close

బిజినెస్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కొవిడ్‌కు ఆర్థిక చికిత్స

వ్యక్తులు, చిన్న వ్యాపారులకు ఊరట
 రుణ పునర్నిర్మాణానికి అవకాశం
టీకా తయారీ కంపెనీలు, ఆసుపత్రులకు రూ.50,000 కోట్లు

భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకునే దశలో ఉన్నపుడు కరోనా రెండో దశ రూపంలో కొత్త సంక్షోభం వచ్చింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాం. కరోనాతో దెబ్బతిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి సంప్రదాయేతర ఆర్థిక సాధనాలను ఉపయోగించడానికీ వెనుకాడం. ప్రభుత్వంతో కలిసి పౌరులపై ఒత్తిడి తగ్గిస్తాం. ఈ ఏడాదంతా పెద్ద, చిన్న అడుగులు వేస్తూ ఒత్తిడిని ఎదుర్కొంటాం. ఆర్థిక పరిస్థితులను మెరుగ్గా ఉంచడానికి, మార్కెట్లు సమర్థంగా పనిచేయడానికి అవసరమైన చర్యలకు ఆర్‌బీఐ ఎపుడూ సిద్ధంగా ఉంటుంది. అంతర్జాతీయ వృద్ధి అంచనాలు మాత్రం అధిక అనిశ్చితితో కనిపిస్తున్నాయి. సాధారణ వర్షపాతం అంచనాల నేపథ్యంలో ఆహార ధరలు అంతగా పెరగకపోవచ్చు.

- ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

 

ముంబయి: కరోనా కారణంగా దిగాలు పడుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నడుం బిగించింది. కొద్దికాలంగా బ్యాంకర్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లతో సమావేశాలు నిర్వహించిన ఆర్‌బీఐ బుధవారం పలు నిర్ణయాలు ప్రకటించింది. రుణాలు చెల్లించడానికి వ్యక్తులు, చిన్న వ్యాపారులకు మరింత సమయం ఇచ్చింది.  టీకా తయారీదార్లు, ఆసుపత్రులు, ఆరోగ్య మౌలిక వసతులకు ప్రాధాన్యతా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అనుమతులు ఇచ్చింది. బాండ్ల కొనుగోలుకు క్యాలెండర్‌ను ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకారం..

