close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
క్యాట్‌ కొట్టేశాం...
లక్ష్యం ఎలాంటిదైనా మనసు పెట్టి చేయగలిగితే...వందశాతం ఫలితం సాధించొచ్చు అని నిరూపించారు ఈ హైదరాబాదీ అమ్మాయిలు. ఒకరు ఆర్థికవేత్త కావాలనుకున్నారు. మరొకరు తండ్రి బాటలో నడవాలనుకున్నారు.  ఏదైతేనేం ఆ ఇద్దరి లక్ష్యం ఒకటే... మేనేజ్‌మెంట్‌ అర్హత పరీక్ష అయిన క్యాట్‌లో మంచి స్కోర్‌ సాధించడం. వారిలో సంహిత పదిహేడేళ్లకే 95.95 పర్సంటైల్‌తో అర్హత సాధిస్తే, జుహీ  98.97 తో లక్ష్యాన్ని చేరుకుంది. 

                       ఆర్థికవేత్తను అవుతా...                    
- సంహిత

క్యాట్‌ కొట్టేశాం...

‘‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ అనే అబ్దుల్‌కలాం మాటలే నాకు స్ఫూర్తి. పదహారేళ్లకి బీటెక్‌ పూర్తి చేశా. ప్రస్తుతం నాకు పదిహేడేళ్లు. క్యాట్‌లో 95.95 పర్సంటైల్‌తో మంచి ర్యాంకు సాధించగలిగా. ఆర్థికవేత్తను కావడమే నా లక్ష్యం. చిన్నవయసులో ఇదంతా ఎలా సాధ్యం అని అడుగుతుంటారు చాలామంది. ఇష్టం ఉంటే ఏదీ కష్టం కాదు. మన జ్ఞాపకశక్తికి మనమే పదును పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు చదువుతూ, గుర్తుంచుకుంటూ సాధన చేయాలి. మాది హైదరాబాద్‌. నాన్న ఎల్‌ఎన్‌ కాశీభట్ట ఇండిపెండెంట్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. అమ్మ గీత చతుర్వేదుల యాక్సెంచర్‌లో మేనేజర్‌గా పనిచేస్తోంది. నాకు మూడేళ్లున్నప్పుడే వరుసగా దేశ రాజధానులన్నీ గుర్తించేదాన్ని. నా జ్ఞాపకశక్తిని గమనించి టీచర్లు ప్రోత్సహించారు. అలా ఏడేళ్లకే ఏడో తరగతి పూర్తిచేశాను.  పదేళ్లకే పదోతరగతి 8.8 జీపీఏతో పాసయ్యాను. లెక్కలు, సైన్స్‌లో ఏ1 గ్రేడ్‌ సాధించా. దాంతో ప్రభుత్వ డాక్టర్‌ నుంచి ఐక్యూ సర్టిఫికెట్‌ తీసుకుని ప్రత్యేక అనుమతితో కాలేజీలో చేరాను. ఇంటర్‌ ఎంపీసీలో 89 శాతం మార్కులతో పాసయ్యా. ఆపై సీబీఐటీలో బీటెక్‌లో చేరాను. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో  8.85 జీపీఏతో పాసయ్యా. చివరి సెమిస్టర్‌లో టాపర్‌గా, కాలేజీలో గోల్డ్‌మెడల్‌ కూడా అందుకున్నా. అన్నట్లు చెప్పనేలేదు కదూ...నాకు ఎంబీఏ చేయాలన్న ఆలోచన చిన్నప్పుడే కలిగింది. అప్పట్లో తరచూ వ్యాసరచన పోటీల్లో పాల్గొనేదాన్ని. అలా ఒకసారి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై రాశాను. అప్పడే నాక్కూడా ఆర్థికవేత్తను కావాలనే ఆలోచన కలిగింది. అలానే ఐదేళ్ల వయసులో సోలార్‌ వ్యవస్థ మీద పదహారు పేజీల వ్యాసం రాశా. అది చదివిన అబ్దుల్‌కలాం నన్ను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో నేను చేయగలననే నమ్మకం మరింత నమ్మకం కలిగింది.  
ఇష్టంతో చదివా... 
బీటెక్‌ అయిపోయాక నాకు ప్రిపరేషన్‌కి కేవలం వందరోజులు మాత్రమే మిగిలాయి. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నా. ఈ క్యాట్‌ పరీక్షలో మూడు రకాల కేటగిరీలు ఉంటాయి. వెర్బల్‌ ఎబిలిటీ..లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటివ్‌ ఎబిలిటీ...మూడింటిలోనూ మంచి మార్కులు వస్తేనే స్కోర్‌ సాధించేది. అందుకే వాటిని అభివృద్ధి చేసుకోవడానికి కొంత శిక్షణ తీసుకున్నా. ఇంకొంత నేనే సొంతంగా సాధన చేశా. అయితే ఇంతసేపు చదవాలని ప్రత్యేకంగా నియమం ఏమీ పెట్టుకోలేదు. చదివిన గంట ఏకాగ్రతతో చదివేదాన్ని. పుస్తకాలు ఎక్కువ చదువుతా. ఒత్తిడి లేకుండా ప్రణాళికతో చదవడమే నా ప్రత్యేకత. దానికి నా జ్ఞాపకశక్తి తోడయ్యింది. ఏ రోజు చెప్పింది. ఆ రోజే చదువుకోవడం వల్ల చదువు కష్టంగా అనిపించదు. నిజానికి నేనెప్పుడూ రాత్రంతా కూర్చుని చదివిందీ లేదు. ఎప్పుడైనా అదేపనిగా చదువుతున్నప్పుడు బోర్‌ కొడితే నాకెంతో ఇష్టమైన షటిల్‌ ఆడేదాన్ని. దానివల్ల నా ఏకాగ్రత మెరుగుపడేది. చివరికి ఇలా క్యాట్‌ పరీక్ష రాసి మూడు విభాగాల్లో 92 పర్సంటైల్‌, మొత్తంగా 95.95 పర్సంటైల్‌ అందుకున్నా. నిజానికి చిన్న వయసులో, పెద్దవాళ్లతో కలిసి చదువుతుంటే మొదట్లో అంతా కొత్తగా చూసేవారు. క్రమంగా వయసు భేదం ఉన్నా...నాకెప్పుడూ ఆ భావన కలగకుండా లెక్చరర్లు, తోటి విద్యార్థులు నాకు సాయపడేవారు. చదువుతోపాటు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. 


