close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
దాల్చినచెక్క చూర్ణం... సైనస్‌ దూరం

ఇంటి వైద్యం

దాల్చినచెక్క చూర్ణం... సైనస్‌ దూరం

సైనస్‌... చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ సమస్య ఇంకాస్త ఎక్కువగానే బాధిస్తుంది. మరి దాన్ని అదుపులో ఉంచాలంటే ఏం చేయాలో చూద్దామా...
సైనస్‌లనేవి ముక్కుకి సంబంధించిన గాలి గదులు. ముక్కుకి రెండు వైపులా, కనుబొమ్మలపైనా, కిందా... మొత్తం ఆరుంటాయి. వీటిల్లో తడి ఉండదు. కొంతమందికి మాత్రం వీటిల్లో కఫం చేరుతుంది. అలా అవి బ్లాక్‌ అవుతాయి. ఇలా కఫం చేరినప్పుడు వైరస్‌, ఫంగస్‌, బ్యాక్టీరియా వంటివి అక్కడ చేరి ఇన్‌ఫెక్షన్‌ ఎదురవుతుంది.  కొందరిలో అకస్మాత్తుగా ఈ సమస్య మొదలై 10 లేదా 15 రోజుల్లో తగ్గిపోతుంది. కొంతమందిలో మాత్రం దీర్ఘకాలం బాధిస్తుంది. కఫ ప్రకృతి ఉన్నవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. తరచూ జలుబు చేస్తే, అలాగే ముక్కులో కంతులు ఉన్నప్పుడు, రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్నవారికి, అలర్జీలు ఉన్నవారికి సైనసైటిస్‌ వచ్చే అవకాశాలెక్కువ.

దాల్చినచెక్క చూర్ణం... సైనస్‌ దూరం

జాగ్రత్తలు
ముఖ భాగమంతా, అలాగే కనుబొమ్మలపైన నొప్పి అధికంగా ఉంటుంది. ముక్కు మూసుకుపోవడం, దగ్గు, జ్వరం, నోటి దుర్వాసన, అలసట, తలనొప్పి వంటి లక్షణాలూ కనిపిస్తాయి. తరచూ ఈ సమస్యకు గురయ్యేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కఫాన్ని తగ్గించే వెల్లుల్లి, అల్లం, మిరియాలను ఆహారంలో వాడాలి. నిత్యం పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిది. కఫాన్ని పెంచే గుణమున్న చల్లని, తీపి పదార్థాలు, చాక్లెట్లు, కేకులు, పెరుగు, పాయసం, పాల పదార్థాలు తగ్గించాలి. చల్లగాలిలో, వానలో తిరగకూడదు. తరచూ వేడి నీటిని తాగుతూ ఉండాలి. ముఖానికి ఆవిరి పడుతూ ఉండాలి.

దాల్చినచెక్క చూర్ణం... సైనస్‌ దూరం


ఇంటి వైద్యం
* ఆవనూనెను గోరువెచ్చగా చేసి, రెండు లేదా మూడు చుక్కలను ముక్కులో వేసుకుని, 10 నిమిషాల తరువాత ముఖంపై చేతులతో మర్దన చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
దాల్చినచెక్క చూర్ణం... సైనస్‌ దూరం* వేడి నీళ్లల్లో కొన్ని చుక్కలు యూకలిప్టస్‌ నూనె వేసి, ఆవిరి పడితే ముక్కు తెరుచుకుని తేలికగా ఊపిరి తీసుకోవచ్చు.
* అయిదు గ్రాముల వస కొమ్ము చూర్ణం, 20 మి.లీ. నువ్వుల నూనెను 80 మి.లీ నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని సన్నటి మంటపై కాచి, నూనె మాత్రమే మిగిలేలా చూసి వడబోయాలి. ఈ నూనెను ముక్కులో రెండు లేదా మూడు చుక్కల చొప్పున వేసుకుంటూంటే సమస్య తగ్గుతుంది.
* దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, తులసి ఆకులను సమానంగా తీసుకుని పొడి చేసి కప్పు నీళ్లల్లో అరచెంచా పొడి వేసి టీలా చేయాలి. దీన్ని వేడివేడిగా తాగాలి. అలా రెండు లేదా మూడు వారాలపాటు ప్రతీరోజూ తీసుకుంటే సైనసైటిస్‌ తగ్గుతుంది.
* కప్పు పాలల్లో అర చెంచా శొంఠి పొడి వేసి బాగా కాసి, వేడివేడిగా తాగితే... సైనస్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది.
మీ ప్రశ్నలు ఇకపై ‌vasuayur @eenadu.net కు పంపించగలరు.


మరిన్ని