close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆరోగ్యాన్ని పెంచుకుందాం

‘పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు’ అనేది సామెత. పనికిరాదు అంటే దాని విలువను గుర్తించకపోవడమో, ఔషధ గుణాలు తెలియకపోవడమో అయ్యుండొచ్చు. దాంతో అవసరం అయినప్పుడు వేరే చోటకు పరుగెడుతుంటాం. కానీ కొన్ని సమస్యలు పెరటి మొక్కలతో కూడా తగ్గించుకోవచ్చు. అలా తేలికగా పెంచగలిగిన మొక్కలేమిటో చూద్దామా...

కరివేపాకు: ఇది ఆహారానికి సువాసనను ఇచ్చి రుచిని పెంచుతుంది. రుచిగా ఉంటే జీర్ణరసాలు బాగా ఊరతాయి. అలా జీర్ణశక్తి మెరుగవుతుంది. వాంతులు, కరివేపాకు వికారం, విరేచనాలను తగ్గిస్తుంది. రోజూ 15-20 ఆకులను నెమ్మదిగా నమిలి తింటే రక్తంలో చక్కెర శాతం, శరీర బరువు తగ్గుతాయి. కరివేపాకు వేసి కాచిన కొబ్బరినూనెను తలకు రాసుకుంటే జుట్టు నెరిసే సమస్య తగ్గుతుంది.

