close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నాన్న మాట...సీఏ బాట

గెలవాలనే ఆశలేకపోతే ఆటకు ముందే ఓడిపోతాం’. ఈ సూత్రమే తన విజయ రహస్యం అంటుంది గుంటూరుకు చెందిన కమటం విజయలక్ష్మి. సీఏ (ఛార్టెడ్‌ అకౌంటెన్సీ) ఫైనల్స్‌లో అఖిలభారత నాలుగో ర్యాంకు, దక్షిణభారత దేశంలో మొదటిర్యాంకు సొంతం చేసుకున్న ఆమె... ఇందుకోసం పోరాటమే చేసింది. కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమైనా... ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఆమె విజయరహస్యం విజయ మాటల్లోనే చదువుదాం రండి.

అఖిలభారత స్థాయిలో నాలుగో ర్యాంకు, దక్షిణభారత దేశంలో మొదటిర్యాంకు వచ్చిందంటే... ఇది నా ఒక్కదాని శ్రమ మాత్రమే కాదు. నేను కేవలం చదివానంతే. నా వెనుక అమ్మానాన్నల కష్టం, త్యాగం ఎంత ఉందో చెప్పలేను. పిల్లలు ఉన్నత చదువులు చదివితే...తమలా కష్టపడక్కర్లేదనే వారి ఆలోచన, తపన మమ్మల్ని ఈ స్థాయికి చేర్చాయి. మాది గుంటూరు. నాకు అక్క, తమ్ముడు ఉన్నారు. మా ముగ్గురి లక్ష్యాలు ఒకటే... సీఏ కావడం. దానికి కారణం ఒకవిధంగా నాన్నే. ఆరు నెలల క్రితం అక్క సీఏ పూర్తిచేసి ఉద్యోగంలో చేరింది. నేను ఇప్పుడు నా గమ్యాన్ని చేరుకున్నా. తమ్ముడు ఐపీసీసీ పూర్తిచేసి ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు.

స్కాలర్‌షిప్‌ సాయంతో...
నాన్న రమేష్‌ పెద్దగా చదువుకోలేదు. అయితేనేం మమ్మల్ని ఉన్నతంగా చదివించాలనుకున్నారు. అలాగని ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటివాటి వైపు ప్రోత్సహించే తాహతు లేదు. దానికి కారణం ఆర్థిక సమస్యలే. ఆయన పదిహేనేళ్లుగా ఓ బేకరీలో పని చేస్తున్నారు. అదీ చిరుద్యోగమే. ఇంటికి ఆయనే జీవనాధారం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరిని లేదా ఇద్దరిని బాగా చదివించి, మరొకరిని నిర్లక్ష్యం చేయడం ఆయనకు ఇష్టంలేదు. అందుకే ముగ్గురికీ న్యాయం చేయాలనుకున్నారు. మా చదువు ఉన్నతంగా ఉండాలి, తక్కువ ఖర్చులో అయిపోవాలని అనుకున్నారట. నాన్నకు సీఏ గురించి తెలియడంతో... పదో తరగతి పూర్తయ్యేటప్పుడు మా ముగ్గురికీ దాని గురించి చెప్పేవారు. ‘చిన్న చదువు, పెద్ద చదువు అనేది ఏదీ లేదు. ఏ చదువు కష్టం కాదు, తేలిక కాదు. కష్టపడితే గుర్తింపు వస్తుంది. చదువే మీ ఆస్తి’ అని వివరిస్తూనే మాలో స్ఫూర్తిని పెంచారు. అలా అక్క, నేను, తమ్ముడు ఇటువైపు వచ్చాం. అలాని ఆయన ఏ రోజూ మమ్మల్ని బలవంతం చేయలేదు. ఇటువైపు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరించేవారంతే. ఎన్ని కష్టాలు పడైనా సరే... చదివిస్తానని చెప్పేవారు. చిన్నప్పటినుంచీ ఆయన మాటలు మమ్మల్నెంతో ప్రభావితం చేశాయి. దాంతో మేం కూడా చదువుల్లో ముందుండేవాళ్లం. నేను పదో తరగతిలో 9.5 శాతం మార్కులతో పాసయ్యా. ఆ తరువాత కాలేజీవాళ్లు కొంత ఫీజు రాయితీ ఇచ్చారు. స్కాలర్‌షిప్పులూ వచ్చాయి. ఇంటర్‌ ఎంఈసీ శ్రీమేధలో చేరా. అక్కడే సీఏ సీపీటీ, ఐపీసీసీ పూర్తయ్యింది. ఆర్టికల్స్‌ ఉమామహేశ్వరావు అండ్‌ కంపెనీలో ఆర్టికల్స్‌ పూర్తి చేస్తూనే మాస్టర్‌మైండ్స్‌లో శిక్షణ తీసుకున్నా.

