మినీ సార్వత్రిక సమరం
close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మినీ సార్వత్రిక సమరం

యిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రణభేరి మోగింది. ముందస్తుకు సంసిద్ధమైన తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం శాసనసభల ఎన్నికల కాలపట్టికను నిర్వాచన్‌ సదన్‌ ప్రకటించింది. మొత్తం 679 అసెంబ్లీ స్థానాలు, పద్నాలుగు కోట్లు దాటిన ఓటర్లతో డిసెంబరు 15లోగా ఎన్నికల ప్రక్రియను ముగించేలా మినీ సార్వత్రికానికి ఈసీ శ్రీకారం చుట్టింది. కత్తికట్టిన కోడిపుంజుల్లా భాజపా, కాంగ్రెస్‌ ముఖాముఖి తలపడే మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్లతో జత కలిసి 2013లో దేశ రాజధాని దిల్లీలోనూ ఎన్నికల క్రతువు జరిగింది. అర్ధాంతరంగా అసెంబ్లీ రద్దు దరిమిలా దిల్లీకి 2015లోనే తిరిగి ఎన్నికలు నిర్వహించడం, కడపటి రాష్ట్రంగా పురుడు పోసుకున్న తెలంగాణ, తొలి ఎన్నికలకు తొందరపడి తక్కినవాటితో పాటే బ్యాలెట్‌ సమరానికి సై అనడంతో తాజా రాజకీయం రసకందాయంలో పడింది. భాజపా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్ష హోదాలో రాహుల్‌ నాయకత్వ పటిమకు తొలి పోటీగా ప్రతీతమైన 2013నాటి ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో హ్యాట్రిక్‌ విజయాన్ని కమలం పార్టీ సాధించగా- రాజస్థాన్‌, దిల్లీల్లో కాంగ్రెస్‌ అక్షరాలా బిక్కచచ్చిపోయింది. 1977లో ఆత్యయిక పరిస్థితి దరిమిలా దేశవ్యాప్తంగా జనతా ప్రభంజనంతో దిమ్మెరపోయిన దశలో వచ్చిన సీట్లకన్నా మరింతగా పునాదులు కోసుకుపోయి డీలాపడిపోయిన కాంగ్రెస్‌ను- 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ అంతకంటే అధ్వానంగా ఫలితాలు వెక్కిరించాయి. ఈసారి పార్టీ పునర్‌వైభవం మినీ సార్వత్రికం నుంచే ప్రస్ఫుటమవుతుందంటూ ఆశల మాలికలు అల్లుతున్న కాంగ్రెస్‌- ఈశాన్యంలో ఏకైక కోటలా మిగిలిన మిజోరమ్‌లో వరసగా మూడోసారి విజయానికి పాకులాడుతోంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్లలో కమలంతో హస్తం బాహాబాహీ తలపడుతుండగా, తెలంగాణలో మహాకూటమి కట్టి తెరాస దూకుడు నియంత్రించడానికి పావులు కదుపుతోంది. పాలక ప్రతిపక్షాలన్నింటికీ ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ ఎన్నికల ఫలితాలే- భారతావని నాడికి ముందస్తు సూచికలు కానున్నాయి!

ఇటీవల సేవాగ్రామ్‌లో భేటీ అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ- మహాత్ముడి క్విట్‌ ఇండియా మాదిరిగానే మోదీని పదవీచ్యుతుణ్ని చేసేలా సరికొత్త స్వాతంత్య్రోద్యమాన్ని రాహుల్‌ సారథ్యంలో ప్రారంభిస్తామని తీర్మానించింది. మహా ఘట్‌బంధన్‌ (మహాకూటమి) ఏర్పాటుద్వారా భాజపా వ్యతిరేక ఓట్లు చీలకుండా కాచుకొని కమలం పార్టీని దీటుగా ఎదుర్కొంటామని ఘనంగా ప్రకటించింది. 2003-13 నడుమ మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో క్రమంగా ఓట్లశాతం మెరుగుపరచుకొంటూ కూడా కాంగ్రెస్‌ అధికారానికి ఆమడదూరంలో ఆగిపోవాల్సివచ్చింది. పాలక పక్షాన్ని అయిదేళ్లకోమారు మారుస్తున్న రాజస్థాన్‌లో ఈసారి హస్తం పార్టీకే సుడి తిరుగుతుందని కాంగ్రెస్‌ కామందులు భావిస్తున్నా- సంప్రదాయంగా ఆ పార్టీ కొమ్ముకాస్తున్న షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, దిగువ ఓబీసీ వర్గాల్లోకీ భాజపా చొచ్చుకుపోవడం కలవరకారకమవుతోంది. గెలుపోటములతో నిమిత్తం లేకుండా నిర్దిష్ట ఓటుబ్యాంకు కలిగి ఉండి, పొత్తు పెట్టుకున్న పక్షానికి ఓట్లను గంపగుత్తగా బదిలీ చేసే సామర్థ్యంగల బహుజన్‌ సమాజ్‌ పార్టీతో దోస్తానా బాగా కలిసివచ్చేదే అయినా, తమ గెలుపు నల్లేరు మీద బండి నడకేనన్న ధీమాతో కాంగ్రెస్‌ ఒంటెత్తు ధోరణి ప్రదర్శించడం- మహాకూటమి ప్రతిపాదనను మొగ్గలోనే తుంచేసింది. ‘రాజే’స్థాన్‌లో 22 ఉప ఎన్నికలు జరగగా 20 గెలిచామన్న కాంగ్రెస్‌ నేతలు అదే ధీమాతో మాయావతిని దూరం పెట్టిన నేపథ్యంలో- ఛత్తీస్‌గఢ్‌లో అజిత్‌ జోగితో బీఎస్పీ పొత్తు, మధ్యప్రదేశ్‌లోనూ ఏనుగుపార్టీ ఆరేడు శాతం ఓట్లు చీల్చగల విపత్తు రేపటి ఎన్నికల్ని విశేషంగా ప్రభావితం చెయ్యనున్నాయి. ఆగస్టునాటి పోల్‌ సర్వేలతో ఖుషీగా ఉన్న కాంగ్రెస్‌కు గెలుపు అంత ఆషామాషీ కాదని క్షేత్రస్థాయి వాస్తవాలు ఎలుగెత్తుతున్నాయి.

‘తెలంగాణ పునర్నిర్మాణమే ఏకైక లక్ష్యంగా ముందుకెళతాం’ అన్న కేసీఆర్‌ మాటే మంత్రమై క్రితంసారి ఎన్నికల్లో 34.15 శాతం ఓట్లతో తెరాస కారు 63 స్థానాల్లో దూసుకుపోయింది. తెరాసను ప్రబల రాజకీయ శక్తిగా తీర్చే క్రమంలో భారీగా వలసల్ని ప్రోత్సహించిన కేసీఆర్‌ వ్యూహంతో ప్రతిపక్షాలు కుదేలైపోగా, నేడు కాంగ్రెస్‌ సహా తక్కినవీ మహాకూటమి కట్టి అక్షరాలా అస్తిత్వపోరాటం చెయ్యాల్సి వస్తోంది. ఉప ఎన్నికలు అన్నింటిలోనూ ఎదురులేని విజయాలు సాధించిన తెరాస- స్వీయప్రగతి ప్రస్థానంపైనే ఓటర్ల తీర్పు కోరాలని నిశ్చయించడంతో ముందస్తు ఎన్నికలు తోసుకొచ్చాయి. మెజారిటీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించి యాభై రోజుల్లో వంద సభల ప్రణాళికతో తెరాస ప్రచారపర్వాన్ని ఈసరికే హోరెత్తిస్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి, కూటమి సీట్ల పంపకాల్లో తకరారు రాకుండా పట్టువిడుపులతో వ్యవహరిస్తామన్న సంకల్పాలు విపక్ష శిబిరం నుంచి చెవిన పడుతున్నాయి. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్లలో ఒంటరిపోరుకు సై అన్న కాంగ్రెస్‌, తెలంగాణలో మహాకూటమికే మొగ్గుచూపింది. వైకాపా ఎంపీల రాజీనామా నేపథ్యంలో, ఏపీలో ఉప ఎన్నికలకు అవకాశం లేదని సాంకేతిక కారణాల్ని ఈసీ ఏకరువు పెట్టడం గమనార్హం. ఎప్పటి మాదిరిగానే ఈసారీ ఓటర్ల జాబితా తప్పుల తడక అంటూ వివాదగ్రస్తం కావడం- జనస్వామ్య హితైషులకు శిరోభారం! నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయ్యేదాకా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు జరుగుతూనే ఉంటాయన్న ఈసీ- అందుకు సంబంధించి శాస్త్రీయ, పారదర్శక వ్యవస్థను నెలకొల్పకపోవడమే పలు సందేహాలకు తావిస్తోంది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్ని నిర్దుష్టంగా తీర్చిదిద్దినప్పుడే, ఎన్నికలు స్వేచ్ఛగా సక్రమంగా జరిగే అవకాశం ఉంటుంది!


దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo