close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
స్టార్టప్‌ స్టేటస్‌ మార్చేసింది!
ఆ స్టార్టప్‌ వయసు నాలుగేళ్లే. కానీ దాని విలువ మాత్రం దాదాపు  970 మిలియన్ల డాలర్లు.  అంటే బిలియన్‌ డాలర్ల యూనికార్న్‌ స్థాయికి చేరుకుంది. ఆ సంస్థ పేరే ‘జిలింగో డాట్‌ కామ్‌’. దీన్ని ఆ స్థాయికి చేర్చడం వెనుక సంస్థ సహవ్యవస్థాపకురాలు  అంకితి బోస్‌ కృషి ఎంతో ఉంది. ఇంతకీ ఆమె ఎవరు? ఇటువైపు ఎలా వచ్చిందో చూద్దామా!

అంకితి బోస్‌ది ముంబయి. సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో ఎంబీఏ చదివింది. ఆ తరువాత ఓ సంస్థలో పనిచేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థలు భారతీయ మార్కెట్‌లో గుర్తింపు తెచ్చుకోవడం గమనించింది. వాటిని చూశాకే తనకు ‘జిలింగో’ ఆలోచన వచ్చిందంటుంది అంకితి. ‘భారతదేశంలో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌కు ప్రముఖ స్థానం ఉంది. అలాగే లాభాల బాటలో నడుస్తున్నాయవి. అయితే దక్షిణాసియాలో మాత్రం ఈ తరహా మార్కెటింగ్‌ అంతగా విస్తరించలేదు. అందుకే అక్కడ ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ ప్లాట్‌ఫాంని ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. అలా బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఉన్న ధృవ్‌కపూర్‌, నేను కలిసి 2015లో ‘జిలింగో డాట్‌ కామ్‌’ని ప్రారంభించాం. దీన్ని మొదలుపెట్టకముందు సెక్వోయా క్యాపిటల్‌ ఇండియా అనే సీడ్‌ఫండ్‌ కంపెనీలో అనలిస్టుగా చేశా. అక్కడ నాకు వచ్చిన అనుభవాన్ని జిలింగో ఏర్పాటులో ఉపయోగించుకున్నా. బిజినెస్‌ టు బిజినెస్‌ పద్ధతిన చిరువ్యాపారుల్ని ఆహ్వానించి, వాళ్ల ద్వారా కొంత పెట్టుబడి తెచ్చుకున్నా. దానికి కారణం మా ఆలోచన చెప్పినా పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడమే. ఒక విధంగా అనలిస్టుగా చేసిన అనుభవమే నాకు ధైర్యాన్నిచ్చింది. జిలింగో డాట్‌ కామ్‌కు సహ వ్యవస్థాపకురాలిగా, సీఈవోగా బాధ్యతలను చేపట్టే ఆత్మవిశ్వాసాన్ని అందించింది...’ అని చెబుతుంది అంకితి బోస్‌.

* పారిశ్రామికవేత్తలు పెరిగేలా...
ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్‌ రంగంలో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంటే ఆసియా నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువ. దీన్నే అంకితి అవకాశంగా తీసుకుని జిలింగోని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించింది. పెట్టుబడిదారులను రప్పించడమే లక్ష్యంగా మార్చుకుంది. ‘మొదట్లో మాకు అసలు పెట్టుబడిదారులు ఉండేవారు కాదు. ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. ఈ ప్రయాణంలో నాకు ఎక్కువగా పురుషులే చేయూతనందించారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు సహా సింగపూర్‌ ఫ్యాషన్‌రంగ నిపుణులు, ఇండోనేషియాకు చెందిన ముస్లిం వాణిజ్యవేత్తలు మా సంస్థ అభివృద్ధికి కారణమయ్యారు. అలా క్రమంగా మా సంస్థను విస్తరించడం మొదలుపెట్టా. మా సంస్థ ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. బెంగళూరు నుంచి ధృవ్‌కపూర్‌ నేతృత్వంలో 100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మా శ్రమ వృథా కాలేదు. ఇప్పుడు యునికార్న్‌ స్థాయికి చేరుకుంది. దీన్ని ఇంకా విస్తరించే ప్రయత్నంలో ఉన్నాం..’ అని అంటుంది అంకితి బోస్‌.


మరిన్ని