పాకెట్‌మనీ కూడా దాచిపెట్టి...!
ముగ్గురు పిల్లల్ని చదివించాలంటే మాటలేం కాదని, కాస్త పెద్దయ్యేకొద్దీ మాకు అర్థమైంది. నాన్న నెలంతా కష్టపడితే వచ్చే ఆదాయాన్ని అమ్మ అరుణకుమారి చాలా జాగ్రత్తగా వాడేది. ఆయన సంపాదనకు వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడు అనుకుంటూ మిషన్‌ కుట్టేది. అలా వచ్చిన మొత్తంతో వారిద్దరూ తిన్నా తినకపోయినా ప్రతి రూపాయినీ మా చదువులకోసం దాచిపెట్టేవారు. వాళ్లకోసం ఓ రూపాయి ఖర్చుపెట్టుకోవాలంటే... ఆలోచించేవారు. కాలేజీకి  ఆయనే తీసుకెళ్లి, తీసుకొచ్చేవారు. ఆ కష్టం చూసి నాకు బాధేసేది. దాంతో పాకెట్‌మనీగా ఓ వందా, రెండొందలు ఇచ్చినా దాచుకునేదాన్ని. నాన్న అవి చూసి ‘మరీ అంత పొదుపు అక్కర్లేదు. అవసరం అయితే వాడుకో...’ అనేవారు. డబ్బు అవసరం ఎంతో, దాని విలువ తెలుసు కాబట్టి ఆచీతూచే ఖర్చు చేసేదాన్ని. అక్కా, తమ్ముడు కూడా అంతే. అమ్మావాళ్లు కూడా ఏ ఖర్చులు పెట్టుకునేవాళ్లు కాదు. మేమే లోకం అనుకునేవాళ్లు. మేం నలుగురితో సమానంగా ఉండాలని చూసేవాళ్లు. మంచి బట్టలు, పుస్తకాలు, తిండి, చెప్పులు.. అన్నీ మా కోసమే. వాళ్లు మాత్రం తక్కువ ఖరీదులో కొనుక్కునేవాళ్లు. వాళ్లకంటూ ఏ సరదాలు ఉండేవి కావు. నాన్న బయట అసలు తినేవారు కాదు. టిఫిన్‌, భోజనం అన్నీ ఇంట్లోనే. అవసరం అయితేనే రూపాయి ఖర్చుచేసేవారు. అమ్మ కూడా అంతే. ఇద్దరూ ఒక్కమాట మీద ఉండి... మమ్మల్ని తీర్చిదిద్దారు.

గంట చదివినా...

మొదటి నుంచీ నాకు అర్థం చేసుకుంటూ చదవడమే అలవాటు. ఎప్పుడూ ఏ పాఠాన్నీ బట్టీపట్టేదాన్ని కాదు. తరగతి గదిలో విన్న పాఠాలు అయినా, నేను ప్రణాళికలో పెట్టుకున్న అంశాలు అయినా సరే! ఏ రోజుకారోజు ఆ షెడ్యూల్‌ని పూర్తి చేసేదాన్ని.  ఓ గంట అయినా సరే... ఏకాగ్రతతో చదివేదాన్ని. ఏ కాస్త ఖాళీ దొరికినా అమ్మకు వంటపనిలో సాయపడటం, కాస్త ఒత్తిడిగా అనిపించినప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పడం ద్వారా ఉపశమనం పొందేదాన్ని.   ఇప్పుడు నేను, అక్క సీఏ పూర్తిచేశాం. తమ్ముడు అదే పనిలో ఉన్నాడు. 

విజేత

మా పరిస్థితి చూసి కొందరు బంధువులు రకరకాల మాటలు అనేవారు. ‘నీకు  ఇద్దరు ఆడపిల్లలు. ఉన్నదంతా వాళ్ల చదువులకే ఖర్చు చేస్తే... పెళ్లి ఎలా చేస్తావు. డబ్బులేని   వాళ్లకు చదువులెందుకు. పైగా సీఏ అంటే మాటలు కాదు. చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆ డబ్బును వాళ్ల పెళ్లి కోసం దాచడం మంచిది’ అని అనేవారు. కానీ అమ్మానాన్నలు ఆ మాటలకు ప్రభావితం కాలేదు. ఆడా, మగా అనే తేడా లేకుండా మమ్మల్ని సమానంగా చదివించారు. అందుకే మేం ఈ స్థాయికి చేరగలిగాం. అయితే మా ర్యాంకులు చూసి క్రమంగా బంధువుల్లోనూ మార్పు వచ్చింది. ఇప్పుడు ‘మంచి నిర్ణయం తీసుకున్నారు. బాగా చదివించారు. వాళ్లకంటూ జీవితం ఇచ్చారు...’ అని మెచ్చుకుంటున్నారు. ఇంతకన్నా కావాల్సిందేముంటుంది. కొందరు మాత్రం మా కష్టాన్ని చూసి డబ్బు సాయం చేసేవారు. నాన్న మరో పని కూడా చేశారు. పదో తరగతి పూర్తవడం ఆలస్యం. మా ముగ్గురికీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. మాకు వచ్చిన స్కాలర్‌షిప్‌లు అందులోనే జమేసేవారు. అలాగే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి మేం బాగా చదువుకుంటున్నామని ఏ కాస్త డబ్బు ఇచ్చినా... మా అకౌంటులోనే వేసేవారు. ఇంట్లో సమస్యలు ఉన్నా... ఒక్కరూపాయి తీసుకొనేవారు కాదు...’. 
 


 - స్వాతి కొరపాటి
 


మరిన్ని