                    బాధ్యతలు తీసుకోవాలనే...                
- జుహీ

క్యాట్‌ కొట్టేశాం...

ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తామో! దాని పొందే పద్ధతుల విషయంలోనూ అంతే పక్కాగా ఉండాలి. అందుకే లక్ష్యం నిర్దేశించుకున్న తరువాత దాన్నే లోకంగా మార్చేసుకుంటా. ప్రస్తుతం నేను పెట్టుకున్న లక్ష్యం క్యాట్‌లో మంచి ర్యాంకు సాధించడం. మంచి కాలేజీలో మార్కెటింగ్‌లో ఎంబీఏ చేయడం. దానిలో మొదటి లక్ష్యం క్యాట్‌లో 98.97 పర్సంటైల్‌తో అందుకున్నందుకు సంతోషంగా ఉంది. మాది హైదరాబాద్‌.  నేను ఇప్పటికే బీఆర్క్‌ పూర్తిచేశాను. నాన్న సునీల్‌ కుమార్‌ మార్కెటింగ్‌ కన్సల్టెంట్‌.  ఆయనకు సొంతంగా ఓ సంస్థ ఉంది. అమ్మ కృష్ణశ్రీ గృహిణి. మొదటి నుంచీ నాకు కళలంటే అంటే ప్రత్యేక శ్రద్ధ. అందుకే కెరీర్‌గా బీఆర్క్‌ని ఎంచుకున్నా. అందుకోసం ‘స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌’ భోపాల్‌లో సీటు సంపాదించి చేరిపోయా. చదువయ్యాక హైదరాబాద్‌ వచ్చి నాన్న సంస్థలోనే ఉద్యోగంలో చేరా. చదువుకునేటప్పుడు  వివిధ ఫెస్ట్‌ల నిర్వహణలో కీలకంగా పనిచేశా. స్పాన్సర్లను ఒప్పించడం, మానవవనరుల్ని సమర్థంగా వినియోగించుకోవడం వంటివన్నీ...మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలపై నాకు ఆసక్తిని కలిగించాయి. దానికి తోడు హైదరాబాద్‌ వచ్చాక ‘యువత’ అనే ఎన్‌జీవోలో డైరెక్టర్‌గా చేరా. సుమారు ఆరు అనాథాశ్రమాల  బాధ్యతల్ని తీసుకున్నా. ఈ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఎంత అవసరమో అర్థమయ్యింది. మరోపక్క నాన్న సంస్థలోకి వచ్చాక సంస్థ మేనేజ్‌మెంట్‌ అంశాలపై అవగాహన, దానితో పాటే ఆసక్తీ పెరిగాయి. అలా ఎంబీఏ (మార్కెటింగ్‌)  చేయాలనే లక్ష్యం ఏర్పడింది. అయితే అది మామూలుగా ఏదో ఒక కాలేజీలో కాకుండా, అంతా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఐఎమ్‌లో చదవాలనుకున్నా. 

మాక్‌ టెస్ట్‌లు రాస్తూ...  
అనుకున్నదే తడవుగా సాధన మొదలుపెట్టా. తక్కువ సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రణాళికాబద్ధంగా చదవడం వల్లే క్యాట్‌లో ఈ స్కోర్‌ సాధ్యమైంది. దీనిలోని మూడు విభాగాల్లో వెర్బల్‌ టెస్ట్‌ విషయంలో ఇబ్బంది లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచీ ఆంగ్లంపై పట్టు ఉంది. అలాని అదొక్కటే సరిపోదు. లాజికల్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ వంటివాటిపైనా పూర్తిస్థాయి అవగాహన అవసరం. అందుకోసం కొన్నాళ్లు కోచింగ్‌ తీసుకున్నా. ఓ పక్కన ఉద్యోగం చేస్తూనే చదవడం మొదలుపెట్టా. రోజూ మూడు గంటల పాటు ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్ట్‌లు రాసేదాన్ని. దాంతో ఏ సమయాన్ని దేనికి కేటాయించుకోవాలో? ఎంత వేగంగా పూర్తిచేయగలుగుతున్నానో వంటివన్నీ తెలిశాయి. ఇలా రోజు మొత్తంలో ఐదారు గంటల సమయాన్ని చదువుకోసం కేటాయించేదాన్ని. నిజానికి నా ఉద్దేశంలో చదువుని బట్టీ పట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. దాన్ని ఇష్టంతోనే చదవాలి. అలాని చదువంటే ...పుస్తకాలకే పరిమితం కాదనేది నా అభిప్రాయం. అందుకే ఆంగ్ల నవలలు, వార్తాపత్రికలు క్రమం తప్పకుండా చదువుతా. ఇవన్నీ పదసంపద, పరిజ్ఞానం పెంచాయి. క్యాట్‌ ఫలితాల్లో వెర్బల్‌లో 99 పర్సంటైల్‌ సాధించా. మొత్తం 98.97 పర్సంటైల్‌తో మంచి కాలేజీలో సీటు సంపాదించుకునే అర్హత అందుకున్నా. 

- స్వాతి కొరపాటి


మరిన్ని