రెండేళ్ల వెసులుబాటు
2020లో రుణ పునర్నిర్మాణం చేయని వ్యక్తులు, చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు రెండేళ్ల పాటు రుణ పునర్నిర్మాణం చేసుకోడానికి ఆర్‌బీఐ అవకాశం ఇచ్చింది. మార్చి 2021 నాటికి వారి ఖాతాలు ‘ప్రామాణికం’గా వర్గీకరించి ఉండాలి. మొత్తం రూ.25 కోట్ల వరకు రుణాలున్న వారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. అంతక్రితమే రుణ పునర్నిర్మాణ సదుపాయాన్ని వినియోగించుకుని ఉంటే, ప్రణాళికలను సవరించడానికి, మారటోరియం గడువును పెంచడానికి బ్యాంకులకు అనుమతులు ఇచ్చింది. గతేడాది ఆగస్టులోనూ ఆర్‌బీఐ ఈ తరహా పథకాన్ని ప్రకటించింది.
బ్యాంకులూ.. వారికి రుణాలివ్వండి
బ్యాంకులకు ఆర్‌బీఐ రూ.50,000 కోట్ల ద్రవ్యలభ్యతను అందించనుంది. ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన టీకా తయారీదార్లు, టీకా-ముఖ్యమైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకునేవారు, సరఫరా చేసే వారికి, ఆసుపత్రులకు, ఇతరత్రా ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులకు ఈ మొత్తాన్ని తాజా రుణాల రూపంలో అందించాలని తెలిపింది. మూడేళ్ల వ్యవధి ఉండే ఈ రుణాలను రెపో రేటు వద్ద పొందొచ్చు. మార్చి 31, 2022 వరకు అందుబాటులో ఇవి ఉంటాయి. ఒక ‘కొవిడ్‌ రుణ పుస్తకాన్ని’ ఈ పథకం కింద సృష్టించుకోవాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.
రూ.35,000 కోట్ల బాండ్ల కొనుగోలు
గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌ అక్విజిషన్‌ ప్రోగ్రామ్‌(జి-ఎస్‌ఏపీ) కింద ఆర్‌బీఐ రూ.35,000 కోట్ల విలువైన బాండ్లను వరుసగా రెండో నెలా(మే 20న) కొనుగోలు చేయనుంది. ఏప్రిల్‌ 15న కూడా    రూ.25,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను ఆర్‌బీఐ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చిన్న బ్యాంకుల(ఎస్‌ఎఫ్‌బీ)కు ప్రత్యేకంగా మూడేళ్ల రెపో కార్యకలాపాలకు రూ.10,000 కోట్లు సమకూర్చనుంది. ఈ సదుపాయం అక్టోబరు 31, 2021 వరకు అందుబాటులో ఉంటుంది. బ్యాంకులు మొండి బకాయిల కోసం డిసెంబరు 31, 2020 నాటికి పక్కన పెట్టిన నిధులను 100 శాతం మేర వినియోగించుకోవచ్చు.
కేవైసీ, ఓవర్‌డ్రాఫ్ట్‌
కేవైసీ(మీ వినియోగదారు గురించి తెలుసుకో) నిబంధనలను సడలించారు. కొన్ని విభాగాలకు వీడియో ఆధారిత కేవైసీకి అనుమతులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబరు 30 వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు నిబంధనలను సైతం సడలించారు.
గిరాకీ మరీ ఎక్కువగా క్షీణించకపోవచ్చు
ఆహార వస్తువులు, ముడి పదార్థాల ధరల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఈ సారి సాధారణ వర్షపాతం అంచనాల మధ్య ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెద్దగా ఉండకపోవచ్చన్నది ఆర్‌బీఐ అంచనా.‘గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సమయంతో పోలిస్తే ఈ సారి వ్యాపారులు, వ్యక్తులు లాక్‌డౌన్‌ చర్యలకు అలవాటు పడ్డారు. అప్పటితో పోలిస్తే గిరాకీ భారీగా ఏమీ క్షీణించకపోవచ్చ’ని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. రిటైల్‌, ఆతిథ్య రంగాల గిరాకీలో తాత్కాలిక క్షీణత కనిపించొచ్చన్నారు.  
250 మంది సభ్యులతో కార్యకలాపాలు
ఒక బలమైన క్వారంటైన్‌ కేంద్రంలో 250 మంది సభ్యులతో కీలక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. ఇంటికి దూరంగా ఉంటూ వీరంతా సేవలందిస్తున్నట్లు తెలిపారు.కొవిడ్‌ ప్రారంభమైన గతేడాది మార్చిలోనే ఒక వార్‌-రూమ్‌ తరహా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.  
*  ‘కొవిడ్‌ 2.0పై పోరాటానికి ఆర్‌బీఐ తగు చర్యలు తీసుకుంది. జీవితాలను కాపాడడడంపై స్పష్టమైన దృస్టి సారించింద’ని సీఐఐ అధ్యక్షుడు ఉదయ్‌ కోటక్‌ పేర్కొన్నారు. ‘తమ రుణ స్వీకర్తలలో 90 శాతం మంది తాజా పునర్నిర్మాణం పరిధిలోకి వస్తార’ని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది.

 

‘తొసిలిజుమ్యాబ్‌’పై క్లినికల్‌ పరీక్షలకు అనుమతి కోరిన హెటెరో!'

