close

బిజినెస్‌

పుస్తకం నుంచి.. విమానం దాకా అద్దెకు లభించును

అంకురం సబ్‌రెంట్‌కరో
ఈనాడు - హైదరాబాద్‌

ఒక వస్తువు కొంటాం.. కొన్నాళ్లకు దాని అవసరం తీరిపోతుంది. ఆ తర్వాత దాన్ని అటకెక్కించేస్తాం. కానీ.. అది అవసరం ఉన్న మరో వ్యక్తికి ఉపయోగపడితే....??? అద్దె రూపంలో అసలు యజమానికి కాస్త డబ్బులు సంపాదించి పెడితే....???
సరిగ్గా ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన సంస్థ.. సబ్‌రెంట్‌కరో.. దాని వ్యవస్థాపకుడు రాజ్‌ శివరాజు... ఉన్నత ఉద్యోగం వదిలి.. ఈ అంకురాన్ని ప్రారంభించిన ఆయన తన గురించీ.. సంస్థ గురించీ చెబుతున్న వివరాలు.. ఆయన మాటల్లోనే..

ది 1990ల నాటి మాట. కంప్యూటర్ల కొలువులు జోరుగా ఉన్న రోజుల్లో బీఏ పూర్తి చేశా. కానీ, కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్ల గురించి తెలుసుకోవాలని అనేక కోర్సులు నేర్చుకున్నా..
అలా ఇవన్నీ నేర్చుకొని, ఉద్యోగంలో చేరకుండా.. సొంత సంస్థను ఏర్పాటు చేశా. దీనికి రవికృష్ణ అనే నా సోదరుడు వరుస అయ్యే వ్యక్తి సహాయం చేశారు.
అమెరికాలో ఉన్న కౌంటీలను డిజిటల్‌ మ్యాపుల రూపంలోకి తీసుకొచ్చే ఒక పనిని పూర్తి చేశాం.
అదే జోరులో కెనడా నుంచి ఒక పెద్ద కంపెనీ మాకు ప్రాజెక్టు ఇస్తానని హామీ ఇచ్చింది..
కనీసం 300 మందితో పెద్ద సంస్థను ఏర్పాటు చేయబోతున్నామనే ఆనందంతో అందుకు అవసరమైన వసతులన్నీ పూర్తి చేశాం.
తీరా ఆ సంస్థ ఆ ప్రాజెక్టును రద్దు చేసింది. అంతే.. డబ్బులన్నీ ఖర్చయి.. మళ్లీ మొదటికి వచ్చాం.
చేసిన అప్పులు తీర్చేందుకు ఉద్యోగంలో చేరక తప్పలేదు. అప్పుడు వై2కే సమస్య తీవ్రత దృష్ట్యా అమెరికాలో ఉన్న అవకాశాలను అందుకునేందుకు అక్కడి వెళ్లాను.
ఆ తర్వాత పలు ప్రముఖ కంపెనీల్లో పనిచేశాను.
డెలాయిట్‌లో పని చేస్తున్నప్పుడే.. ఆ సంస్థ తరఫున భారత్‌లో పనిచేసే అవకాశం లభించింది.
అంతే.. అక్కడి నుంచి ఇక్కడకు 2008లో వచ్చేశాను. కానీ, మనసులో వ్యాపారం చేసే ఆలోచన మాత్రం పోలేదు.
ఒక రోజు మా అబ్బాయి తన వీడియో గేమ్‌ పాతదై పోయిందనీ, కొత్తది కొనాలనీ అడిగాడు. ఇది ఎవరికైనా ఇచ్చేసి, కొత్తది కొన్ని రోజులకు ఇస్తారా అని అడిగాడు. ఇలా అవసరమైన వస్తువులను మార్పిడి చేసుకునే వీలుంటే బాగుంటుంది కదా.. అనే ఆలోచనే ఈ సంస్థ పుట్టుకకు కారణం.
ఈ ఆలోచనలో నాకు నా భవిష్యత్తు కనిపించింది. ఉద్యోగం చేస్తున్నా వ్యాపారంపై ఇష్టం పోని నాకు.. ఇదే వ్యాపారాన్ని నిర్వహించాలని అనుకున్నా.
ఇంట్లో ఉన్న పాత వస్తువులను అవసరం ఉన్న వారికి అద్దెకు ఇస్తే ఎలా ఉంటుంది?
ఈ ఒక్క ప్రశ్నతో దాదాపు 83 మందితో ఒక సర్వేలాంటిది చేశాను.
అందరూ బాగుంటుంది.. అన్నవారే.
ఆ తర్వాత ఉద్యోగం మానేశాను. అప్పటి నా జీతం నెలకు లక్షల్లోనే..
కానీ, ఇక్కడే ఒక చిక్కు ప్రశ్న కూడా ఎదురైంది.
ఇచ్చిన వస్తువు ఇచ్చినట్లుగా రాకపోతే ఏం చేయాలి? ముందుగానే ఆ వస్తువు ధరను మనం తీసుకుంటాం కాబట్టి, ఇబ్బంది లేదు అని అనుకున్నా..
ఇలా నా ఆలోచనకు.. నా పాత ఉద్యోగంలో సహచరులు సహాయ సహకారాలు అందించారు.
అలా 2015 డిసెంబరులో సబ్‌రెంట్‌కరో ప్రారంభమైంది. సొంత ఖర్చుతోనే..
పాత వస్తువులను అద్దెకు ఇచ్చేందుకు ముందుకు ఎవరు వస్తారు? మా కుటుంబ సభ్యులు, బంధువులతోనే ప్రయోగం చేశాను.
మొదట వ్యక్తుల నుంచి వ్యక్తులకు అద్దెకు వస్తువులను ఇవ్వడం ప్రారంభించాం.
అద్దెకు ఇచ్చిన వారికి ఆ వస్తువు పూర్తి ధరను డిపాజిట్‌గా చెల్లించాను.
ఆ తర్వాత అద్దెకు ఇచ్చేవాళ్లం.
అద్దెకు తీసుకున్నవారి అవసరం తీరాక అద్దె మొత్తంలో యజమాని నుంచి 10శాతం, అద్దెకు తీసుకున్న వారి నుంచి 10శాతం మా కమీషన్‌ తీసుకొని, తర్వాత డిపాజిట్‌ను తెచ్చుకున్నాం.
ఇలా నమ్మకం కుదిరేందుకు చాలా కాలమే పట్టింది.
మా దగ్గర వస్తువులు తక్కువగా ఉండటం, గిరాకీ పెరుగుతూ ఉండటంతో.. అద్దెకు ఇచ్చే సంప్రదాయ వ్యాపారాలు చేసే వారినందరినీ మా వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాం.
ఇక్కడి నుంచే మా వ్యాపారం మలుపు తిరిగింది. అద్దెకు తీసుకున్న వ్యక్తులకు వస్తువులను జాగ్రత్తగా అందించండంతోపాటు, తిరిగి దాన్ని స్వాధీనం చేసుకునే వరకూ అన్నీ మేమే చూసుకుంటాం.

