close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
గ్రామాన్ని కాపాడాలని...

ఈ అమ్మాయి వయసు 17 ఏళ్లే. అయితేనేం... తమ గ్రామంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా గురించి ఓ వీడియోను సోషల్‌ మీడియాలో ఉంచింది. ఇది వైరల్‌ కావడమే కాదు, ‘నేషనల్‌ ట్రిబ్యునల్‌ యాక్ట్‌ (ఎన్‌టీఏ) ’దృష్టికి వెళ్లింది. తక్షణం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కొల్లం జిల్లా యంత్రాంగాన్ని ఎన్‌టీఏ ఆదేశించింది. 

గ్రామాన్ని కాపాడాలని...

కేరళ, అలప్పాడ్‌కు గ్రామానికి చెందిన ఎస్‌.కావ్య 12వ తరగతి చదువుతోంది. దక్షిణ కేరళలో కొల్లం, అలపుళా తీరం వెంబడి అలప్పాడ్‌ సహా పలు గ్రామాలున్నాయి. ఈ ప్రాంతాల్లో విలువైన ఖనిజాలుండే నల్లమట్టి, ఇసుక అధికం. వీటిని గత 50 ఏళ్లుగా అక్రమంగా తరలి స్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇప్పటికే చాలా ప్రాంతాలు నిర్జీవంగా మారాయి. ఇదే కొనసాగితే తాము నివసించే ప్రాంతాలన్నీ కూడా భవిష్యత్తులో భారతదేశ పటంలో కనిపించకుండా పోతాయంటుంది కావ్య. ‘ఈ అక్రమ రవాణాను ఆపడానికి స్థానికులు గతంలో చాలా ప్రయత్నించారు. పలు పోరాటాలకు కూడా దిగారు. అయితే ప్రభుత్వం   నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇలా ఇసుకను అక్రమంగా తరలించుకుంటూ పోతే... పర్యావరణానికి హాని. దీనికి సంబంధించి నేను ఏదైనా చేయగలనా అని ఆలోచించా. ప్రస్తుతం సోషల్‌మీడియా అన్నింటికీ వేదిక కాబట్టి దాని ద్వారా మా ఊరి సమస్యను ప్రపంచానికి తెలియజేయాలనుకున్నా. ఇక్కడ జరుగుతున్న సమస్యని వీడియో తీశా. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ ప్రాంతాన్ని రక్షించాలని కోరా. ఇక్కడ చేపల వేటనే ఉపాధిగా చేసుకుని బతుకుతున్న వేలాదిమందిని కూడా ప్రభుత్వమే కాపాడాలని అభ్యర్ధించా. ఈ వీడియోని సోషల్‌మీడియాలో పొందుపరిచా. దీనిని చూసిన వారిని షేర్‌ చేయాలని కోరా. చాలామంది చూడటమే కాదు, షేర్‌ కూడా చేశారు. అలా అది వైరల్‌ అయ్యింది. ఈ వీడియోనే కేరళ న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. దీంతోపాటు ‘నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌’ కూడా స్పందించింది. జిల్లా యంత్రాంగం నుంచి తక్షణం నివేదికను కోరింది. నెలలోపు ఈ అంశంపై పూర్తి వివరాలతో నివేదిక అడగడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా వూరికే కాదు, తీర ప్రాంతంలో ఉండే గ్రామాలన్నీ పర్యావరణపరంగా కాపాడాలనేదే నా లక్ష్యం’ అని చెబుతుంది కావ్య.


మరిన్ని