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 తో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులకు ఇస్తున్న తొసిలిజుమ్యాబ్‌ ఔషధాన్ని మనదేశంలో తయారు చేయడానికి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ కంపెనీ హెటెరో ఫార్మా సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ ఔషధంపై మనదేశంలో క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) కు దరఖాస్తు చేసినట్లు సమాచారం. అనుమతి లభించిన వెంటనే క్లినికల్‌ పరీక్షలు నిర్వహించి, ఈ ఔషధాన్ని తయారు చేయడానికి అవసరమైన సన్నాహాలను హెటెరో చేపట్టినట్లు తెలిసింది. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్‌-19 బాధితులకు ఇచ్చే ఫావిపిరవిర్‌ ఔషధాన్ని హెటెరో ఉత్పత్తి చేస్తోంది. అమెరికా సంస్థ అయిన గిలీడ్‌ సైన్సెస్‌తో ఒప్పందం కుదుర్చుకుని రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని  తయారు చేస్తోంది. ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చిన వారికి రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని ఇస్తున్నారు. ఆ తర్వాత తొసిలిజుమ్యాబ్‌ ఔషధాన్ని కొందరు వైద్యులు సిఫారసు చేస్తున్నారు.  స్విస్‌ కంపెనీ అయిన రోష్‌, ‘యాక్టెమ్రా’ అనే బ్రాండు పేరుతో తొసిలిజుమ్యాబ్‌ ఔషధాన్ని సరఫరా చేస్తోంది. యాంటీ- ఐఎల్‌-6 రిసెప్టర్‌ థెరపీలో దీన్ని ప్రధానంగా వినియోగిస్తారు. ఈ ఔషధాన్ని మనదేశానికి చెందిన సిప్లా లిమిటెడ్‌ దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది. కొవిడ్‌-19 మహమ్మారి ముప్పు ఎంతో అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఔషధానికి గిరాకీ బాగా పెరిగింది. ఈ ఔషధం కోసం బాధితుల తరపు బంధువులు ఎక్కడెక్కడో వెతుక్కోవడం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీన్ని తయారీకి దేశీయ ఫార్మా కంపెనీ అయిన హెటెరో సిద్ధపడటం ఆసక్తికర పరిణామంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
 

‘బారిసిటినిబ్‌’ ట్యాబ్లెట్ల తయారీకి దేశీయ కంపెనీలతో ‘లైసెన్సింగ్‌’ ఒప్పందాలు
ఎలి లిల్లీ వెల్లడి

దిల్లీ: కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించే ‘బారిసిటినిబ్‌’ ట్యాబ్లెట్లను రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేకుండా ‘వాలంటరీ లైసెన్సింగ్‌ ఒప్పందాల’ ద్వారా భారతదేశానికి అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బహుళ ఔషధ జాతి సంస్థ ఎలి లిల్లీ పేర్కొంది. ఈ విషయంలో కొన్ని భారతీయ ఫార్మా కంపెనీలు సంప్రదింపులు చేపట్టినట్లు వివరించింది. ప్రభుత్వానికి వెంటనే 4 లక్షల బారిసిటినిబ్‌ ట్యాబ్లెట్లను విరాళంగా ఇస్తామని, దీన్ని ప్రభుత్వం  ఆసుపత్రులకు సరఫరా చేయొచ్చని తెలిపింది. ఈ ఔషధాన్ని 2ఎంజీ, 4ఎంజీ డోసుల్లో విక్రయించడానికి ఎలి లిల్లీకి మనదేశంలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ ఔషధాన్ని రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ చికిత్సలో వినియోగిస్తున్నారు. కొవిడ్‌-19తో వ్యాధి ముదిరి, ఆస్పత్రుల పాలై, ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిన బాధితులకు బారిసిటినిబ్‌ ఔషధం ఇస్తే, వారు త్వరగా కోలుకునే అవకాశం ఏర్పడుతుందని వైద్యులు భావిస్తున్నారు. ఈ ఔషధానికే దేశీయ ఫార్మా కంపెనీ అయిన నాట్కో ఫార్మా, సీడీఎస్‌సీఓ నుంచి అత్యసవర అనుమతి సంపాదించిన విషయం తెలిసిందే.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.