వస్తువు ఏదైనా..

మా దగ్గర ఇప్పుడు పుస్తకం నుంచి విమానం వరకూ అన్ని వస్తువులూ అద్దెకు దొరుకుతాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఫర్నిచర్‌, గృహోపకరణాలు.. కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు.. ఏసీలు ఇలా అనేకానేక వస్తువులు, ఖరీదైన గడియారాలు, నగలు ఏవైనా సరే.. మా దగ్గర అద్దెకు లభిస్తాయి. 75 విభాగాలు, 24,800 వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ప్రొజెక్టర్లు అద్దెకు వెళ్తుంటాయి. కొన్నాళ్లపాటు విదేశాలకు వెళ్తున్న చాలామంది ఇప్పుడు మా సబ్‌రెంట్‌కరోలో తమ వస్తువులను అద్దెకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అద్దెకు తీసుకున్న వ్యక్తుల నుంచి డిపాజిట్‌ రూపంలో ముందుగానే డబ్బు తీసుకుంటాం.. కాబట్టి, వస్తువు ఉన్నది ఉన్నట్లుగానే అప్పగిస్తుంటారు.  కనీసం రెండు రోజుల్నుంచి, 11 నెలల వరకూ వస్తువులు మేం అద్దెకిస్తాం. 

విస్తరణ దశలో..

హైదరాబాద్‌ నుంచి ప్రారంభమైన మా అద్దె సేవలు ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, దిల్లీ, జయపుర, పుణేలకు విస్తరించాం. మరిన్ని నగరాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ముందు పెట్టుబడికి అవసరమైన రూ.కోటిని నేను సొంతంగా సమకూర్చుకున్నా. మరో రూ.కోటిన్నర వరకూ బంధువులు, స్నేహితులు సర్దుబాటు చేశారు. ప్రైవేటు పెట్టుబడుల రూపంలో మరో రూ.3కోట్ల వరకూ ఇప్పటి వరకూ సమకూర్చుకున్నాం. ఒక పెద్ద పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నాం..ప్రస్తుతం అద్దెకిచ్చే వ్యాపారుల నుంచి వినియోగదారులకు అద్దెకిచ్చే విభాగంలో నెలకు రూ.40లక్షల టర్నోవర్‌ సాధిస్తున్నాం. సంస్థల నుంచి సంస్థలకు ఇస్తున్న అద్దెల ద్వారా మరో రూ.40లక్షల వరకూ టర్నోవర్‌ ఉంది. వార్షిక టర్నోవర్‌ చూస్తే సగటున రూ.7 కోట్ల వరకూ ఉంటోంది. 

చిన్న ఉద్యోగులతోనే..

అంకుర సంస్థల్లో పనిచేసేందుకు సాధారణంగా ఎవరూ ముందుకు రారు. ఈ ఇబ్బంది మాకూ ఎదురైంది. దీన్ని అధిగమించడానికి నేను గ్రామీణ నేపథ్యం ఉండి, మంచి ప్రతిభ ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఉద్యోగాలు లభించని వారిపై దృష్టి సారించాను.  ఇలా తొలుత 8 మందిని తీసుకున్నాం.  ప్రస్తుతం 28 మంది ఉద్యోగులు ఉన్నారు.   కీలక బాధ్యతలు నిర్వహించే వారు తప్ప మిగతా వారందరూ గ్రామీణ ప్రాంతాల వారే. వెబ్‌సైటు అభివృద్ధిలో మాత్రం నా మిత్రులు సహకరించారు. 

నెలకు 65వేల మంది..

మా సంస్థ ప్రారంభించిన కొత్తలో నెలకు 100-200 మంది మా సైటును సందర్శించేవారు.. ఇప్పుడు వారి సంఖ్య దాదాపు 65,000 వరకూ ఉంది. మా దగ్గర 43 వేల మంది నమోదు చేసుకున్నారు. 12,000 మంది మా దగ్గర్నుంచి పలు వస్తువులు అద్దెకు తీసుకున్నారు. పలు ఎంఎన్‌సీలు, సంస్థలు కూడా మా ఖాతాదారుల జాబితాలో ఉన్నాయి. 

సబ్‌రెంట్‌కరో నుంచి తొలిసారిగా అద్దెకు వెళ్లిన వస్తువు ఏమిటో తెలుసా?.. గ్యాస్‌ సిలిండర్‌, పొయ్యి. అదీ రెండు రోజుల కోసం..


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు