బాధ్యతలను నేర్పిస్తాయి. అంటే ముందు ఆ అవకాశాన్ని పెద్దవాళ్లే కల్పించాలని గుర్తించాలి. 
- పి.భాగ్య

మరిన్ని