పుదీనా: కుండీలో తేలికగా పెరుగుతుందిది. పుదీనాను ఔషధాల ఖజానాగా చెప్పొచ్చు. జీర్ణాశయం చక్కగా పని చేయడానికి, పొట్టలో వాయువులు తయారుకాకుండా పుదీనా తోడ్పడుతుంది. దగ్గు, జలుబు, తలనొప్పిని తగ్గిస్తుంది. నీళ్లలో పుదీనా ఆకులు వేసి మరిగించి తాగితే చాలు... పై సమస్యలన్నీ అదుపులోకి వస్తాయి. పుదీనా రసాన్ని పై పూతగా వాడితే తలనొప్పి, కండరాల నొప్పి, పార్శ్వపు నొప్పి అదుపులోకి వస్తాయి.
కొత్తిమీర: మనం చేసుకునే ప్రతి కూరలో, చారులో కొద్దిగా కొత్తిమీర పడితేనే రుచి. దీన్ని పెరట్లో, కుండీలో ఎక్కడైనా తేలిగ్గా పెంచుకోవచ్చు. ఇది జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. కడుపులో వాయువులు తయారుకాకుండా తోడ్పడుతుంది. జీర్ణ మండలంలో చేరే రకరకాల బ్యాక్టీరియాలని నిరోధించే శక్తి కొత్తిమీరకు ఉంటుంది. కాబట్టి నిత్యం వంటల్లో కొత్తిమీరను ఎక్కువగా వాడాలి. సాధారణంగా వచ్చే కడుపు ఉబ్బరం సమస్యకు కొత్తిమీర మందు. గ్లాసు పల్చటి మజ్జిగలో రెండు మూడు చెంచాల కొత్తిమీర రసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
తమలపాకు: ఈ తీగను కుండీల్లో లేదా నేలలో కూడా పెంచుకోవచ్చు. తమలపాకు జీర్ణశక్తికి చాలా మంచిది. కడుపులో గ్యాస్‌ తయారుకాకుండా తోడ్పడుతుంది. భోజనం తరువాత రెండు తమలపాకులు నమిలితే తిన్న పదార్థాలు తేలిగ్గా జీర్ణమవుతాయి. కడుపు ఉబ్బరం లేకుండా ఉంటుంది. దగ్గు, జలుబులకు కూడా తమలపాకు మందులా పనిచేస్తుంది. ఆ సమస్యలతో బాధపడుతుంటే పెద్దవాళ్లయితే నెమ్మదిగా ఆకులు నమిలి, ఆ రసాన్ని మింగాలి. చిన్నపిల్లలకు తమలపాకు రసంలో తేనె కలిపి నాకిస్తే పై సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. శరీరం మీద గడ్డలు ఏర్పడినా, వక్షోజాల్లో బరువుగా అనిపించినా, నొప్పి ఉన్నా తమలపాకులపై కాస్త ఆముదం రాసి వేడి చేసి ఆ ఆకులను గడ్డల మీద, వక్షోజాల మీద పెడితే చాలు. ఉపశమనం ఉంటుంది.
మందార: రకరకాల మందారాలుంటాయి కదా! అయితే ఎర్రటి మందారంలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మందారం జుట్టుకు మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది. కుంకుడు కాయ రసంలో, మందార ఆకుల ముద్ద కలిపి తలంటుకుంటే జుట్టు పట్టు కుచ్చులా మారుతుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. మందార పూలతో కాచిన కొబ్బరినూనె మంచి హెయిర్‌ టానిక్‌లా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం, నెరవడం వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది. పేను కొరుకుడు సమస్య ఉన్న చోట కొన్ని రోజులపాటు మందార పూలను రుద్దుతుంటే అక్కడ తిరిగి జుట్టు వస్తుంది.
వాము: మందపాటి ఆకులతో ఉండే చిన్న మొక్క ఇది. దీన్ని కూడా ఇంట్లో తేలికగా పెంచుకోవచ్చు. వామాకు దగ్గు, జలుబు సమస్యలను సులువుగా నివారిస్తుంది. వామాకు రసం కడుపులో పోట్లు తగ్గిస్తుంది. దీన్ని చిన్న పిల్లలకు కూడా ఇవ్వొచ్చు. ముఖం మీద మొటిమలు పోవడానికి కూడా ఉపయోగపడుతుంది. తల నెరిసే సమస్యను కూడా వామాకు అదుపులో ఉంచుతుంది. గాయాలు మానడానికి, గాయాల తాలుకు మచ్చలు తగ్గించడానికీ దీన్ని వాడొచ్చు ఆహారం తిన్న తరువాత వామాకు నములుతూ ఉంటే జీర్ణశక్తి బాగుంటుంది.
తులసి:  ఇది అందరూ పెంచుకోవాల్సిన ఔషధ మొక్క. తులసిలో రకాలుంటాయి. కృష్ణ తులసిలో ఔషధ గుణాలు ఎక్కువ. దగ్గు, జలుబులకు అన్ని వయసుల వారికి మందులా పనిచేస్తుంది. తులసి ఆకుల రసం, తేనె కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, తగ్గుతాయి. వైరల్‌ జ్వరాలకు ఔషధంలా పని చేస్తుంది. ముఖం మీద వచ్చే శోభిÅ మచ్చలకు పై పూతలా తులసి రసం అద్భుతంగా పని చేస్తుంది.
కలబంద: చాలా తేలిగ్గా పెంచుకోగలిగే మొక్క.  ఇది లివర్‌కు టానిక్‌లా పనిచేస్తుంది. కామెర్ల సమస్య ఉన్నప్పుడు, కాలేయం పెరిగిన వారికి, రకరకాల జ్వరాల్లో ప్లీహం పెరిగినా ఇది చక్కటి ఔషధంలా ఉపయోగపడుతుంది. ఈ సమస్యలున్నవారు చెంచా కలబంద గుజ్జులో కాస్త అల్లం రసం, కాస్త నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే చాలు. నెలసరి సక్రమంగా రాని వారికి, ఆ సమయంలో కడుపు నొప్పి  తో బాధపడేవారికి కలబంద గుజ్జు మంచి మందు. ఈ గుజ్జును ముఖానికి రాసుకుంటే ముడతలు రాకుండా ఉంటాయి. జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా కలబంద సాయం చేస్తుంది.  
తుంచుతుంటేనే సువాసన వచ్చే కొత్తిమీరా, కరివేపాకు లేకపోతే వంట పూర్తికాదు. సువాసనలతోపాటు అరుగుదలను ప్రేరేపిస్తుంది పుదీనా. జలుబు, దగ్గు..  ఇలాంటి సాధారణ జబ్బులకు ఉత్తమమైన ఔషధంలా పనిచేస్తుంది తులసి. ఇలా మన చుట్టూ ఉండే మొక్కలే మనకు రుచి, రంగు, సువాసనలతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. కొత్తిమీరా, కరివేపాకు, వాము, తులసి, కలబంద, పుదీనా... ఈ మొక్కలన్నింటిని మీ పెరట్లో నాటుకుంటే ఎన్నో లాభాలు...

మరిన్ని